Read more!

English | Telugu

సైంటిస్ట్‌ అవ్వాలనుకున్నాడు.. డైరెక్టర్‌గా దుమ్ము రేపుతున్నాడు!

‘మనుషుల్లో మంచివాడు, చెడ్డవాడు అనే రెండు క్వాలిటీలు ఉండవు. అవసరం కోసం మంచి, అవకాశాన్ని బట్టి చెడు బయటికి వస్తుంటాయి. మనుషులకు మంచివాడు, చెడ్డవాడు అనే బోర్డులు తగిలించలేం. ఎందుకంటే ఏ మనిషీ పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కాదు. అందుకే సమాజంలో ఎన్నో ఇన్సిడెంట్స్‌ మనల్ని ఇన్‌స్పైర్‌ చేస్తుంటాయి. నేను వాటిని ప్రత్యేకంగా చూస్తాను కాబట్టి ఆ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని సినిమాలు తీస్తున్నాను’ అంటున్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. 

అతనో లెక్కల మాస్టారు. చదువుకునే రోజుల్లోనే పెద్దయిన తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అనుకునేవాడు. మొదట ప్రొఫెసర్‌ అవ్వాలని, ఆ తర్వాత సైంటిస్ట్‌ అవ్వాలనుకున్నాడు. ఒక సైన్స్‌ ఎగ్జిబిషన్‌కి వెళ్ళి అక్కడ స్టూడెండ్స్‌ తయారు చేసిన ఐటమ్స్‌ చూసిన తర్వాత అది ఎంత కష్టమో అర్థమైంది. తనకి చిన్నతనం నుంచే రచనా వ్యాసంగంపై కాస్త పట్టు ఉండడంతో రైటర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ టైమ్‌లోనే రచయిత యండమూరి వీరేంద్రనాత్‌ ఓ సినిమాను డైరెక్ట్‌ చెయ్యబోతున్నారనే వార్త వచ్చింది. అంటే ఒక రైటరే డైరెక్టర్‌ అవుతున్నాడంటే అది ఇంకా గొప్పది అనే విషయం సుకుమార్‌ మనసులో నాటుకుపోయింది. ఈలోగా డిగ్రీ పూర్తయింది. ఆ టైమ్‌లోనే అతను లెక్కలపై మంచి పట్టు సాధించాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓ కాలేజీలో ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రాలు ట్యూషన్లు కూడా చెప్పేవాడు. అలా ఏడు సంవత్సరాలు గడచిపోయాయి. లైఫ్‌ అంటే ఇదేనా.. ఇంకా ఏదో సాధించాలి అనే పట్టుదల అతనిలో పెరిగింది. అప్పట్లోనే రూ.35 వేలు జీతానికి పనిచేస్తున్న సుకుమార్‌ దాన్ని వదులుకొని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రూ.1500కి పని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. తన తోటి లెక్చరర్స్‌ ఇద్దరితో కలిసి హైదరాబాద్‌ బయల్దేరారు. ముగ్గురు స్నేహితులు ఎన్నో ప్రయత్నాల తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. 

ఆ తర్వాత చిరంజీవి, జయంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రానికి, ఎ.రాజా దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘దిల్‌’ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు సుకుమార్‌, ఆ సమయంలోనే సుకుమార్‌లోని టాలెంట్‌ని గుర్తించిన దిల్‌ రాజు మంచి కథ ఉంటే చెప్పమని సుకుమార్‌ని అడిగాడు. అప్పుడు తన దగ్గర ఉన్న ఆర్య కథను చెప్పాడు. దిల్‌రాజుకి ఆ కథ బాగా నచ్చింది. అప్పుడు నితిన్‌, రవితేజ, ప్రభాస్‌లకు ఈ కథను చెప్పారు. కానీ, ఎవ్వరికీ నచ్చలేదు. చివరికి అల్లు అర్జున్‌కి చెప్పడం, అతనికి కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా స్టార్ట్‌ చేసేశారు. ‘ఆర్య’ మే 7, 2004లో విడుదలైన సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమా బ్లాక్‌బస్టర్‌ అయింది. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాల్లో హండ్రెడ్‌ పర్సెంట్‌ లవ్‌, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. 

‘రంగస్థలం’ చిత్రంతో డైరెక్టర్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు సుకుమార్‌. అప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌, విభిన్నమైన కథ, కథనాలతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాడు. ఒక్కసారి డైరెక్టర్‌గా సుకుమార్‌ రేంజ్‌ పెరిగిపోయింది. ‘పుష్ప’ చిత్రానికి కాసుల వర్షంతోపాటు అవార్డుల పంట కూడా పండిరది. తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరూ సాధించిన జాతీయ ఉత్తమనటుడు అవార్డును ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్‌ సాధించడంతో డైరెక్టర్‌గా సుకుమార్‌ మరో మెట్టు పైకి ఎదిగాడు. 

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘పుష్ప2’పైనే అందరి దృష్టీ ఉంది. రెండో భాగంతో సుకుమార్‌ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడు, అల్లు అర్జున్‌తో ఎలాంటి సాహసాలు చేయిస్తాడు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్య’ చిత్రం 2004 మే 7న విడుదలైంది. మెగా ఫోన్‌ పట్టుకొని 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్‌ సుకుమార్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పుష్ప2’ చిత్రంతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆకాంక్షిస్తోంది తెలుగు వన్‌.