Read more!

English | Telugu

తమ్ముడు సినిమాకి అన్ని కోట్లా.. దిల్ మావది మామూలు గుండె కాదు!

రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో ఎందరో యంగ్ హీరోలు సినిమాలు చేస్తుంటారు. అలాంటిది ఓ హీరో నటిస్తున్న సినిమాలో కేవలం ఒక ఫైట్ సీన్ కే ఏకంగా రూ.8 కోట్లు బడ్జెట్ పెడితే ఆశ్చర్యం కలగకమానదు. యూత్ స్టార్ నితిన్ అప్ కమింగ్ మూవీ 'తమ్ముడు' కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాంటి రిస్కే చేస్తున్నట్లు తెలుస్తోంది.

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'తమ్ముడు'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోందట. ముఖ్యంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని సినిమాకే హైలైట్ గా నిలిచేలా ప్లాన్ చేశారట. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో దాదాపు వంద మంది ఫైటర్లతో, పది రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించనున్నారట.

అయితే నితిన్ సినిమాలో ఒక ఫైట్ సీన్ కోసం రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నితిన్ కెరీర్ లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువ. గత పదేళ్లలో 'అఆ', 'భీష్మ' సినిమాలు మాత్రమే కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఆయన గత రెండు చిత్రాలు 'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అయితే దారుణంగా నిరాశపరిచాయి. బాక్సాఫీస్ దగ్గర పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాయి. అలాంటిది ఇప్పుడు నితిన్ నటిస్తున్న సినిమాలో కేవలం యాక్షన్ ఎపిసోడ్ కే రూ.8 కోట్లు ఖర్చు పెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫైట్ కే ఇంత అంటే, ఇక మొత్తం సినిమా బడ్జెట్ ఎంత అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

కాగా, ఇటీవల కాలంలో సినిమాలో కంటెంట్ ఉంటే కుర్ర హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన 'హనుమాన్'.. స్టార్ హీరో సినిమా రేంజ్ లో ఏకంగా రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. దానిని దృష్టిలో పెట్టుకునే కంటెంట్ ని నమ్మి, నితిన్ సినిమాకి దిల్ రాజు ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.