English | Telugu

రాజమౌళి వర్సెస్ ఎన్టీఆర్.. ఎవరిది పైచేయి..?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడమనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' విషయంలో కూడా అదే జరిగింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవితో కలిసి చరణ్ నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'దేవర'పై పడింది. (Devara Movie)

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న 'దేవర' సినిమాకి కూడా కొరటాల శివనే డైరెక్టర్. రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశముందని కొందరు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి తారక్ కి ఒక్క ప్లాప్ కూడా లేదు. ఆయన నటించిన గత ఆరు చిత్రాలు విజయవంతమయ్యాయి. అంతేకాదు ఆ ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలు ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేసినవే కావడం విశేషం.

'టెంపర్' సినిమాకి ముందు పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. 'టెంపర్'తో తాను సక్సెస్ ట్రాక్ లోకి రావడమే కాకుండా తారక్ కి మంచి విజయాన్ని ఇచ్చాడు పూరి. అలాగే '1 నేనొక్కడినే' వంటి ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో 'నాన్నకు ప్రేమతో' తీసి హిట్ కొట్టాడు సుకుమార్. 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి భారీ ఫ్లాప్ తర్వాత తారక్ తో 'జై లవ కుశ' చేసి విజయాన్ని అందుకున్నాడు బాబీ. త్రివిక్రమ్ కూడా 'అజ్ఞాతవాసి' వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చేసి హిట్ కొట్టాడు. అదే బాటలో 'ఆచార్య'తో ఫ్లాప్ అందుకున్న కొరటాల కూడా 'దేవర'తో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. 'దేవర'కి ఎన్టీఆర్ సెంటిమెంట్ పనిచేసి.. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, 'దేవర' సినిమాకి మరో పాజిటివ్ సెంటిమెంట్ కూడా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. కొరటాల ఇప్పటిదాకా మహేష్ బాబుతో మాత్రమే రెండు సినిమాలు (శ్రీమంతుడు, భరత్ అనే నేను) చేశాడు. ఆ రెండు సినిమాలూ మంచి విజయాన్ని అందుకున్నాయి. గతంతో ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన కొరటాల.. ఇప్పుడు 'దేవర' అంటూ రెండో సినిమాతో పలకరిస్తున్నాడు. మహేష్ కి ఇచ్చినట్లే తారక్ కి కూడా కొరటాల మరో హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కాగా, దేవర చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది.