English | Telugu
పుష్ప-2 ప్రభంజనంపై టాలీవుడ్ టాప్ స్టార్ల మౌనం.. అసూయనా..?
Updated : Dec 9, 2024
కొన్నేళ్లుగా తెలుగు సినిమా, ఇండియన్ సినిమాని శాసిస్తోంది. ఇండియన్ సినిమాలలో ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినా, ఫుల్ రన్ కలెక్షన్స్ చూసినా.. టాప్ సినిమాల లిస్టులో తెలుగు సినిమాలదే హవా. ఇక ఇటీవల విడుదలైన 'పుష్ప-2' ఈ హవాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్లకు గ్రాస్ రాబట్టి, ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా, ఫుల్ రన్ లో ఇండియన్ సినిమా చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అయితే, పుష్ప-2 ఇంతటి సంచలనాలు సృష్టిస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోల నుంచి కనీసం విషెస్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (Pushpa 2 The Rule)
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను అండగా ఉండటంలో, మూవీ టీంలను అభినందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అలాంటి చిరంజీవి తన మేనల్లుడు అల్లు అర్జున్ 'పుష్ప-2'తో ఇంతటి చరిత్ర సృష్టిస్తుంటే కనీసం ట్వీట్ చేయలేదు. పుష్ప నిర్మాతలు స్వయంగా వెళ్లి, చిరంజీవిని కూడా కలిశారు. అయినప్పటికీ ఆయన నుంచి ట్వీట్ రాలేదు. మెగా వర్సెస్ అల్లు వార్ దీనికి కారణమా? లేదా చిరంజీవి వ్యక్తిగతంగా బన్నీని విష్ చేశాడా? అనేది క్లారిటీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి.. ఆయన నుంచి సినిమా ట్వీట్ లు ఆశించడం కరెక్ట్ కాదు. అయితే రామ్ చరణ్ కూడా 'పుష్ప-2' గురించి స్పందించలేదు. ఒక వైపు తన బావ అల్లు అర్జున్ హీరో, మరోవైపు తనకు 'రంగస్థలం' వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ దర్శకుడు. అయినప్పటికీ 'పుష్ప-2' టీంకి చరణ్ నుంచి విషెస్ లేవు.
నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, ఇతర సినిమాలకు విషెస్ చెప్పడం చాలా తక్కువ. ముఖ్యంగా బాలకృష్ణ అయితే సోషల్ మీడియాను పెద్దగా ఉపయోగించరు. మరి వ్యక్తిగతంగా విష్ చేశారో లేదో తెలీదు. ఇక ఎన్టీఆర్ కి, బన్నీకి మధ్య మంచి అనుబంధముంది. ఒకరినొకరు బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. సోషల్ మీడియాలోనూ ఇద్దరూ విష్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకనో 'పుష్ప-2' ప్రభంజనంపై మాత్రం ఎన్టీఆర్ నుంచి స్పందన లేదు.
చిరంజీవి మాదిరిగానే మహేష్ బాబు కూడా ఇతర చిత్రాలను ప్రశంసించడంలో ముందుంటాడు. కానీ అలాంటి మహేష్ నుంచి కూడా 'పుష్ప-2' టీంకి విషెస్ రాలేదు. ప్రభాస్ కూడా అంతే. తన వాళ్ళు అనుకుంటే చిన్న చిన్న సినిమాలకు తన వంతు సపోర్ట్ చేస్తుంటాడు. అలాంటి ప్రభాస్.. తన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన అల్లు అర్జున్ ఇంతటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే విషెస్ చెప్పలేదు.
అయితే ఇది పుష్ప-2 విషయంలో మాత్రమే కాదు. ఈ మధ్య ఇతర భారీ సినిమాల విషయంలోనూ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ సోలో హీరోగా 'దేవర'తో మంచి వసూళ్లు రాబట్టాడు. కానీ ఆ సక్సెస్ పై ఎవరూ స్పందించలేదు.
ఓ వైపు తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకి ఎదుగుతోంది. ఇలాంటి సమయంలో స్టార్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఫ్యాన్స్ ని ఏకం చేయాల్సింది పోయి.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండటం.. వారికి మాత్రమే కాదు, టాలీవుడ్ కి కూడా మంచిది కాదు. మరి ఇది, హీరోలకు ఒకరిపై ఒకరికున్న అసూయ వల్ల జరుగుతుందా? లేక ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల.. పబ్లిక్ గా చెప్పకుండా, పర్సనల్ గా విష్ చేస్తున్నారా? అనేది అర్థంకావట్లేదు.