English | Telugu

Devara Review : 'దేవర' మూవీ రివ్యూ

తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్,  శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్‌
వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్‌
రచన, దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
బ్యానర్స్: యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుదల తేదీ: సెప్టెంబర్ 27, 2024 

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'దేవర'. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి ఏకంగా ఆరేళ్ళ తర్వాత వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ సేల్స్ పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన దేవర.. ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ఎన్టీఆర్-కొరటాల కాంబోకి మరో బ్లాక్ బస్టర్ ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Devara Movie Review)

కథ:
ఎర్రసముద్రం అని పిలవబడే ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. వారి పూర్వీకులు దేశానికి రక్షణగా సముద్రతీర ప్రాంతంలో సైనికుల్లా నిలబడితే.. ప్రస్తుత తరం మాత్రం స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలై, డబ్బుల కోసం అక్రమ రవాణాలో భాగమవుతుంటారు. వారిలో దేవర(ఎన్టీఆర్) కూడా ఒకడు. అతను ఒక గ్రామానికి పెద్ద. చేసేది తప్పుడు పని అయినప్పటికీ, కొన్ని విలువలు పాటిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక ఘటనతో దేవరలో పూర్తిగా మార్పు వస్తుంది. పూర్వీకుల్లా తాము కూడా మంచిగా బ్రతకాలని, స్మగ్లింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనతో పాటు మిగతా వారిని కూడా స్వగ్లింగ్ మానేయాలని చెప్పడమే కాకుండా.. మాట వినని వారిని దండించడం మొదలుపెడతాడు. దీంతో మరో గ్రామ పెద్ద అయిన భైర (సైఫ్ అలీ ఖాన్)తో పాటు, పలువురు దేవరపై కోపం పెంచుకుంటారు. దేవర ఉండగా స్వగ్లింగ్ చేయడం కుదరదని అర్థమై.. అతన్ని అంతమొందించాలి అనుకుంటారు. మరోవైపు ఏం చేసినా భైర వంటి వారిలో మార్పు రాకపోవడంతో.. 'కనిపించని భయాన్ని అవుతా' అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతాడు దేవర. అప్పటినుంచి తప్పుడు పని కోసం ఎవరు సముద్రంలోకి వెళ్లినా వారి అంతు చూస్తుంటాడు. దీంతో స్మగ్లింగ్ అంటేనే అక్కడివారు భయపడతారు. కొన్నేళ్ళకు అందరూ స్మగ్లింగ్ కి దూరమవుతారు. అసలు దేవర ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికీ కనిపించకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దేవర మళ్ళీ తిరిగొచ్చాడా? అతన్ని చంపాలన్న భైర కోరిక నెరవేరిందా? ఇందులో వర (ఎన్టీఆర్), తంగం (జాన్వీ కపూర్) పాత్రలేంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం అనేది ట్రెండ్ లా మారిపోయింది. నిజంగా కథలో విషయం ఉండి.. రెండు భాగాలుగా చెప్పాల్సినంత పెద్ద కథ అయితే అలా చేయడంలో తప్పులేదు. కానీ చిన్న కథను రెండు భాగాల పేరుతో సాగదీస్తేనే మొదటికే మోసం చేస్తుంది. దేవర చాలా పెద్ద కథ అని, అందుకే రెండు భాగాలుగా చేస్తున్నామని దర్శకుడు కొరటాల విడుదలకు ముందునుంచీ చెబుతూ వస్తున్నారు. కానీ సినిమా చూశాక మాత్రం, ఆయన చెప్పినంత పెద్ద కథ అయితే కాదనే అభిప్రాయం ప్రేక్షకులకు కలిగే అవకాశముంది. అయితే కథ చిన్నదైనప్పుడు.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టి, ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయగలగాలి. కొరటాల కూడా అదే చేసే ప్రయత్నం చేశారు.

