English | Telugu

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం!

వేణుస్వామి(Venu Swamy)పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని జర్నలిస్ట్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని, తనకు హాని తలపెట్టాలని చూస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషనర్ మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. వేణుస్వామిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశించింది.

వేణుస్వామి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటారు. జాతకాల పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి పబ్లిక్ గా ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వేణుస్వామిపై తీవ్ర విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా  నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ పై అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందరూ ఆయన తీరుని తప్పుబట్టారు. జర్నలిస్ట్ సంఘాలు సైతం వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే వేణుస్వామి, మూర్తి మధ్య కూడా వివాదం నెలకొంది. వేణుస్వామి జాతకాల పేరుతో మోసం చేస్తున్నారని, ఆయన పూజల నిజ స్వరూపం ఇదంటూ ఆధారాలు బయటపెట్టారు. అంతేకాదు వేణుస్వామి పేరు మీద బినామీ ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పి షాకిచ్చారు. అయితే వేణుస్వామి కూడా మూర్తిపై సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని చెప్పిన మూర్తి.. దీనిపై న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.