English | Telugu

నీకేం సంబంధం ప్రకాష్ రాజ్.. మా జోలికి వస్తే తాటతీస్తా..!

పవిత్రమైన తిరుపతి లడ్డుని అపవిత్రం చేసి గత పాలకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలంగా గళం వినిపిస్తున్నారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలలో కొందరు నోరు జారుతున్నారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్.. మతపరమైన గొడవలు సృష్టిస్తున్నారనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వగా.. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా విరుచుకుపడ్డారు. (Tirupati Laddu)

తిరుపతి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. అసలు ఆయనకు సంబంధం ఏంటి? నేనేమైనా వేరే మతాన్ని నిందించానా? ప్రసాదం అవిత్రమైందని దాని గురించే కదా మాట్లాడాను. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? పిచ్చి పట్టిందా ఒక్కొక్కరికి. ప్రకాష్ రాజ్ కి చెబుతున్నాను. నాకు మీరంటే గౌరవం ఉంది. సెక్యులరిజం పేరుతో.. కేవలం హిందూ మతం గురించే మీరు మాట్లాడుతుంటారు. మిగతా సమయాల్లో ఎందుకు మాట్లాడరు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను.. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు మారాలి. ఇది మీకు ఫన్ కావొచ్చు. మాకు ఫన్ కాదు. మేము ఎంతో ఆవేదన చెందాము. ఇంకోసారి సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు.. ఒకటికి వంద సార్లు ఆలోచించండి. ఇక ఇప్పటితో ఆపండి. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు. కేవలం హిందూ దేవుళ్లపైనే మీరు మాటలు పేలుతున్నారు. ఇకపై దీనిని సహించము. నోటికొచ్చినట్లు మాట్లాడితే రోడ్డు మీదకు లాగేస్తాం." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.