Read more!

English | Telugu

హరి హర వీరమల్లు.. డైరెక్టర్ క్రిష్ పేరు మాయం.. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు?

టాలీవుడ్ లో కొందరు దర్శకులకు ఈమధ్య వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చి, ప్రమోషన్స్ మొదలైన సమయంలో డైరెక్టర్ పేరు కనిపించకుండా పోతుంది. కళ్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీ విషయంలో అదే జరిగింది. సినిమా విడుదలకు దర్శకుడు నవీన్ మేడారం పేరు మాయమైంది. ఇప్పుడు ఒక ప్రముఖ దర్శకుడికి కూడా అలాంటి అనుభవమే ఎదురుకావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu). ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం మరియు ఇతర కారణాల వల్ల.. ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక సమయంలో ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ విడుదలవుతోంది. టీజర్ ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో దర్శకుడు క్రిష్ పేరు మాయమైంది. 

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో క్రిష్ ఒకరు. అలాంటి ఆయన తన ప్రైమ్ టైంలో 'హరి హర వీరమల్లు' కోసం ఏకంగా మూడేళ్లకు పైగా కేటాయించారు. అయినప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. ఇటీవల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్నారని కూడా వార్తలొచ్చాయి. ఎ.ఎం. రత్నం కుమారుడు, దర్శకుడు జ్యోతి కృష్ణ మిగతా చిత్రాన్ని పూర్తి చేయనున్నాడని ప్రచారం జరిగింది. తాజా పోస్టర్లలో క్రిష్ పేరు మిస్ అవ్వడం చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. టీజర్ విడుదలైతే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.

డైరెక్టర్ క్రిష్ కి ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇది మొదటిసారి కాదు. కంగనా రనౌత్ తో ఆయన 'మణికర్ణిక' సినిమాని రూపొందించారు. అయితే ఆ సినిమా చివరిలో క్రిష్ 'ఎన్టీఆర్ బయోపిక్'తో బిజీ కావడంతో.. వారం పది రోజుల ప్యాచ్ వర్క్ కి అందుబాటులో లేరు. దీంతో కంగనా.. డైరెక్టర్ గా తన పేరుని క్రిష్ పేరు పైన వేసుకొని షాకిచ్చింది. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' విషయంలో కూడా క్రిష్ కి అలాంటి షాక్ తగలనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలుస్తారేమో చూడాలి.