Read more!

English | Telugu

బాల‌య్య 100... న‌ష్టాలొచ్చినా ఫ‌ర్వాలేదా??

ఏ వ్యాపారం అయినా.. లాభాల కోస‌మే మొద‌ల‌వుతుంది. సినిమా కూడా అంతే. ఇంత‌లో సినిమా తీస్తే.. ఎంతొస్తుంది?  అనే లెక్క‌లు వేసుకోవ‌డం రివాజు. అయితే.. నంద‌మూరి బాల‌కృష్ణ మాత్రం 'నా వందో సినిమాకి న‌ష్టాలొచ్చినా ఫ‌ర్వాలేదు..' అంటున్నాడ‌ట‌. ఏమిటీ విచిత్రం.. అనుకొంటున్నారా??  అయితే డిటైల్స్ లోకి వెళ్లాల్సిందే.

బాల‌య్య వందో సినిమాకి సంబంధించిన క‌స‌ర‌త్తులు వీర‌లెవిల్లో జ‌రుగుతున్నాయి. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి పేరుతో క్రిష్ ఆల్రెడీ ఓ క‌థ సిద్ధం చేసేశాడు. బాల‌య్య కూడా ఈ ప్రాజెక్టుకు ప‌చ్చ‌జెండా ఊపేశాడు. అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. అయితే కాగితాల‌పై బ‌డ్జెట్ వేసుకొంటే రూ.60 కోట్ల‌కు తేలుతోంద‌ట‌. ఇది రాజుల క‌థ‌. యుద్దాలు, ఆ వాతావ‌ర‌ణం, రాజ‌ద‌ర్బార్‌లూల సృష్టించాలంటే ఆ మాత్రం అవ్వాల్సిందే. పైగా ఈరోజుల్లో సినిమా అంటే టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్‌లో ఉండాల్సిందే. లేదంటే ఆడియ‌న్స్ ఒప్పుకోవ‌డం లేదు. పైగా ఇది బాల‌య్య వందో సినిమా.. ఆ మాత్రం రిచ్ నెస్ లేక‌పోతే ఎలా??  అటూ ఇటూ చూస్తే ఈ సినిమాకి రూ.60 కోట్లు బ‌డ్జెట్ దాట‌డం ఖాయం.

అయితే బాల‌య్య మార్కెట్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. బాలయ్య సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలే రూ.50 కోట్లు దాట‌లేదు. గ్రాస్ రూ.50 వ‌చ్చినా.. షేర్‌లో లెక్కేస్తే. రూ.35 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోతోంది. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రూ.60 కోట్ల‌తో సినిమా తీయ‌డం రిస్కే. ఎంత బాగా ఆడినా పెట్టుబ‌డి తిరిగి రాదు. అయితే బాల‌కృష్ణ మాత్రం వందో సినిమా లాభాల కోసం చూడొద్దు.. దాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించాలి.. న‌ష్టాలొచ్చినా భ‌రిద్దాం.. అని నిర్మాత‌ల‌కు భ‌రోసా ఇచ్చాడ‌ట‌. క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డొద్దని ముందే గ‌ట్టిగా చెప్పేశాడ‌ట‌. దాంతో.. నిర్మాత‌లు మ‌రింత ఉత్సాహంగా ముందుకు దూకేందుకు స‌న్నద్ధం అవుతున్నారు.ఈ రోజుల్లో సినిమా హిట్టయితే ఎంత పెట్టుబ‌డి పెట్టినా తిరిగొచ్చేస్తుంది. బాల‌య్య వందో సినిమాకి ఉండే క్రేజే వేర‌ని... ఎంత పెట్టినా తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చ‌ని క్రిష్ కూడా ధీమాగా ఉన్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూద్దాం.