Read more!

English | Telugu

ఎన్టీఆర్ సినిమా రచ్చ.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఫైర్!

పదేళ్ల క్రితం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం.. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, డైరెక్టర్ హరీష్ శంకర్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ హరీష్ శంకర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. "హరీష్ శంకర్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. రామయ్యా వస్తావయ్యా సినిమా చేసేటప్పుడు అతనేదో ఒక ఇదిలో ఉండేవాడు. అది కాదన్నా ఇది కాదన్నా అంటూ అస్తమానం అడ్డుపడిపోయేవాడు. చెప్పడానికి ట్రై చేశాను కానీ అతను వైన్ మూడ్ లో ఉండట్లే. అందుకే ఇక అతనికి ఏం కావాలో అది చేశాను." అని ఛోటా కె. నాయుడు చెప్పుకొచ్చాడు.

ఇక ఛోటా కె. నాయుడు కామెంట్స్ కి హరీష్ శంకర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. "గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి(వయసులో పెద్ద కాబట్టి) నమస్కరిస్తూ.... రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. 

మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో, గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు.. అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే “గబ్బర్ సింగ్” వచ్చినప్పుడు నాది “రామయ్యా వస్తావయ్యా” వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా. కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే.. any day, any platform, I AM WAITING - భవదీయుడు హరీష్ శంకర్." అంటూ ఒక లెటర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు హరీష్ శంకర్.