Read more!

English | Telugu

గ్యాంగ్ లీడర్ రీమేక్ లో రామ్ చరణ్..?

నిన్నటితో గ్యాంగ్ లీడర్ కు పాతికేళ్లు పూర్తయ్యాయి. 1991 మే 9 వ తేదీన రిలీజైన గ్యాంగ్ లీడర్ సినిమా, చిరంజీవిని పూర్తి మాస్ హీరోగా స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ సినిమాకు నేటికీ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అంతలా రికార్డుల మోత మోగించిందీ సినిమా. అప్పటి వరకూ ఉన్న జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రికార్డులను ఈ సినిమా బద్ధలుగొట్టేసింది. చిరంజీవి స్టార్ డమ్ ను ఆకాశంలోకి తీసుకెళ్లిన సినిమా గ్యాంగ్ లీడర్. పాతికేళ్ల గ్యాంగ్ లీడర్ గురించి మాట్లాడుతూ చిరంజీవి చరణ్ ను గ్యాంగ్ లీడర్ రీమేక్ లో చూడాలని ఉందనడం విశేషం.

చరణ్ సినిమా చేస్తాడో లేదో తెలీదు గానీ, గ్యాంగ్ లీడర్లోని చిరు డైలాగ్ కు డబ్ స్మాష్ మాత్రం చేశాడు. మెగాఫ్యాన్స్ ఈ డబ్ స్మాష్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. చిరు మాటల బట్టి చూస్తుంటే, త్వరలోనే గ్యాంగ్ లీడర్ సినిమా చెర్రీ హీరోగా పట్టాలెక్కే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ధృవ సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ, తర్వాత రెండు మూడు సినిమాల్లో గ్యాంగ్ లీడర్ రీమేక్ కూడా ఉంటే ఆశ్చర్యం లేదేమో. లేటయ్యిందంటే, ఇప్పటికే మావయ్య సినిమా పాటల్ని కుమ్మేసుకుంటున్న సాయి ధరమ్, గ్యాంగ్ లీడర్ ను కూడా రీమేక్ చేసే ప్రమాదం చరణ్ కు ఉంది. చిరు కోరిక మేరకు, చెర్రీ త్వరలోనే ఈ సినిమాలో నటిస్తే ఫ్యాన్స్ కు ఒకే గానీ, చిరు యాక్టింగ్ ఇరగదీసిన ఆ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడా లేదా అన్నదే అసలు ప్రశ్న.