English | Telugu

ఊహించని కలెక్షన్స్ తో ఇండియన్ సినిమాని ఏలుతున్న పుష్పరాజ్!

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచనలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందిన 'పుష్ప 2' భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి.. భారతదేశ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. (Pushpa 2 The Rule)

 

'పుష్ప 2' చిత్రం, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టింది. భారత సినీ చరిత్రలో ఇప్పటిదాకా మొదటిరోజు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా లేదు. అలాంటిది 'పుష్ప 2' ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ తో చరిత్ర సృష్టించింది. అలాగే రెండు రోజుల్లోనే రూ.449 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మామూలుగా ఒక సినిమా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది పుష్ప-2 సినిమా మూడో రోజే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి, వేగంగా రూ.500 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ఈ లెక్కన పుష్ప-2 మూవీ మొదటి వీకెండ్ లోనే రూ.800 కోట్ల క్లబ్ లో చేరి, సరికొత్త చరిత్ర సృష్టించనుంది. అలాగే మరో రెండు మూడు రోజుల్లో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల హీరోగా అవతరించే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా కురుస్తున్న ఈ వసూళ్ల వర్షం చూస్తుంటే, త్వరలోనే భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప-2 నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా 'పుష్ప 2' ప్రభంజనం అన్ని చోట్లా కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ గడ్డ మీద ఈ సినిమా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును 'పుష్ప 2'తో అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మొదటి రోజు వసూళ్ల పరంగా 65 కోట్ల నెట్ కలెక్షన్స్ తో జవాన్ సినిమా పేరిట రికార్డు ఉండగా, 72 కోట్లతో ఆ రికార్డును తిరగరాసింది పుష్ప-2. రెండవ రోజు 59 కోట్లు వసూలు చేయగా, మూడవరోజు 74 కోట్ల వసూళ్లతో తన మొదటిరోజు రికార్డుని మించి వసూలు చేసింది. హిందీ గడ్డపై ఇలా రెండు సార్లు హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన చేసిన ఏకైక సినిమాగా 'పుష్ప 2' కొత్త రికార్డు సృష్టించింది. కేవలం డబ్బింగ్ సినిమాతో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా అందరి రికార్డ్స్ ను అల్లు అర్జున్ తిరగరాస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే, ఎవరికి అందనంత ఉన్నత స్థాయికి అల్లు అర్జున్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది.