Read more!

English | Telugu

కొడుకు కోసం తాతగా మారిన బ్రహ్మానందం!

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే.. స్టార్ హీరోల రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు తన కుమారుడు కోసం తాత అవతారం ఎత్తుతున్నారు.

'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'బసంతి', 'మను' వంటి సినిమాలతో మెప్పించిన గౌతమ్.. తన తండ్రికి పూర్తి భిన్నంగా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. అతని నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇలాంటి సమయంలో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ.. గౌతమ్-బ్రహ్మానందం కలయికలో సినిమా ప్రకటన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో.. బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్ ని చూపించడంతో పాటు, సినిమాకి సంబంధించిన వివరాలను రివీల్ చేశారు.

వీడియోలో వెన్నెల కిషోర్ తో కలిసి ఇంట్లో చెస్ ఆడుతూ.. తన కుమారుడు గౌతమ్ గురించి మాట్లాడుతుంటారు బ్రహ్మానందం. "పుష్కరమైంది వాడి సినిమా వచ్చి. స్టోరీలు వింటాడు, డెప్త్ లేదని పక్కన పెడతాడు" అని కిషోర్ తో బ్రహ్మి చెప్తారు. అప్పుడు కిషోర్, గౌతమ్ కలిసి.. కొత్త సినిమా డీటెయిల్స్ ని రివీల్ చేస్తారు. అంతేకాదు ఆ సినిమాలో తాత పాత్ర ఉందని, అది మీరే చేయాలని బ్రహ్మానందంతో చెప్తారు. మొదట షాకైన బ్రహ్మి.. ఆ తర్వాత తాత పాత్ర చేయడానికి అంగీకరిస్తారు. అలా గౌతమ్-బ్రహ్మానందం ల సినిమా ప్రకటన వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి 'బ్రహ్మానందం' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. బ్రహ్మగా గౌతమ్, ఆనంద్ గా బ్రహ్మానందం కనిపించనున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిఖిల్ దర్శకుడు. మరి తండ్రీకొడుకులు.. తాతమనవడిగా నటిస్తున్న ఈ 'బ్రహ్మానందం' చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.