English | Telugu
‘పుష్ప2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై క్లారిటీ వచ్చింది..ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు!
Updated : Nov 16, 2024
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కథ పరంగా, బన్ని క్యారెక్టర్ పరంగా, సుకుమార్ టేకింగ్ పరంగా ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులు పొందారు. వీటితోపాటు దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద హైలైట్‌గా నిలిచింది. సినిమా ఒక హై ఫ్లోలో రన్ అవ్వడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. మరి పుష్ప2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ లెవల్‌లో ఉంటుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా నేపథ్య సంగీతం గురించి వచ్చిన వార్త అందర్నీ కలవరపరిచింది. కొన్ని కారణాల వల్ల పుష్ప 2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతను తమన్‌కు అప్పగించారు. ఇది బన్నీ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఫస్ట్ పార్ట్ తరహాలో రెండో పార్ట్ మ్యూజిక్ ఉంటుందా అనే సందేహం అందరికీ కలిగింది. అయితే తాజా సమాచారం మేరకు తను సినిమా మొత్తానికి మ్యూజిక్ చేయలేదని, తను చేసింది ఒక పార్ట్ మాత్రమేనని తమన్ స్వయంగా ఒక కార్యక్రమంలో తెలియజేశారు.
ఇప్పటివరకు పుష్ప2 సినిమా మొత్తానికి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడనే వార్త వైరల్ అయింది. అయితే తను అందులో ఒక పార్ట్ మాత్రమే చేశానని తమన్ చెప్పడంతో ఆ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పుష్ప2 చిత్రానికి సంబంధించి మరో ఆందోళన ప్రేక్షకుల్లో, అభిమానుల్లో నెలకొంది. అదేమింటే.. భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన కంగువా చిత్రమే ఆ ఆందోళనకు కారణం. సూర్య, శివ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కంగువాను తమిళ బాహుబలిగా కోలీవుడ్ ఇండస్ట్రీ అభివర్ణించింది. ఈ సినిమాపై చిత్ర యూనిట్‌తోపాటు తమిళ ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో, సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను కంగువా అందుకోలేకపోయింది. సినిమాలో భారీ తనమే తప్ప విషయం లేదని తేల్చి చెబుతున్నారు.
ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగుంది అనిపించినా, కొన్ని యాక్షన్ సీన్స్‌లో చెవులు దద్దరిల్లిపోయే సౌండ్స్ ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. ఓ పాన్ ఇండియా సినిమా మ్యూజిక్‌కి ఇంత నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో.. ఆ ప్రభావం పుష్ప2పై పడే అవకాశం ఉందంటున్నారు. తమన్ పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసి ఉంటే ఈ టాక్ వచ్చేది కాదు. ఇప్పుడు తమన్ అందులో ఒక పార్ట్ మాత్రమే అని తెలిసిన తర్వాత దేవి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు అనే దానిపై చర్చ మొదలైంది. పుష్ప తరహాలోనే పుష్ప2 కూడా సినిమా పరంగా, మ్యూజిక్ పరంగా ఓకే అనిపించుకుంటే ఫర్వాలేదుగానీ ఇప్పుడు వినిపిస్తున్న నెగెటివ్ టాక్ సినిమాపై ప్రభావం చూపిస్తే తప్పకుండా అది ప్రాజెక్ట్‌కి పెద్ద లోటుగానే అనిపిస్తుంది. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు మ్యూజికల్‌గా మంచి మార్కులే పడ్డాయి. మరి డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పుష్ప2కి మ్యూజిక్ పరంగా ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.