English | Telugu
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్!
Updated : Dec 21, 2024
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన గురించి శనివారం అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన ఈ అంశం గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఘటన జరిగిన తీరు గురించి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళడాన్ని కూడా రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు, అలాగే ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్‌ను చూసేందుకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇకపై ఏ హీరో సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంతవరకు అది జరగదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే.. శనివారం మరోసారి అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకు మీడియాతో సమావేశమయ్యారు.
ఈ అత్యవసర సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఇది ఒక యాక్సిడెంట్. ఇందులో ఎవరి తప్పు లేదు. దురదృష్టకరమైన ఘటన. మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని అందరూ మంచి ఇంటెన్షన్‌తో చేసినప్పటికీ ఇది జరగడం చాలా బాధగా ఉంది. ఆ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాను. ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఒక మిస్ అండర్‌స్టాండిరగ్. ఎవరినీ బ్లేమ్ చెయ్యడానికి కాదు. నేను రాంగ్‌గా బిహేవ్ చేశానని నా గురించి కొన్ని విమర్శలు వచ్చాయి. నన్ను కలిసేందుకు సినిమా వాళ్ళు వచ్చినందుకు కూడా కామెంట్స్ చేశారు. నా కాళ్ళు, చేతులు విరిగిపోయాయా అంటూ చాలా తప్పుగా మాట్లాడారు. అది నాకెంతో బాధ కలిగించింది. నన్ను ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు. నేను అలా మాట్లాడగలనా? నా సినిమా పెద్ద సక్సెస్ అయినా ఎలాంటి ఫంక్షన్స్ పెట్టకుండా ఇంట్లోనే కూర్చుని ఉన్నాను. మూడేళ్ళు కష్టపడి చేసిన సినిమాను నేను థియేటర్‌లో చూడలేదు. అంత పెద్ద సక్సెస్ అయినా నేను ఇంట్లోనే కూర్చుని ఉన్నాను. నా గురించి తప్పుగా చెప్పడం బాధ కలిగించింది. మూడేళ్ళు ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా థియేటర్‌లోనే చూడాలని అనుకుంటాను. 30 సంవత్సరాలుగా నా సినిమా కాకపోయినా, చాలా సార్లు ఆ థియేటర్‌కి వెళ్లాను. ఎప్పుడూ ఏమీ జరగలేదు. నేను రోడ్ షో చేశానని చెప్పారు. అది తప్పు. థియేటర్‌కి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పుడు బయటికి వచ్చి అందరికీ థాంక్స్ చెబుతూ ముందుకెళ్లాను. నేను వాళ్ళని పలకరిస్తేనే వాళ్లు పక్కకు తప్పుకుంటారు. నేను అదే చేశాను. నేను రోడ్ షో చెయ్యలేదు అని మరోసారి చెబుతున్నాను.
నా దగ్గరకి పోలీసులు వచ్చారని చెప్పారు. కానీ, ఏ ఒక్క పోలీస్ నా దగ్గరకి రాలేదు. అది మాత్రం పూర్తిగా అబద్ధం. నాకు ఇలా ఓ యాక్సిడెంట్ జరిగిందని నెక్స్‌ట్ డే తెలిసింది. నేను వెంటనే హాస్పిటల్‌కి వెళ్దామని వాసుతో అన్నాను. కానీ, ఇప్పుడు అక్కడ పొజిషన్ ఎలా వుందో తెలీదు. ఎంత ఎమోషనల్‌గా ఉన్నారో తెలీదు. అలాగే మళ్ళీ అక్కడికి క్రౌడ్ వస్తుంది. లేనిపోని సమస్యలు వస్తాయని వాసు చెప్పాడు. ముందు తను అక్కడికి వెళ్లి పరిస్థితి చూసిన తర్వాత వెళ్దాం అన్నాడు. సరే అని నేను వెయిట్ చేస్తున్న టైమ్‌లో నా మీద కేస్ ఫైల్ అయిందని చెప్పారు. ఇక ఎక్కడికి కదల్లేని పరిస్థితి. మా లీగల్ టీమ్ కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. దాంతో నేను ఏమీ చెయ్యలేకపోయాను. ఆ తర్వాత మా నాన్ననిగానీ, మా మావయ్యనిగానీ వెళ్ళి కలవమని చెప్పాను. అది కూడా కుదరదని చెప్పారు. అయితే నేను మాత్రం ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి నార్మల్‌గా లేను. ఇప్పుడు కూడా నార్మల్‌గా లేను. ఈ విషయంలో ఆ కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలని సుకుమార్ అన్నారు. సుకుమార్ కొంత, నేను కొంత, ప్రొడ్యూసర్ కొంత ఎమౌంట్ కలెక్ట్ చేసి మొత్తం ఆ బాబు పేరుమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చెయ్యాలని అనుకున్నాం. నేను ఎందుకు బాధ్యతగా ఉండను చెప్పండి. చిరంజీవిగారి ఫ్యాన్స్‌గానీ, కళ్యాణ్‌గారి ఫ్యాన్స్‌గానీ చనిపోయినపుడు ఎంతో దూరం వెళ్ళి చూసొచ్చాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్‌కి ఏదైనా జరిగితే నేను చూడకుండా ఉంటాను. ఈ విషయంలో నామీద చాలా లో యాంగిల్‌లో విమర్శలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మా సైడ్ నుంచి ఆ కుటుంబానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తాం’ అన్నారు. అయితే శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల గురించి డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా ఇన్‌డైరెక్ట్‌గా అసెంబ్లీలో జరిగిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.