English | Telugu
‘పుష్ప2’ నుంచి దేవిశ్రీప్రసాద్‌ను తప్పించి తమన్‌ని తీసుకోవడానికి అసలు రీజన్ ఇదే!
Updated : Nov 11, 2024
పుష్ప2 చిత్రానికి సంబంధించి ఎప్పుడూ ఏదో అప్‌డేట్ వస్తుంటుంది. అలాగే రకరకాల గాసిప్స్ కూడా వినిపిస్తుంటాయి. అయితే ఈమధ్యకాలంలో ఒక టాపిక్ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, ఎంతో చర్చనీయాంశంగా కూడా మారింది. పుష్ప2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ని ప్రత్యేకంగా పిలిపిస్తున్నారు అనే వార్త బయటికి రావడంతో సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు మొదలయ్యాయి. మరో పక్క తమన్‌ని ఎందుకు తీసుకుంటారు, దేవి ఉండగా అంటూ మరికొందరు దాన్ని కొట్టి పారేశారు. అయితే రీసెంట్‌గా పుష్ప టీమ్‌లోకి తమన్ రావడం నిజమేనని తేలిపోయింది. సింగర్ కార్తీక్ నిర్వహించిన ఒక మ్యూజిక్ కాన్సెర్ట్‌లో తమన్ మాట్లాడుతూ ‘పుష్ప2 సినిమా నా కోసం ఎదురు చూస్తోంది. నేను వెళ్లాలి’ అని చెప్పడంతో ఇప్పటివరకు అందరూ అనుకున్నట్టుగా అది రూమర్ కాదని కన్‌ఫర్మ్ చేసినట్టయింది.
సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న 9వ సినిమా ‘పుష్ప2’. 20 సంవత్సరాలుగా వీరిద్దరి జర్నీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. తను సినిమా డైరెక్ట్ చేస్తున్నాడంటే మిగతా టెక్నీషియన్స్ ఎవరు ఉన్నా ఫర్వాలేదుగానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాదే ఉండాలని సుకుమార్ ఫిక్స్ అయారు. దానికి తగ్గట్టుగానే దేవి అద్భుతమైన సాంగ్స్ ఇవ్వడమే కాకుండా, పర్టిక్యులర్‌గా సుకుమార్ ప్రతి సినిమాలోనూ ఉండే ఐటమ్ సాంగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని క్రియేట్ చేసేవారు. అలాంటిది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ రావడం ఏమిటి అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.
సుకుమార్, దేవి మధ్య ఈ గ్యాప్ రావడం వెనుక అసలు కారణం తెలిసింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కంగువకి కూడా దేవి మ్యూజిక్ చేస్తున్నారు. ఆ సినిమాపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ పుష్ప2ని అసలు పట్టించుకోవడం లేదని సుకుమార్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఫీలయ్యారు. దేవికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది ఎప్పుడు ఫినిష్ చేస్తాడా అని సుకుమార్ ఎదురుచూస్తున్నారు. కానీ, దేవి మాత్రం సుకుమార్‌కి మొండి చెయ్యి చూపిస్తూ వస్తున్నారు. ఇక చేసేది లేక దేవి స్థానంలో తమన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో టాప్ అనిపించుకున్న తమన్ ఇప్పుడు మొదటిసారి సుకుమార్ కాంపౌండ్‌లోకి ఎంటర్ అయ్యారు. మరి పుష్ప2కి తమన్ ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది చూడాలి.