Read more!

English | Telugu

సినిమా పేరు:టక్కర్
బ్యానర్:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 9, 2023

సినిమా పేరు: టక్కర్
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, ఆర్జే విఘ్నేశ్‌కాంత్, మునీశ్‌కాంత్, సుజాతా శివకుమార్
మ్యూజిక్: నివాస్ కె. ప్రసన్న
సినిమాటోగ్రఫీ: వంచినాథన్ మురుగేశన్
ఎడిటింగ్: జి.ఎ. గౌతం
ఆర్ట్: ఉదయ్‌కుమార్ కె.
స్టంట్స్: దినేశ్ కాశి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
విడుదల తేదీ: 9 జూన్ 2023

కొన్నేళ్ల క్రితం వరకు సిద్ధార్థ్‌కు దాదాపు తెలుగు హీరో అన్న పేరు ఉండేది. క్రమక్రమంగా తెలుగు ప్రేక్షకులకు దూరమవుతూ, మాతృభాషా ప్రేక్షకులకు చేరువవుతూ వచ్చాడు. అడపాదడపా అతని తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు తమిళంలో అతను చేసిన 'టక్కర్' సినిమాని అదే టైటిల్‌తో పేరుపొందిన తెలుగు చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ విడుదల చేశాయి. 'మజిలీ' ఫేం దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

కథ
పేదరికంలో పుట్టి పెరిగిన గుణశేఖర్ అలియాస్ గన్స్ (సిద్ధార్థ్).. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా తల్లి, చెల్లిని వదిలి విశాఖపట్నంకు వస్తాడు. అక్కడ రకరకాల పనులు చేసి, తన కోపం కారణంగా ఎక్కడా పట్టుమని పదిరోజులు కూడా పనిచేయలేకపోతాడు. చివరకు క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. మరోవైపు రాసా (అభిమన్యు సింగ్) అనే క్రిమినల్ తన గ్యాంగ్‌తో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, వాళ్లను అమ్మడమో లేక అమ్మానాన్నల్ని బెదిరించి డబ్బు గుంజడమో చేస్తూ ఉంటాడు. ఒక యాక్సిడెంట్‌లో గుణ డ్రైవ్ చేసే క్యాబ్ డ్యామేజ్ అవడంతో దాని చైనా ఓనర్ అతడిని కొట్టి, ఏడేళ్లపాటు జీతం లేకుండా పనిచేయమంటాడు. దాంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి, ధైర్యం చాలక ఆగిపోయి, తన స్థితికి ఏడుస్తాడు గుణ. ఆ టైంలో రాసా గ్యాంగ్ కిడ్నాప్ చేసిన లక్కీ (దివ్యాంశ కౌశిక్)ని అనుకోకుండా గుణ రక్షిస్తాడు. వారి కోసం ఒకవైపు క్రిమినల్ గ్యాంగ్, మరోవైపు చైనీస్ గ్యాంగ్ వెతకడం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? గుణ, లక్కీ జీవితాలు ఎలాంటి టర్న్ తీసుకున్నాయి? డబ్బు సంపాదించాలన్న గుణ అనుకున్నది సాధించాడా?.. అనే ప్రశ్నలకు మిగతా కథలో సమాధానాలు లభిస్తాయి.


ఎనాలసిస్ :

డబ్బు అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తుందని నమ్మే గుణశేఖర్, డబ్బే అన్ని సమస్యలకూ కారణమని భావించే లక్కీ.. ఇద్దరూ ఒకరికొకరు తారసపడితే ఎలాంటి పరిణామాలు సంభవించాయనే ఆసక్తికర పాయింట్‌తో డైరెక్టర్ కార్తీక్ జి. క్రిష్ 'టక్కర్' సినిమాని రూపొందించాడు. అయితే కథనం విషయంలో మధ్యలో దారితప్పిపోయాడు. ఒక ఘటన జరిగి, దానితో కనెక్ట్ అయ్యే లోపుగానే ఇంకో ఘటన.. వరుసపెట్టి రావడంతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా దేనికీ కనెక్ట్ కాలేని స్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక రొమాంటిక్ సీన్ వచ్చి, అందులో లీనమయ్యేలోపుగానే వీపుమీద చరిచినట్లు యాక్షన్ సీన్ వచ్చి, మూడ్‌ను డిస్టర్బ్ చేస్తుంది. అలాగే ఈసారి యాక్షన్‌ను ఆస్వాదించేలోపు రొమాంటిక్ సీన్ వచ్చేస్తుంది. ఇవన్నీ సహజంగా జరిగినట్లుగా కాకుండా ఫోర్స్‌డ్‌గా రావడం కథనాన్ని దెబ్బతీసింది. 

