English | Telugu
తెలుగులో హిట్ ఇవ్వలేకపోయిన ఆస్కార్ విన్నర్.. చరణ్ సినిమాతో అయినా సాధిస్తాడా?
Updated : Sep 6, 2024
ఎ.ఆర్.రెహమాన్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. భారతీయ భాషల్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాలకు కూడా మ్యూజిక్ చేశారు. అయితే తెలుగు సినిమాల విషయంలో మాత్రం రెహమాన్ సీతకన్ను వేశారు. కారణం తెలియకపోయినా తెలుగు సినిమాలపై అతను దృష్టి పెట్టలేదన్న విషయం ఇప్పటివరకు అతను చేసిన సినిమాలను పరిశీలిస్తే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రెహమాన్ సంగీతం అందించిన తెలుగు సినిమాలు నిప్పురవ్వ, గ్యాంగ్ మాస్టర్, సూపర్‌పోలీస్, నాని, కొమరం పులి. ఈ సినిమాలు కాకుండా పల్నాటి పౌరుషం, నీ మనసు నాకు తెలుసు, ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలకు మ్యూజిక్ చేసినా అవి తమిళ్ వెర్షన్ కోసం చేసిన ట్యూన్సే తప్ప తెలుగు ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేసిన ట్యూన్స్ కాదు.
ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 32 సంవత్సరాలు పూర్తయింది. కానీ, ఈ మూడు దశాబ్దాల్లో అతను మ్యూజిక్ చేసిన తెలుగు సినిమాలు తొమ్మిదే అంటే ఆశ్చర్యం కలగక మానదు. అందులో తెలుగు కోసమే చేసిన సినిమాలు ఐదు. మిగతావి ద్విభాషా చిత్రాలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తమిళ్ డైరెక్టర్స్ తెలుగులో తీసిన సినిమాలకే రెహమాన్ ఎక్కువ శాతం మ్యూజిక్ చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో.. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఒకటి, రెండు సంవత్సరాల్లో వచ్చిన నిప్పురవ్వ, గ్యాంగ్‌మాస్టర్, సూపర్‌పోలీస్ వంటి సినిమాలకు మాత్రమే తెలుగు డైరెక్టర్స్ బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, కె.మురళీమోహన్‌రావులతో పనిచేశారు.
సౌత్ సినీ సంగీతంలో ఇళయరాజాది ఒక స్వర్ణయుగం. ఆయన సంగీతాన్ని దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారు. ముఖ్యంగా ఇళయరాజా తెలుగులో చేసిన ఎన్నో సినిమాలు మ్యూజికల్‌గా రికార్డులు సృష్టించాయి. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తెలుగు సినిమాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పాతతరంలో కూడా కె.వి.మహదేవన్, యం.యస్.విశ్వనాథన్ వంటి తమిళ సంగీత దర్శకులు తెలుగులోనూ లెక్కకు మించిన సినిమాలు చేశారు. కానీ, రెహమాన్ సంగీతం మాత్రం డబ్బింగ్ సినిమాలకే పరిమితమైంది తప్ప తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసేందుకు అతను సుముఖత చూపించలేదు. రెహమాన్ కెరీర్ ప్రారంభంలో కోటి, కీరవాణి వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత తమిళ్, హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే రెహమాన్‌తో పనిచేసేందుకు తెలుగు డైరెక్టర్స్ ఆసక్తి చూపించడం లేదా లేక తెలుగు సినిమాలపై రెహమాన్‌కే చిన్నచూపు ఉందా అనే విషయం మాత్రం ఇప్పటివరకు చర్చకు రాలేదు. 2010లో పవన్‌కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన కొమరం పులి చిత్రం తమిళ్‌తో సంబంధం లేకుండా తెలుగులో డైరెక్ట్‌గా రెహమాన్ మ్యూజిక్ చేసిన సినిమా. ఆ సినిమా మ్యూజికల్‌గా కానీ, కమర్షియల్‌గా కానీ హిట్ అవ్వలేదు. ఇప్పుడు రామ్‌చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఆర్‌సి16 చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అంటే 14 సంవత్సరాల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నారు రెహమాన్. ఇప్పటివరకు రెహమాన్ చేసిన స్ట్రెయిట్ సినిమా ఏదీ కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు. మరి రామ్‌చరణ్ సినిమాతో అయినా తొలి హిట్ అందుకుంటాడేమో చూడాలి.