English | Telugu
టాలీవుడ్ లో మరో బాధితుడు.. ఈసారి నిర్మాత...
Updated : Oct 7, 2024
ఇటీవల తనని మోసం చేశారంటూ, లైంగికంగా వేధించారంటూ పలువురు యువతులు.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖు నటులు, కొరియోగ్రాఫర్ లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్త భిన్నంగా తనని ఒక మహిళ మోసం చేసిందంటూ.. కెవిన్ అనే ఓ నిర్మాత మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.
'కేరింత' ఫేమ్ విస్వంత్ హీరోగా రూపొందిన 'కాదల్' అనే సినిమాని తాను కూడా ఒక నిర్మాతనని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని అయిన తాను పర్సనల్ లోన్ తీసుకొని మరీ రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు కెవిన్ తెలిపాడు. ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నాడు. అలాగే ఈ కేసు వాదించిన లాయర్ తనను మోసం చేసిందని, పైగా తన మీదే రివర్స్ కేసు పెట్టిందని అన్నాడు.
"బడ్జెట్ ఇష్యూ వల్ల 50 శాతం షూటింగ్ అయ్యాక కాదల్ సినిమా నిలిచిపోయింది. దీంతో నా ఫ్రెండ్ ద్వారా ఆ చిత్ర నిర్మాతలు నన్ను సంప్రదించగా.. 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. దాంతో 90 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి మరో పది లక్షలు అడిగారు. నా దగ్గర లేవని చెప్పడంతో.. నిర్మాత కిరణ్ రెడ్డి గారి దగ్గరకి వెళ్లారు. కానీ నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని హైడ్ చేశారు. దీంతో నేను వెళ్లి కిరణ్ రెడ్డి గారికి అసలు విషయం చెప్పాను. ఆయన సూచనతో వీరిపై క్రిమినల్ కేసు పెట్టాను. ఈ కేసు వల్ల లాయర్ శ్రావ్య కట్టాతో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉన్నాము. కలిసి ట్రిప్స్ కి కూడా వెళ్ళాము. కానీ నేను వేధించినట్లు ఆమె నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేము లవ్ చేసుకున్నాం.. కానీ రివర్స్ లో నాపైనే కంప్లైంట్ చేసింది." అని కెవిన్ చెప్పాడు.
కాగా, శ్రావ్య చేసిన కంప్లైంట్ లో మాత్రం షాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. కెవిన్ తనకి హెచ్ఐవీ ఉందని చెప్పి, డబ్బులు అడిగాడని.. అలాగే పోర్న్ వీడియోలు చేయమని ఒత్తిడి తెచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మరి ఈ వ్యవహారంలో అసలు నిజాలేంటో, తప్పు ఎవరిదో తెలియాల్సి ఉంది.