Read more!

English | Telugu

సునీల్ అందుకే ఫెయిల్ అవుతున్నాడా?

 

బంతి లాంటి ఆకారం, భీమ‌వ‌రం యాస‌, చూడ‌గానే పెదాల‌పై న‌వ్వొచ్చేసే బాడీ లాంగ్వేజ్‌!  సునీల్ క‌మెడియ‌న్ గా నిల‌బ‌డ్డానికి ఇవే ఆయుధాల‌య్యాయి.. సాధ‌నాలుగా మారాయి. అత‌ని కామెడీ టైమింగ్ సూప‌ర్బ్ అన్నారు జ‌నాలంతా. కొన్ని సినిమాల్ని.. త‌న భుజాల‌పై వేసుకొని లాగించేశాడు. బంకు శీను, స‌త్తి, బంతి... ఇలా ఒక‌టా రెండా... ఎన్నో క్యారెక్ట‌ర్లూ... అన్నీ 24 క్యారెక్ల బంగారాలే!  ఏ స్టార్ క‌మెడియ‌న్‌కైనా... ఒక ద‌శ‌లో 'ఎంత కాల‌మ‌ని ఈ చిన్నా చిత‌కా వేషాలూ... హీరో అయిపోతే పోలా..' అనిపిస్తుంది. సునీల్‌కీ అలానే అనిపించింది. దాంతో అందాల రాముడుతో ప్ర‌మోష‌న్ కొట్టేశాడు.  అందులో ఇది వ‌ర‌క‌టి సినిమాల్లానే కామెడీ చేస్తూ... అదిరిపోయే స్టెప్పులేశాడు. ఏంటి?  సునీల్‌లో ఇంత మంచి డాన్స‌ర్ ఉన్నాడా?

 

అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. దాంతో సునీల్ మైలేజీ పెరిగింది. అది ఏ స్థాయిలోకి వెళ్లిందంటే... ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమాలో హీరో అయ్యేంత క్రేజ్ వ‌చ్చేసింది. మ‌ర్యాద రామ‌న్న గురించి చెప్పేదేముంది?  అది రాజ‌మౌళి సినిమా. హిట్ట‌వ్వాల్సిందే. అలాగ‌ని సునీల్‌ని త‌క్కువ చేయ‌కూడ‌దు. తానూ.. అద‌రగొట్టేశాడు. పూల రంగ‌డూ హిట్ట‌య్యేస‌రికి సునీల్‌పై అంచ‌నాలు పెరిగాయి. ఎంత‌లా అంటే.. తానే అందుకోలేంత‌న బీభ‌త్సంగా!  అక్క‌డి నుంచి ఇదిగో నిన్నటి `కృష్ణాష్ట‌మి` వ‌ర‌కూ సునీల్‌కి అన్నీ క‌ష్టాలే.

కృష్ణాష్ట‌మి ఫ్లాప్ తో సునీల్ డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయుంటాడు. ఎందుకంటే... ఈసినిమాపై త‌ను చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. అంతే క‌ష్ట‌ప‌డ్డాడు కూడా. ఆప‌రేష‌న్ బాధ‌ని ఓర్చుకొంటూ కూడా.. స్టెప్పులేశాడు. త‌న బాడీ లాంగ్వేజ్ మార్చుకొన్నాడు. పాత్ర ప‌రంగానూ క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమాలోనూ అన్నీ ఉన్నాయ్‌.. కానీ ఏదో లోటు.  ఆ లోటు పేరే... సునీల్ స్టైల్ ఆఫ్ కామెడీ.

సునీల్ అంటే వినోద‌మే.... అన్న‌ది జ‌నాల అభిప్రాయం. ఈ భీమ‌వ‌రం బుల్లోడు నుంచి జ‌నాలు కోరుకొనేది ఆ న‌వ్వులే. సునీల్ వ‌చ్చాడా, ఫ‌టాఫ‌ట్ పంచ్‌లేశాడా.. న‌వ్వించాడా అనేదే చూస్తున్నారంతా. క‌మెడియ‌న్‌గా త‌న బ‌లం అదే. దాన్ని మ‌ర్చిపోయి గార‌డీలు మొద‌లెట్టాడు సునీల్‌. అత‌నిలో మంచి డాన్స‌ర్ ఉన్నాడ‌న్న సంగ‌తి అందాల రాముడుతోనే తెలిసిపోయింది. మ‌ర్యాద రామ‌న్న‌లో మ‌రో మెట్టు పైకెళ్లాడు. సిక్స్ ప్యాక్‌తో పూల రంగ‌డుతో షాక్ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత‌... డాన్సులు ఇంకా బాగా చేయాల‌ని, ఫైట్ల‌లో దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడే త‌ప్ప‌... క‌మెడియ‌న్‌గా ఎంత న‌వ్వించాడో, ఎన్ని కిత‌కిత‌లు పెట్టాడో అది మ‌ర్చిపోతున్నాడు. సునీల్ హీరో అయిపోవొచ్చు. మిగిలిన మాస్ హీరోల్లా.. డాన్సులు, ఫైట్లూ చేస్తుండొచ్చు. కానీ... అత‌న్నుంచి ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు వినోదాన్నే కోరుకొంటున్నారు. అది ఇవ్వ‌డంలో మాత్రం సునీల్ ఫెయిల్ అవుతూనే వ‌చ్చాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌నే తీసుకోండి. తాను ఎన్ని ఫార్ములాలు ప‌ట్టుకొని తిరిగినా.. అంతిమంగా ప్ర‌తీ సినిమాతోనూ న‌వ్వించాడు. అదే... రాజేంద్రుడి గెలుపు ర‌హ‌స్యం. అలీ లాంటి క‌మెడియ‌న్లు హీరోగా నిల‌దొక్కుకోక‌పోవ‌డానికి కార‌ణం.. అదే.

 

త‌మ బ‌లాన్ని వ‌దిలి.. మాస్ హీరోలా చెలామ‌ణీ అవ్వాల‌ని చూస్తారు. అక్క‌డే ప్ర‌య‌త్నాలు బెడ‌సి కొడుతుంటాయి. సునీల్ కూడా... అదే చేస్తున్నాడు. పైగా ఈ సిక్స్ ప్యాక్ వ్యామోహం నుంచి బ‌య‌ట‌ప‌డాలి. బుగ్గ‌లు లాగేసిన సునీల్ మొహాన్ని అస్స‌లు చూళ్లేక‌పోతున్నారు జ‌నాలు. ర‌ఫ్ లుక్ త‌న‌కు సూట్ కాద‌న్న విష‌యం సునీల్ గ్ర‌హించాలి. క‌థ‌లో, త‌న పాత్ర‌లో ఏదో ఓ మ్యాజిక్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి. త‌న‌దైన శైలిలో ఎప్పుడూ న‌వ్విస్తూ ఉండాలి. మాస్ హీరోగా ఎద‌గాలి అన్న ట్యాగ్ లైన్‌ని విసిరి అవ‌త‌ల కొట్టి, వినోదాత్మ‌క క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తే... సునీల్ కెరీర్ మ‌ళ్లీ గాడిలో ప‌డే అవ‌కాశాలున్నాయి.