ఒక పెద్ద స్మగ్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ పాత్రధారి అజయ్ ఎర్రసముద్రానికి వెళ్లడం, అతనికి ప్రకాష్ రాజ్ 'దేవర కథ' చెప్పడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. దేవరగా ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం, షిప్ నుండి సరకు దొంగలించే ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి. అప్పటికే ఈసారి కొరటాల ఏదో కొత్తగా ట్రై చేశాడని అర్థమవుతుంది. ఆయుధపూజ సాంగ్, ఫియర్ సాంగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫస్ట్ హాఫ్ రేసీగానే నడుస్తుంది. ఒకట్రెండు చోట్ల కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. తప్పుడు పనులు మానేయాలంటూ దేవర సొంతవారికే ఎదురుతిరగడం, వారు అతన్ని చంపాలనుకోవడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం బాగానే నడిచింది. ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. ఇక సెకండాఫ్ ప్రధానంగా వర (ఎన్టీఆర్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. అప్పటివరకు సీరియస్ గా నడిచిన సినిమా.. వర-తంగం (జాన్వీ కపూర్) లవ్ ట్రాక్ తో ఒక్కసారిగా సరదాగా మారిపోవడం చూసే ఆడియన్స్ కాస్త కొత్తగా అనిపించవచ్చు. జాన్వీ గ్లామర్ ఆ ఎపిసోడ్ కి ప్లస్ అయింది. ముఖ్యంగా 'చుట్టమల్లే' సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మెప్పించాయి. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త స్పీడ్ తగ్గింది. పతాకసన్నివేశాల్లో యాక్షన్ ఎపిసోడ్ ని ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ జనరల్ ఆడియన్స్ కి కొంత కిక్ ఇవ్వొచ్చు. 'బాహుబలి-1' తరహా ముగింపుతో పార్ట్-2 కి లీడ్ ఇచ్చారు. నిజానికి పతాక సన్నివేశాలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది. కానీ ఎందుకనో కొరటాల కలం కాస్త తడబడింది.

మెజారిటీ సినిమాలు ప్రస్తుత కథని ముందు చూపించి, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంటాయి. కానీ దేవరలో ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చూపించి, సెకండ్ హాఫ్ లో ప్రజెంట్ చూపించారు. అలా కాకుండా ప్రధమార్ధంలోనే వర పాత్రని చూపించి, ఇంటర్వెల్ కి ముందు దేవర పాత్రను పరిచయం చేసి.. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ని నడిపించి ఉంటే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది అనిపించింది. స్క్రీన్ ప్లే అలా రాసుకొని ఉంటే.. సెకండాఫ్ లో యాక్షన్ డోస్ పెరిగి, ఆడియన్స్ మరింత కిక్ తో బయటకు వచ్చే అవకాశం ఉండేది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రీకొడుకులు దేవర, వర పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా పిరికివాడి నుంచి వీరుడిలా మారే వర పాత్రలో రెచ్చిపోయాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. వయసు పరంగా రెండు వేరియేషన్స్ ఉన్న.. భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెప్పించాడు. ఎన్టీఆర్ తో తలపడే సన్నివేశాల్లో విజృంభించాడు. జాన్వీ క‌పూర్ పోషించిన తంగం పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో తన అందం, అభినయంతో మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ లో తన గ్లామర్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. దేవర భార్య పాత్రలో శృతి మరాఠే ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఎప్పటిలాగే తమదైన నటనతో వారి పాత్రలకు న్యాయం చేశారు. అజయ్, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికంగా దేవర చిత్రం ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ తో ఇప్పటికే ఆకట్టుకున్న అనిరుధ్.. ఆయుధపూజ సాంగ్ తో అదరగొట్టాడు. ఇక నేపథ్య సంగీతమైతే సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు కెమెరా పనితనం ఆకట్టుకుంది. 1980-1990 కాలం నాటి సముద్రతీర ప్రాంతంలో జరిగే కథతో రూపొందిన ఈ సినిమాకి సాబు సిరిల్‌ ఆర్ట్ వర్క్ మెప్పించింది. యుగంధర్‌ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ బాగానే ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సన్నివేశాల కూర్పు కూడా బాగానే కుదిరింది. కొరటాల రాసిన కొన్ని సంభాషణలు బాగున్నాయి కానీ, పూర్తిస్థాయిలో ఆయన మార్క్ కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా...
యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ మేళవింపుతో యాక్షన్ డ్రామాగా రూపొందిన 'దేవర' మూవీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఫ్యాన్స్ కి, మాస్ ఆడియెన్స్ కి మాత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కలెక్షన్ల పరంగా దుమ్ముదులిపే అవకాశముంది.

రేటింగ్: 2.5/5

- గంగసాని