English | Telugu

వర్మ భూతాల గోల

వర్మ భూతాల గోల ఏమిటా అని అనుకుంటున్నారు కదూ... స్వతహాగా రామ్ గోపాల వర్మ చాలా పిరికివాడు. ఈ విషయాన్ని ఆ పెద్ద మనిషే ఒక సందర్భంలో మీడియాతో చెప్పాడు. రాత్రి పూట బాత్ రూమ్ కి వెళ్ళాలన్నా వర్మ భయపడే వాడట. ఆ సమయంలో చీకట్లో ఎవరో ఉన్నారనీ, వాళ్ళు తననేదో చేస్తారేమోనన్న భయం కలుగుతూండేదని వర్మే అన్నాడు. ఆ భయాన్ని అందరికీ కలిగించాలనే పిచ్చి ఆలోచనతోనే "రాత్రి" సినిమాని తీశానని కూడా వర్మే అన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా "భూత్", "ఫూంక్" వంటి చిత్రాలను వర్మ తీశాడు. ఈ సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా భయపెట్టి దాఖలాలు లేవు.

అందుకే ఈసారి వర్మ "భూ..." అనే భయానక భీభత్స చిత్రాన్ని తీస్తున్నాడట. ఈ "భూ..." సినిమా పైన చెప్పిన రాత్రి, భూత్, ఫూంక్ సినిమాలకు అమ్మవంటిదట. అంటే ప్రేక్షకులకు ఈ "భూ..." సినిమా చూస్తే వెన్నులోంచి వణుకుపుడుతుందట. ఈ విషయాన్ని వర్మే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకున్నాడు. గతంలో తన సినిమాని ఒక్కరే థియేటర్లో కూర్చుని ధైర్యంగా చూస్తే 5 లక్షలిస్తానన్నాడు. ఈసారి ఎంతిస్తాడో మరి. వర్మ పబ్లిసిటీ స్టంట్ గురించి ఇంకా ప్రేక్షకులకు తెలీదంటారా...? వర్మ పిచ్చి కాకపోతే....