మధ్యమధ్యలో యోగిబాబు తన చేష్టలు, మాటలతో ఆహ్లాదాన్ని పంచాడు కానీ, సినిమాని రక్షించడానికి అది సరిపోలేదు. సిద్ధార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్ లాంటి ప్రధాన పాత్రధారులందరూ బాగా నటించినప్పటికీ, దర్శకుడు సన్నివేశాల్ని కల్పించిన తీరు సినిమా నడకను దెబ్బతీసింది. సెకండాఫ్‌లో సిద్ధార్థ్, దివ్యాంశ మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకి కీలకం. దాన్ని మరింత నమ్మదగ్గదిగా, మరింత ప్రభావవంతంగా చిత్రీకరించినట్లయితే.. ఆ ఎమోషన్ సినిమాకి బలంగా మారివుండేది. అక్కడే దర్శకుడు ఫెయిలయ్యాడు. అలాగే రాసా గ్యాంగ్‌కు ఇచ్చిన ముగింపు కూడా కరెక్టుగా లేదు. అలాంటి క్రిమినల్ గ్యాంగ్‌ను చట్టానికైనా పట్టించాలి, లేదా చంపెయ్యనైనా చంపెయ్యాలి. ఆ రెండింటిలో ఏదీ జరగలేదు. 

సినిమాలోని మూడు పాటలూ సందర్భానుసారం వచ్చినవే. అయితే తెలుగు పాటలను కూడా తమిళ గేయరచయితలే రాశారన్నట్లు టైటిల్ కార్డులో వెయ్యడం ఉపేక్షించదగ్గ విషయం కాదు. సినిమా విడుదలకు ముందు యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన పాటల్లో శ్రీమణి, కృష్ణకాంత్ పేర్లను వేశారు కానీ సినిమా టైటిల్ కార్డులో వాళ్ల పేర్లు లేవు. పెద్ద బ్యానర్లు రిలీజ్ చేసినప్పటికీ ఈ తప్పు దొర్లడం సహేతుకమేనా? 

నివాస్ ప్రసన్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల్లోని మూడ్‌ను బాగానే ఎలివేట్ చేసింది. వంచినాథన్ మురుగేశన్ సినిమాటోగ్రఫీకి వంక పెట్టాల్సిన పనిలేదు. రొమాంటిక్ సీన్స్‌లో అయితే అతని కెమెరా రెచ్చిపోయింది. ఎడిటింగ్ విషయంలో గౌతం ఇంకా మెరుగ్గా పనితనం చూపించాల్సింది. ఉదయ్‌కుమార్ ఆర్ట్ వర్క్, దినేష్ కాశి యాక్షన్ కొరియోగ్రఫీ తగినట్లు ఉన్నాయి. 

నటీనటుల పనితీరు
హీరో గుణశేఖర్ రోల్‌కు సిద్ధార్థ్ అతికినట్లు సరిపోయాడు. తన రొమాంటిక్ బాయ్ ఇమేజ్‌కు తగ్గట్లు దివ్యాంశతో రొమాన్స్‌ను బాగా చేశాడు. అలాగే యాక్షన్ సీన్స్‌లోనూ తగ్గలేదు. మొదట్లో ధైర్యంలేనివాడిగా, తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో ధైర్యవంతుడిగా మారాక.. ఆ వేరియేషన్‌ను బాగా చూపించాడు. లక్కీగా దివ్యాంశ కౌశిక్‌కు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరికింది. ఇంతదాకా గ్లామర్ డాల్‌గానే తెరపై కనిపించిన ఆమె, ఈ సినిమాలో లక్కీ పాత్రలోని ఎమోషన్స్‌ను బాగా పలికించింది. అయితే ఆ క్యారెక్టర్‌కు పెట్టిన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఆమెను ప్రేమించేవాళ్లు తక్కువైపోతారు. క్రిమినల్ గ్యాంగ్ లీడర్‌గా అభిమన్యు సింగ్ సరిగ్గా సరిపోయాడు. యోగిబాబు చేష్టల వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్‌ను బాగా ప్రదర్శించాడు. తండ్రీకొడుకులుగా యోగిబాబు కనిపించాడు. తండ్రి క్యారెక్టర్ లో ఒకే సీన్‌లో కనిపిస్తే, కొడుకు పాత్రలో కామెడీని పండించాడు. హీరో ఫ్రెండ్‌గా ఆర్జే విఘ్నేశ్‌కాంత్ తన నిజ జీవిత పాత్రనే సినిమాలోనూ చేశాడు. మునీశ్‌కాంత్‌కు తగ్గ పాత్ర పడలేదు. హీరో తల్లిగా సుజాతా శివకుమార్ కనిపించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అక్కడక్కడా వినోదాన్ని పంచే 'టక్కర్'.. సిద్ధార్థ్ ఫ్యాన్స్‌ను కాస్త అలరించవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుల్ని అంతగా ఇంప్రెస్ చేయదు.  మొత్తంగా.. తెలుగు ప్రేక్షకులకు మళ్లీ చేరువవ్వాలని 'టక్కర్‌'గా సిద్ధార్థ్ చేసిన ప్రయత్నం ఫలించలేదని చెప్పాలి. 

- బుద్ధి యజ్ఞమూర్తి