English | Telugu

ఘనంగా అలా మొదలైంది 100 డేస్ ఫంక్షన్

ఘనంగా "అలా మొదలైంది" 100 డేస్ ఫంక్షన్ జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై, యువ హీరో నాని హీరోగా, ముచ్చటైన మళయాళీ ముద్దుగుమ్మ నిత్య మీనన్ హీరోయిన్ గా, నందినీ రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, కె.యల్ దామోదర్ ప్రసాద్ నిర్మించిన "అలా మొదలైంది" చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఒక తెలుగు సినిమా నాలుగు వారాలాడితే "మా సినిమా పెద్ద హిట్టోచ్" అని రొమ్మిరుచుకుని తిరిగే నిర్మాతలున్న ఈ రోజుల్లో "అలా మొదలైంది" సినిమా 27 సెంటర్లలో వందరోజులు పూర్తిచేసుకోవటం చాలా గొప్పగా సంతోషించాల్సిన విషయం. ఈ చిత్రానికి చక్కని వీనులకింపైన సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా, క్లుప్తంగా, అర్థవంతమైన మాటలు లక్ష్మీ భూపాల్ అందించారు.

"అలా మొదలైంది" 100 డేస్ ఫంక్షన్ ఏప్రెల్ 30 వ తేదీన, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ "అలా మొదలైంది" 100 డేస్ ఫంక్షన్ కి రమేష్ ప్రసాద్, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సాగర్, తమ్మారెడ్డి భరద్వాజ, యస్.గోపాల రెడ్డి, డాక్టర్ కె.యల్.నారాయణ, మురళీ మోహన్, యమ్.యల్.కుమార్ చౌదరి, యువ హీరో వరుణ్ సందేశ్, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తదితరులు హాజరై ఈ చిత్రం యూనిట్ ని అభినందించగా, కె.రాఘవేంద్రరావు ఈ సంస్థ వెబ్ సైట్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా "అలా మొదలైంది" చిత్ర నిర్మాత తండ్రి సీనియర్ నిర్మాత కానూరి రంజిత్ కుమార్ గారు నిర్మించిన చిత్రాల తాలూకు క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు.