Read more!

English | Telugu

'బాక్' మూవీ రివ్యూ

సినిమా పేరు: బాక్
తారాగణం: సుందర్. సి, తమన్నా, రాశిఖన్నా, కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిజా
సినిమాటోగ్రఫీ: కృష్ణస్వామి
రచన, దర్శకత్వం: సుందర్. సి
విడుదల తేదీ: మే 3, 2024

హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వచ్చిన నాలుగో చిత్రం 'బాక్'. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా నటించారు. మే 3న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
శివశంకర్(సుందర్. సి) ఓ లాయర్. తన చెల్లి శివాని(తమన్నా) ప్రేమ వివాహం చేసుకొని, పుట్టింటికి దూరమవుతుంది. అయితే కొంతకాలానికి శివాని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని గట్టిగా నమ్మిన శివశంకర్.. ఆ ఇద్దరి మరణాల వెనక కారణాలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అసలు బాక్ అంటే ఏంటి? ఆ దుష్ట శక్తి శివాని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? చనిపోయాక కూడా శివాని తన పిల్లలని ఎలా కాపాడుకుంది? తన చెల్లి మరణానికి కారణమైన వారిపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇందులో రాశిఖన్నా పాత్ర ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
కథగా చూసుకుంటే 'బాక్'లో కొత్తదనం లేదు. ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన దుష్ట ఆత్మను హీరో ఎలా అంతమొందించాడు అనేది ఈ కథ. ఈ తరహా కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో 'అరణ్మనై' ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. అయితే కథలో కొత్తదనం లేనప్పటికీ.. హారర్ కామెడీ జానర్ సినిమాలతో మ్యాజిక్ చేయొచ్చు. ఓ వైపు నవ్విస్తూ, మరోవైపు భయపెడుతూ కథనాన్ని ఆసక్తికరంగా నడపవచ్చు. కానీ 'బాక్' విషయంలో ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అటు నవ్వించడంలోనూ, ఇటు భయపెట్టడంలోనూ పూర్తిగా సక్సెస్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకుంది. శివానిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని బయటపెట్టే సన్నివేశాలు, బాక్ నేపథ్యం తెలిపే ఎపిసోడ్ మెప్పించాయి. తమన్నా పోషించిన శివాని పాత్రతో సెంటిమెంట్ బాగానే పండింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. సినిమాకి అవే హైలైట్ గా నిలిచాయి. విజువల్ గా కూడా ఈ సినిమా బాగుంది.

సాంకేతికంగా ఈ సినిమా ఉన్నంతగా ఉంది. కృష్ణ స్వామి కెమెరా పనితనం కట్టిపడేసింది. హిప్ హాప్ తమిజా సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
మరణించాక కూడా ఆత్మగా కనిపిస్తూ, పిల్లలను కాపాడుకునే శివాని పాత్రలో తమన్నా చక్కగా ఒదిగిపోయింది. డాక్టర్ మాయగా రాశిఖన్నా ఉన్నంతలో రాణించింది. శివశంకర్ గా సుందర్. సి నటన మెప్పించింది. కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
కథాకథనాల్లో వైవిధ్యం లేదు. కొన్ని నవ్వులు, అక్కడక్కడా భయపెట్టే సన్నివేశాలు, విజువల్స్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5