English | Telugu
మెగా వార్.. మెగాస్టార్ వర్సెస్ పవర్ స్టార్!
Updated : Feb 26, 2023
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలైన చరిత్ర లేదు. కానీ ఈసారి మాత్రం ఒకే తేదీ కోసం మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల 'వాల్తేరు వీరయ్య'తో వచ్చి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ చిత్రంతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టి మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించారు. కాగా ప్రస్తుతం ఆయన తమిళంలో విజయవంతమైన అజిత్ చిత్రం 'వేదాళం'కు రీమేక్ గా 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆగస్టు 11న విడుదల చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ చిత్రం 'వినోదాయ సిత్తం'కు రీమేక్ గా తెలుగులో 'దేవుడు' అనే సినిమా చేస్తున్నారు. దేవుడు అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా సాయి ధరంతేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'విరూపాక్ష' చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో వినోదాయ సిత్తం రీమేక్ లో ఆయన తన మేనమామతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ దర్శకత్వం వహించిన సముద్రఖనినే దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని వినికిడి. పూర్తి షూటింగును మూడు నెలల్లోపు పూర్తి చేసి ఆగస్టు 11వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 11న విడుదలయితే లాంగ్ వీకెండ్ తో పాటు ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే కూడా కలిసి వస్తుంది. దీంతో భారీ వసూళ్ళు సాధించవచ్చు. అందుకేనేమో ఈ డేట్ కి రావాలని అన్నదమ్ములు ఇద్దరు పోటీ పడుతున్నారు. కానీ చివరకు ఒక్కరే వస్తారా లేదా ఇద్దరు వస్తారా అనేది చూడాలి. అభిమానులు అయితే ఈ రెండు సినిమాలో ఒకేరోజు రాకూడదు అని కోరుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో వేచిచూడాలి.