Read more!

English | Telugu

యాక్సిడెంట్‌ కేసులో నటుడు రఘుబాబును అరెస్ట్‌ చేసిన పోలీసులు!

ఇటీవల నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నేత సందినేని జనార్థనరావు(51) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకి భార్య, కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. దీనిపై మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం రఘుబాబుని అరెస్ట్‌ చేశారు. 

ఈ యాక్సిడెంట్‌ కేసు వివరాల్లోకి వెళితే.. బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్థనరావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. కొందరి భాగస్వామంతో పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్‌ కాలనీ వద్ద దత్తసాయి వెంచర్‌ను ప్రారంభించారు. ప్రతిరోజూ వెంచర్‌కి  వెళ్లి వస్తుండేవారు. గత బుధవారం కూడా యధావిధిగా వెంచర్‌కి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాద్‌ నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యు కారు జనార్థనరావు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణంగా చెబుతున్న కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. యాక్సిడెంట్‌ తర్వాత అక్కడే ఉన్న కొందరు స్థానికులతో మాట్లాడిన తర్వాత రఘుబాబు మరోకారులో వెళ్లిపోయారు. 

జనార్థనరావు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  రఘుబాబును అరెస్ట్‌ చేశారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే రఘుబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందినేని జనార్థన్‌రావు కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు పరామర్శించారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి.. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం.. జనార్థనరావుకు నివాళులర్పించారు.