English | Telugu

అప్పటి గొడవను మనసులో పెట్టుకున్నారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి.. కావల్సిన వారికి పెద్దపీట వేసి విషయం ఉన్న సినిమాలను పక్కనబెట్టారని సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ జరుగుతుంటే.. కొందరు సినీ ప్రముఖులైతే ఓపెన్‌గానే ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేశ్ ఒక అడుగు ముందుకేసి ఇవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులని సెటైర్ వేశాడు.. తాజాగా గుణశేఖర్ నంది అవార్డులకి సంబంధించి తన సోషల్ మీడియా ద్వారా కామంట్స్ పెట్టడం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ సరిగ్గా జరగలేదని.. నిజంగా దక్కాల్సిన వారికి అవి దక్కలేదంటూ గుణ వ్యాఖ్యానించారు. గుణశేఖర్ స్వయంగా నిర్మించి.. దర్శకత్వం వహించిన రుద్రమదేవికి తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించగా ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు స్పందించలేదు. ఆయన కూడా దీనికి పెద్దగా పట్టించుకోలేదు.. కానీ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్నును మినహాయించడంపై గుణశేఖర్ ఫైరవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గొడవపడ్డారు కూడా. అవార్డు ఎంపికను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో ఇది కూడా ఏమైనా ఉందా అని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.