English | Telugu
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కుటుంబం గురించి ఎవ్వరికీ తెలియని విశేషాలివే!
Updated : Oct 5, 2024
మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో మైమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు డా.రాజేంద్రప్రసాద్. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ స్టూడెంట్‌గా ఉంటూ మెగాస్టార్ చిరంజీవి వంటి వారికి కూడా క్లాసులు తీసుకున్నారు. నటుడిగా మారక ముందు దాదాపు 200 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ‘రామరాజ్యంలో భీమరాజు’ చిత్రంతో నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రాజేంద్రప్రసాద్. సినిమాలో పూర్తి స్థాయిలో కామెడీ చేస్తూ కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కామెడీతోపాటు అద్భుతమైన సెంటిమెంట్‌ను పండిరచగల అరుదైన నటుడు రాజేంద్రప్రసాద్. దాదాపు 45 సంవత్సరాలుగా నటుడిగా కొనసాగుతున్న ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి(38) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌కు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం చాలా మందికి తెలియదు. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. రాజేంద్రప్రసాద్ భార్య పేరు విజయ ఛాముండేశ్వరి. ఆయన నటుడు కాకముందే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. నటి రమాప్రభ సోదరి కుమార్తె విజయ. తనకు పిల్లలు లేకపోవడంతో విజయను దత్తత తీసుకున్నారు రమాప్రభ. డబ్బింగులు చెబుతూ, సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో రమాప్రభ ఇంట్లోనే చాలా కాలం ఉన్నారు రాజేంద్రప్రసాద్. ఆ సమయంలోనే విజయ ఛాముండేశ్వరితో ప్రేమలో పడ్డారు. అలా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. బాలాజీ ప్రసాద్, గాయత్రి. బాలాజీ ప్రసాద్ కూడా తండ్రిలాగే సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. బాలాజీ హీరోగా నటించిన మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో తనకు సినిమాలు సరిపడవని భావించిన బాలాజీ ఇక ఆ ప్రయత్నాలు మానుకున్నారు. 2015లో బాలాజీ వివాహం శివశంకరితో చెన్నయ్‌లో జరిగింది.
ఇక కుమార్తె గాయత్రి విషయానికి వస్తే.. ఆమె రాజకుమార్ అనే వ్యక్తిని ప్రేమించారు. రాజకుమార్ ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రి న్యూట్రిషియన్ అడ్వయిజర్‌గా ఉన్నారు. వారి వివాహానికి రాజేంద్రప్రసాద్ అంగీకరించకపోవడంతో ఆయన్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా ఆమెతో రాజేంద్రప్రసాద్‌కు చాలా కాలం మాటలు లేవు. తన పదేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయారు రాజేంద్రప్రసాద్. దాంతో కూతురిలోనే తల్లిని చూసుకుంటున్నానని పలు సందర్భాల్లో ఆయన తెలియజేశారు. అలాంటి కూతురు తన మాట కాదని వెళ్లిపోవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయారు రాజేంద్రప్రసాద్.
ఇక గాయత్రి కుమార్తె తేజస్విని గురించి చెప్పాలంటే.. బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ చిత్రంలో చిన్న నాటి సావిత్రిగా నటించి తాతకు తగ్గ మనవరాలుగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా తేజస్విని నటించింది.