English | Telugu

డబ్బులిస్తే ఏదైనా చేసేస్తారా.. నాగ్‌ అశ్విన్‌పై గరికిపాటి నరసింహారావు ఫైర్‌!

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన ‘కల్కి 2898’ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత మహాభారత గాధలోని పాత్రల తీరు తెన్నుల గురించి అనేక విమర్శలు వచ్చాయి. కొన్నిరోజుల పాటు కల్కిలోని పాత్రల గురించే మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఎంతోమంది ప్రముఖులు సినిమా గురించి రకరకాల కామెంట్లు చేశారు. ఇప్పుడా వేడి కాస్త తగ్గింది. ఈ సినిమా రెండో భాగం వస్తుంది కదా.. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది అని అందరూ సర్ది చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. చాలా ఆలస్యంగా ప్రముఖ ప్రవచన కర్త గరికిపాటి నరసింహారావు ‘కల్కి’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘కర్ణుడు ఎవరో తెలియకపోతే ‘కల్కి’ సినిమాలో చూపించినవాడే కర్ణుడు అనుకోవాలి. మనమేం చేస్తాం. సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది మనం చూడాలి. మహా భారతంలో ఉన్నది వేరు, ఆ సినిమాలో చూపించింది వేరు. అశ్వద్థామ, కర్ణుడు అర్జెంట్‌గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు వంటి వారు విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావడం లేదు. బుర్ర పాడైపోతుంది. కర్ణుడినే అశ్వద్థామ కాపాడాడు తప్ప అశ్వద్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. ఎందుకంటే అశ్వద్ధామ మహావీరుడు. ఇవన్నీ భారతం చదివితే తెలుస్తుంది. ‘ఆచార్య పుత్రా ఆలస్యమైనదా..’ అంటూ కర్ణుడికి ఓ డైలాగ్‌ పెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మనకు ఏ డైలాగ్‌ కావాలంటే ఆ డైలాగ్‌ పెట్టేసుకోవడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్‌ రాసేవాడు రాసేస్తాడు కదా..’ అంటూ ‘కల్కి’ చిత్రంపై తనకు ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గరికిపాటి నరసింహారావు. 

ఇప్పుడు గరికిపాటి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కొందరు నాగ్‌ అశ్విన్‌ని సపోర్ట్‌ చేస్తుంటే మరికొందరు గరికిపాటి చెప్పిందే కరెక్ట్‌ అంటున్నారు. కల్కిలో చూపించిన కథ నిజంగా జరిగిందన్న విషయాన్ని నాగ్‌ అశ్విన్‌ ఎక్కడా ప్రస్తావించలేదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, నటరత్న ఎన్టీఆర్‌ చేసిన పౌరాణిక సినిమాలను ఉదాహరణగా చెబుతున్నారు. రామాయణ, మహాభారతాల్లోని కథలను తీసుకొని ఎన్నో సినిమాలు రూపొందించారు. అయితే తన ఆలోచనలకు తగ్గట్టుగానే ఆయా పాత్రల్లో ఎన్నో మార్పులు చేశారు. ఒక దశలో రావణాసురుడ్ని కూడా హీరోగా చూపించడం ఎన్టీఆర్‌ ఒక్కరికే సాధ్యమైంది. మరి ఇప్పుడు కల్కి గురించి, అందులోని పాత్రల గురించి విమర్శించడం కరెక్ట్‌ కాదని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.