English | Telugu

కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ2 తాండవం’. డిసెంబర్‌ 12న థియేటర్లలో తన నటవిశ్వరూపాన్ని చూపించేందుకు సిద్దమయ్యారు నందమూరి బాలకృష్ణ. డిసెంబర్‌ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ పడనున్నాయి.

డిసెంబర్‌ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్‌ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే టికెట్ల ధరలను ఏమేరకు పెంచుకోవచ్చు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘అఖండ2’ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సినిమాలో బాలయ్య నట విశ్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని టీజర్‌లో బలంగా చూపించారు. ‘కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.. ఎవడ్రా విభూది కొండను ఆపేది..’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌.. అఘోరా క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేస్తోంది. దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరింత హైలైట్‌ చేసింది.

గదతో, త్రిశూలంతో దుష్ట శక్తుల్ని అంతమొందించే కీలక సన్నివేశాలను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఇలాంటి సీన్స్‌ ప్రేక్షకుల చేత తప్పకుండా విజిల్స్‌ వేయిస్తాయని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘అఖండ2’ చిత్రాన్ని చూసేందుకు, దైవానుభూతిని పొందేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి రేపు థియేటర్లలో శివానుగ్రహం కలిగించే రీతిలో బోయపాటి శ్రీను ఆయా సీన్స్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. దీంతో ‘అఖండ2’ థియేటర్లలో ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగిపోవడం ఖాయమని టీజర్‌ ప్రూవ్‌ చేస్తోంది.