English | Telugu
పాన్ ఇండియా హీరో సినిమాకి సౌండ్ లేదేంటి?
Updated : Nov 7, 2024
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్' పరవాలేదు అనిపించుకోగా, మంచి అంచనాలతో విడుదలైన 'స్పై' నిరాశపరిచింది. ఇప్పుడు "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. అయితే ఈ సినిమాపై మినిమమ్ బజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (Appudo Ippudo Eppudo)
'స్వామి రారా', 'కార్తికేయ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సినిమాలతో నిఖిల్ తన మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చాడు. నిఖిల్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా విషయం ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడేలా చేసుకోగలిగాడు. ఇక 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా హీరోగా మారి, తన మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిఖిల్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉండాలి. అలాంటిది 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'పై పెద్దగా బజ్ రాలేదు. పైగా 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. 'స్వామి రారా', 'కేశవ' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడు చిత్రమిది. అయినప్పటికీ ఈ సినిమాపై బజ్ లేకపోవడానికి ప్రధాన కారణం.. విడుదల ఆలస్యమవ్వడం. నిజానికి ఇది 'కార్తికేయ 2' అప్పటి సినిమా. ఎప్పుడో షూటింగ్ పూర్తయింది. కానీ ఎందుకనో విడుదలకు నోచుకోలేదు. దాదాపు అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయిన టైంలో సడెన్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కారణమేంటో గానీ నిఖిల్ కూడా ఈ మూవీ కోసం అగ్రెసివ్ ప్రమోషన్స్ చేయలేదు. దీంతో పెద్దగా హడావుడి లేకుండానే 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' థియేటర్లలో అడుగుపెడుతోంది. మరి రేపు(నవంబర్ 8) విడుదలవుతున్న ఈ మూవీ.. సైలెంట్ గా వచ్చి సర్ ప్రైజ్ హిట్ ఏమైనా అందుకుంటుందేమో చూడాలి.