English | Telugu

‘పుష్ప2’కి డివైడ్‌ టాక్‌.. టార్గెట్‌ రీచ్‌ అవ్వడం అంత ఈజీ కాదు!

ఇంతకుముందు ఏ తెలుగు సినిమాకీ జరగని విధంగా ‘పుష్ప2’ చిత్రానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ గురించి రకరకాల ఫిగర్స్‌ ప్రచారంలో ఉన్నాయి. రూ.1000 కోట్లకు పైగా బిజినెస్‌ జరిగిందని చెప్పుకున్నారు. అయితే అందులో వాస్తవమెంత? నిజంగానే థియేట్రికల్‌ బిజినెస్‌ అంత జరిగిందా? అనేది తెలుసుకుందాం. 

‘పుష్ప2’ రిలీజ్‌కి ముందు చెప్పుకున్నట్టుగా రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిన మాట వాస్తవమే అయినా అందులో ఓటీటీ రైట్స్‌తోపాటు ఇతర మాధ్యమాల కోసం జరిగిన బిజినెస్‌ కూడా ఉంది. కేవలం థియేటర్ల వరకు రూ.617 కోట్లు బిజినెస్‌ జరిగింది. అయితే ఇప్పటివరకు హయ్యస్ట్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరు మీద ఉంది. ఆ సినిమా రూ.520 కోట్లు మాత్రమే చేసింది. అలాగే బాహుబలి2 రూ.355 కోట్లు, కల్కి రూ.370 కోట్లు బిజినెస్‌ చేశాయి. పుష్ప2 617 కోట్లు బిజినెస్‌ చేయడం నిజంగా రికార్డ్‌ అనే చెప్పాలి. ఇక ఏరియావైజ్‌ జరిగిన బిజినెస్‌ గురించి చెప్పాలంటే.. నైజాం 100 కోట్లు, సీడెడ్‌ 30 కోట్లు, ఉత్తరాంధ్ర 23 కోట్లు, ఈస్ట్‌ 14 కోట్లు, వెస్ట్‌ 10 కోట్లు, గుంటూరు 16 కోట్లు, కృష్ణా 13 కోట్లు, నెల్లూరు 9 కోట్లు.. ఇలా రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.215 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. 

పక్క రాష్ట్రాలైన తమిళనాడులో ఇంతవరకు ఏ తెలుగు సినిమాకీ జరగనంతగా 52 కోట్లు, కర్ణాటక 32 కోట్లు, కేరళ 20 కోట్లు బిజినెస్‌ జరిగింది. ఇంతకుముందు కేరళలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం 12 కోట్లు బిజినెస్‌ చేసింది. ఇవి కాక నార్త్‌లో 200 కోట్ల బిజినెస్‌ చేశారు. ఇంతకుముందు ఆర్‌ఆర్‌ఆర్‌ 114 కోట్లు బిజినెస్‌ చేసింది. ‘పుష్ప2’ నార్త్‌లో హయ్యస్ట్‌ బిజినెస్‌ చేసింది. ఇక ఓవర్సీస్‌లో 100 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఇంతకు ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ 76 కోట్లు మాత్రమే చేయగలిగింది. అంటే దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో, ఓవర్సీస్‌లో కూడా ‘పుష్ప2’ తన హవా కొనసాగిస్తోంది. మొత్తానికి 617 కోట్ల బిజినెస్‌ జరిగింది కాబట్టి 650 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేస్తే సినిమా హిట్‌ అయింది అనుకోవచ్చు. అంత షేర్‌ రావాలంటే కనీసం 1100 కోట్లు గ్రాస్‌ కలెక్ట్‌ చెయ్యాలి. అలా కలెక్ట్‌ చేస్తే బయ్యర్లంతా సేఫ్‌ అవుతారు. అంతకుమించిన స్థాయిలో కలెక్షన్స్‌ వస్తే పుష్ప2 బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. 

ప్రస్తుతం ‘పుష్ప2’కి ఉన్న మేనియా చూస్తుంటే సినిమాకి బ్రేక్‌ ఈవెన్‌ వస్తుందని, ఓవర్‌ఫ్లో కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్‌ ఉంది, మరో 10 రోజుల పాటు పెరిగిన టికెట్‌ రేట్లే అమలులో ఉంటాయి కాబట్టి పైన పేర్కొన్న కలెక్షన్స్‌ సాధించడం అంత కష్టం కాదేమో అంటున్నారు. ‘పుష్ప2’ చిత్రాన్ని 12,000 థియేటర్లలో రిలీజ్‌ చేశారు. పెరిగిన టికెట్‌ రేట్లను బట్టి మొదటి రోజు రూ.250 కోట్లు వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ వీకెండ్‌ ముగిసేసరికి రూ.400 కోట్ల వరకు కలెక్ట్‌ చేసే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి ఈ సినిమా కలెక్షన్‌ టార్గెట్‌ను రూ.2000 కోట్లకు పెట్టుకున్నారు. 

డిసెంబర్‌ 4 రాత్రి మొదటి ప్రీమియర్‌ పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు సినిమాపై డివైడ్‌ టాక్‌ వినిపిస్తోంది. సినిమాలో కథ తప్ప అన్ని హంగులూ వున్నాయంటున్నారు. పార్ట్‌ 1తో కంపేర్‌ చేస్తే పార్ట్‌ 2 వీక్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. దీన్నిబట్టి మేకర్స్‌ అనుకున్న టార్గెట్‌ను రీచ్‌ అవ్వడం అంత ఈజీ కాదనిపిస్తోంది. అయితే టాక్‌ ఎలా ఉన్నా వందల కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జనంలో ఉన్న మేనియాతో పుష్పరాజ్‌ ఆ టార్గెట్‌ను ఈజీగా రీచ్‌ అవుతాడు అంటున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్‌ విషయంలో ఏం జరుగుతుంది? ఫిగర్స్‌ ఎలా ఉంటాయి అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్‌ చెయ్యక తప్పదు.