English | Telugu
మ్యూజికల్ హిట్ `అమ్మాయి బాగుంది`కి 17 ఏళ్ళు!
Updated : Jul 16, 2021
తెలుగు ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మల్లో మీరా జాస్మిన్ ఒకరు. `బెస్ట్ యాక్ట్రస్`గా నేషనల్ అవార్డ్ సైతం పొందిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. అప్పటికే కొన్ని తమిళ అనువాదాల్లో ఆకట్టుకున్నప్పటికీ 2004లో విడుదలైన `అమ్మాయి బాగుంది`తోనే టాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో లవ్లీ గాళ్ సత్యగా, హోమ్లీ వైఫ్ జననిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు మీరా. ఆమెకి జోడీగా శివాజీ నటించిన ఈ సినిమాలో అలీ, భావన, బ్రహ్మానందం, శివకృష్ణ, చిత్రం శ్రీను, సుధ, రాజన్ పి.దేవ్, ఎమ్మెస్ నారాయణ, సూర్య, హేమ, తెలంగాణ శకుంతల ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. `ప్రియమైన నీకు` ఫేమ్ బాలశేఖరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
తన అభిరుచులకు దగ్గరగా ఉండే సత్య (మీరా జాస్మిన్)ని ప్రేమించిన శివ (శివాజీ).. అనూహ్యంగా అదే రూపం ఉన్న మరో అమ్మాయి జననిని పెళ్ళాడతాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలో చోటుచేసుకున్న పరిస్థితుల చుట్టూ `అమ్మాయి బాగుంది` చిత్రం తిరుగుతుంది. తమిళ సినిమా `పార్తిబన్ కణవు` (శ్రీకాంత్ (శ్రీరామ్), స్నేహ)కి రీమేక్ గా ఈ ఫ్యామిలీ డ్రామా రూపొందింది.
ఎం. ఎం. శ్రీలేఖ సంగీతమందించిన ఈ చిత్రంలో ``పాటల పల్లకిలోన``, ``అమ్మాయి బాగుంది``, ``నిజమే చెబుతున్నా``, ``కలే కన్నానులే`` పాటలు వినసొంపుగా ఉంటాయి. డేగా దేవకుమార్ రెడ్డి నిర్మించిన ఈ మ్యూజికల్ హిట్.. 2004 జూలై 16న విడుదలైంది. నేటితో ఈ సినిమా 17 వసంతాలను పూర్తిచేసుకుంది.