English | Telugu

ఆకట్టుకుంటున్న 'వికటకవి' ట్రైలర్

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రధారులుగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన‌ డిటెక్టివ్ వెబ్ సిరీస్ 'వికటకవి' (Vikkatakavi). ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో న‌వంబ‌ర్ 28 నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌ కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. తాజాగా మేక‌ర్స్ ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ ను గ‌మ‌నిస్తే.. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని 'అమరగిరి' అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. అమ‌రిగిరిలోని దేవ‌త‌ల గ‌ట్టుకి వెళ్ల‌టానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతుంటారు. దాన్ని దేవ‌త శ‌పించిన గ్రామ‌మ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తుంటారు. అయితే ఆ గ్రామానికి చెందిన ప్రొఫెస‌ర్ హైద‌రాబాద్ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌ని చేస్తుంటాడు. అమ‌ర‌గిరిలో ఎవ‌రూ చేదించ‌లేని స‌మ‌స్య ఉంద‌ని భావించి, దాని ప‌రిష్కారానికి త‌న శిష్యుడైన రామ‌కృష్ణ‌ను పంపిస్తాడు. అమ‌ర‌గిరి ప్రాంతానికి వెళ్లిన రామ‌కృష్ణ ఏం చేస్తాడు? అక్క‌డి స‌మ‌స్య‌ను ఎలా గుర్తిస్తాడు? ఎలా ప‌రిష్క‌రిస్తాడు? అనే అంశాల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కి అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా, షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.