Read more!

English | Telugu

తెలుగువన్ ' వాలెంటైన్స్ డే ' స్పెషల్ కౌంట్ డౌన్

ప్రేమ..ప్రేమ..ప్రేమ.. ఇదే నేటి యూత్ కు తారకమంత్రం. నీరు గాలి లేకపోయినా ఉంటాం గానీ లవ్ లేకుండా బ్రతకలేం అంటున్నారు నేటియువత. మరి ఇలాంటి యువతకు ఫిబ్రవరి 14 అంటే మామూలుగా ఉంటుందా..జీవితంలో ఫిబ్రవరి 14 అత్యంత కీలకమైన రోజుగా వాళ్లు భావిస్తున్నారు. సింగిల్ గా ఉన్న వాళ్లు తోడును వెతుక్కుంటూ, కలిసున్న వాళ్లు ఎంజాయ్ చేస్తూ, విడిపోయిన వాళ్లు బాధలో ప్రేమ ఎంత మథురం అని పాడుకునే రోజు, ఈ వ్యాలెంటైన్స్ డే.. యూత్ కు ఇంత ప్రత్యేకమైన వ్యాలెంటైన్స్ డే కు రోజుకు ఒక సెలబ్రిటీ కపుల్ లవ్ స్టోరీ చొప్పున తెలుగువన్ మీకు ప్రేమికుల రోజు కౌంట్ డౌన్ అందిస్తోంది. రాబోయే నాలుగు రోజులూ, నలుగురు అద్భుతమైన ప్రేమజంటల కథని తెలుసుకుని ఆనందించండి..మరి ఈరోజు కపుల్ ఎవరో చూద్దామా..
 

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కపుల్ అమితాబ్-జయబాధురి

 

బాలీవుడ్ కు పెర్ఫెక్ట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఎవర్ గ్రీన్ కపుల్ అమితాబ్ జయ ల ప్రేమకథ తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే ఈ ప్రేమకథను మొదట ఎంచుకున్నాం.

మొదటి చూపు :
అమితాబ్ జయను మొట్టమొదట ఒక మ్యాగజీన్ కవర్ పై చూశాడు. చూడగానే ఆయనకు సంప్రదాయం, ఆధునికత మేళవించిన అమ్మాయిలా అనిపించింది. పైగా ఆమె కళ్లు ఆయన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తర్వాత ఆమే తన జీవితభాగస్వామి అవుతుందని, అప్పటికి ఆయన కూడా ఊహించలేదు. ఆ కొన్నాళ్లకే గుడ్డీ స్క్రిప్ట్ తో అమితాబ్ దగ్గరకొచ్చాడు దర్శకుడు హ్రిషీకేష్ ముఖర్జీ. ఆ సినిమాలో తన పక్కన హీరోయిన్ గా జయ అని తెలిసేసరికి, అమితాబ్ చాలా ఎగ్జైట్ అయ్యాడు.

 

అప్పటికే జయబాధురికి కూడా అమితాబ్ తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. గుడ్డీ సినిమా షూటింగ్ టైం లో ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అదే ప్రేమగా చిగురించింది. మొదట అమితాబ్ ను చూసి, జయకు చాలా భయమేసేదట. కారణం ఆయన రూపం, పొడవు..కానీ ఎంతో కేర్ తీసుకునే ఆయన వ్యక్తిత్వం ఆవిడను పడేసింది..బయటకు భయం ఉన్నా, ఆయనంటే లోపల ఎక్కడో ఒక మూల ప్రేమ ఉండేదట. ఇద్దరికీ మధ్య ప్రేమ చిగురించిన తర్వాతి తిరిగి వెనక్కి చూడలేదు ఈ జంట.

విచిత్రమైన పెళ్లి :
అమితాబ్ జయ ల పెళ్లి చాలా విచిత్రంగా చోటు చేసుకుంది. జంజీర్ కనుక సక్సెస్ అయితే, ఇద్దరూ కలిసి తమ స్నేహితులతో లండన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ అమితాబ్ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. పెళ్లికాకుండానే ఇద్దరూ ఊళ్లు తిరగడం అనే ఊహ వారికి నచ్చలేదు. అమితాబ్ కు కూడా అది సరైన వాదనే అనిపించింది. అందుకే వాళ్లు ఒప్పుకుంటే వెంటనే జయను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకూ, జయ తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ల వైపు నుంచి కూడా అంగీకారం రావడంతో వెంటనే పెళ్లి, ఆ వెంటనే జంజీర్ సక్సెస్ తో లండన్ టూర్ వెంటవెంటనే జరిగిపోయాయి.

 

పెళ్లైన తర్వాత సినిమాలు మానెయ్యడం పూర్తిగా తన నిర్ణయమని చెబుతారు జయాబచ్చన్. ఇందులో అమితాబ్ కు ఏమాత్రం సంబంధం లేదని, తనమీదెప్పుడూ భర్తననే అధికారం చెలాయించాలని ఆయన చూడలేదని అంటారావిడ. అంతేకాక, అమితాబ్ కు రేఖకు మధ్య ఎఫైర్ ఉందనే విషయాన్ని కూడా తానెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని, తన భర్త ఏంటో తనకు తెలుసని జయాబచ్చన్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నిజమైన ప్రేమంటే నమ్మకం, ఒకరిమీద మరొకరికి గౌరవం. అది ఉన్న చోట స్నేహం, ప్రేమ కలకాలం నిలిచే ఉంటాయి. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ అమితాబ్ అండ్ జయాబచ్చన్ జంట..బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కపుల్..