Read more!

English | Telugu

'మెర్సీ కిల్లింగ్' మూవీ రివ్యూ

సినిమా పేరు: మెర్సీ కిల్లింగ్
తారాగణం: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు తదితరులు.
సినిమాటోగ్రఫీ: అమర్.జి
సంగీతం: ఎం.ఎల్.రాజ
ఎడిటర్: కపిల్ బల్ల
ఆర్ట్: నాయుడు
డైరెక్టర్: వెంకటరమణ ఎస్
నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం 'మెర్సీ కిల్లింగ్'. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మెర్సీ ఏప్రిల్ 12న థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ: 
తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం కోసమే ఒక అనాథ బాలిక సాగించిన ప్రయాణమే ఈ చిత్ర కథ. చిన్న వయసులోనే తన తల్లితండ్రులకు దూరమై అనాథగా బ్రతుకుతున్న స్వేచ్ఛ (హారిక).. తనని కన్నవారు ఎవరనే సందిగ్ధంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో మహేష్ (పార్వతీశం), భారతి (ఐశ్వర్య) లను కలుస్తుంది. మహేష్, భారతి ఎవరు? స్వేచ్ఛ కు వారు ఎలాంటి సాయం చేశారు? రామకృష్ణమ్ రాజు (సాయి కుమార్) పాత్ర ఏంటి? అతను స్వేచ్చకు ఏమవుతాడు ? చివరికి స్వేచ్ఛ తన తల్లిదండ్రులను కలిసిందా ? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ: 
దర్శకుడు వెంకట రమణ ఎంచుకున్న కథాంశం బాగుంది. కథ, కథనాలు సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా స్వేచ్ఛ, రామకృష్ణమ్ రాజు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి సబ్జెక్టుని డీల్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు కూడా బాగుంది. జి.అమర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కథకి తగ్గట్టుగా లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా సహజంగా చూపించారు. ఎం.ఎల్. రాజా పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో తనదైన నటనతో కట్టిపడేసింది. సాయి కుమార్ తన అనుభవంతో రామకృష్ణం రాజు పాత్రకి ప్రాణం పోశారు. పార్వతీశం, ఐశ్వర్య, రామరాజు, సూర్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన 'మెర్సీ కిల్లింగ్' మెప్పించింది. ఎమోషనల్ గా సాగే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడవచ్చు.

రేటింగ్: 2.75/5