Read more!

English | Telugu

సినిమా పేరు:శక్తి
బ్యానర్:వైజయంతి మూవీస్
Rating:---
విడుదలయిన తేది:Apr 1, 2011

కథ

మన దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించి వాటిని కాపాడే మహా శక్తి పీఠం అందరికీ తెలియకుండా నిగూఢంగా ఉంటుంది. ఆ మహా శక్తి పీఠాన్ని చూడగలిగేది మహదేవరాయలు(ప్రభు) వంశస్థులు మాత్రమే. వారి వద్ద అనువంశికంగా ఉంటున్న జ్వాలాముఖి అనే వజ్రం, రుద్రశూలాల సాయంతో మాత్రమే వారైనా ఆ శక్తి పీఠాన్ని 27 సంవత్సరాల కొకసారి ఆ మహా శక్తి పీఠాన్ని సందర్శించి, అక్కడ జగజ్జనని వద్దనున్న త్రిశూలంతో అక్కడే ఉండే అష్టాదశ శక్తి పీఠాల ప్రతిరూపాలైన స్థంభాలను తాకిస్తే ఆ అష్టాదశ శక్తి పీఠాలు తిరిగి మహిమాన్వితమవుతాయి.

 

ఆ మహా శక్తి పీఠానికి రుద్ర (యన్ టి ఆర్) అనే వ్యక్తి కారణ జన్ముడు, రక్షకుడిగా ఉంటాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. ఆ మహాశక్తి పీఠం రహస్యాన్ని తెలుసుకున్న మహదేవరాయల దివాన్ జానకి వర్మ(జాకీ ష్రాఫ్) మహదేవరాయల తండ్రి(యస్.పి.బాలసుబ్రహ్మణ్యం)ని చంపి ఆ రుద్ర శూలాన్ని అపహరించుకుని దుబాయ్ కి పోతాడు. ఈజిప్ట్ లో ఉన్న ఒక మంత్ర గత్తె (పూజాబేడీ) భర్త (సోనూసూద్) గతంలో ఆ మహాశక్తి పీఠం లోని త్రిశూలాన్ని తీసుకెళ్ళి మమ్మీల రూపంలో ఉన్న తన పూర్వీకులను పునరుజ్జీవితులను చేయటానికి భారతదేశం వస్తాడు. అక్కడ మహాశక్తి పీఠంలో రుద్ర అతన్ని చంపి తానుకూడా చనిపోతాడు. అతని భార్య(మంజరి ఫడ్నీస్) ఆ సమయంలో రుద్ర భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చి మరణిస్తుంది.

 

ఆ బిడ్దను యన్.యస్.జి.ఇన్ ఛార్జ్ శక్తి స్వరూప్(యన్ టి ఆర్) అని పేరుపెట్టి పెంచుకుంటాడు. మళ్ళీ 27 సంవత్సరాలకు ఆ మహా శక్తి పీఠంలో పూజ చేయటానికి ఆ రుద్రశూలం, జ్వాలాముఖి వజ్రం తిరిగి ఎలా సంపాదించి, ఈ శక్తి స్వరూప్ ఆ మహా శక్తి పీఠాన్ని దుర్మార్గుల బారినుంచి ఎలా కాపాడాడనేది ముగిలిన కథ.


ఎనాలసిస్ :

ఈ కథ చెప్పటానికి చాలా బాగుండి ఉంటుంది. ఎందుకంటే మెహెర్ రమేష్ కథ చెప్పటంలో బహుదిట్ట. కానీ ఆ కథను స్క్రీన్ మీద చూపించటలో అతనెప్పుడూ విఫలమవుతూ వచ్చాడు. "మున్నా"లాంటి ఫ్లాపిచ్చిన వంశీ పైడిపల్లికి యన్ టి ఆర్ అవకాశమిస్తే ఒక "బృందావనం"ఇచ్చాడు. కానీ మెహెర్ రమేష్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన "కంత్రీ" ఫ్లాపయినా యన్ టి ఆర్ అతనికి మరో అవకాశమిచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే చాలా ఛండాలంగా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉండి కాస్త ఫరవా లేదనించినా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ కథను ఎలా తీయాలో, ఏం చేయాలో అర్థం కాక ఏదో చేయబోయి ఇంకేదో చేసినట్లుగా ఉంటుంది.  దీనికి పెద్ద మైనస్ మెహెర్ రమేష్ అని చెప్పాలి. ఇతను నిజానికి దూరదర్శన్ లో సీరియల్స్ చేసుకోటానికి తప్ప సినిమాలు చేయటానికి పనికి రాడు. ఇంతోటి మెగా దర్శకుడికి ఈ సినిమా కోసం మెగాస్టార్ రికమెండేషన్ ఉందని వినికిడి.

దర్శకుణ్ణి వదిలేస్తే అంతకన్నా ముందు ఎంతో అనుభవమున్నఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఇంకా పెద్ద మైనస్. కారణం యన్ టి ఆర్ వంటి ఒక పవర్ ఫుల్ హీరోకి ఇలాంటి ఘోరమైన ఫ్లాపునివ్వటం దారుణం. ఇంతవరకూ తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ ఖర్చుపెట్టనంత రేంజ్‍ లో ఈ సినిమాకి 45 కోట్లు ఖర్చు పెట్టాం అని గొప్పలు చెప్పుకున్నారు. కానీ స్క్రీన్ మీద అంత ఖర్చుపెట్టినట్లు ఏం కనపడలేదు. ఇంకా చెప్పాలంటే ఆ మొత్తంలో సగం కూడా ఖర్చుపెట్టినట్లు కనపడదు.

ఒకప్పుడు వైజయంతీ మూవీస్ అంటే "జగదేకవీరుడు అతిలోకసుందరి" వంటి హిట్లిచ్చిన సంస్థ. ప్రస్తుతం "సుభాష్ చంద్రబోస్, సైనికుడు, జై చిరంజీవ, కంత్రీ" వంటి ఫ్లాపులు తీసిన, ఇంకా తీస్తున్న సంస్థగా పేరుపడుతోంది. ఇక్కడ ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమిటంటే నిర్మాతగా అశ్వనీదత్ ఈ సినిమాని ఒక్క ప్రివ్యూ కూడా వేయకుండా బెదిరించి అమ్ముకుని బాగానే ఉంటాడు. కానీ ఆయన సినిమాలు కొన్న పంపిణీ దారుడు, బయ్యర్లూ మాత్రమే సర్వనాశమవుతుంటారు.

ఇది వైజయంతీ మూవీస్ లో పైన ఉదహరించిన నాలుగు సినిమాలు కొన్న పంపిణి దారులూ, బయ్యర్లూ ఏమయ్యారో అందరికీ తెలిసిందే. ఇంక వైజయంతీ మూవీస్ ప్రతిష్త దిగజారకుండా ఉండాలంటే అశ్వనిదత్ సినిమాలు తీయటం మానేస్తే బాగుంటుంది. అందువల్ల యన్ టి ఆర్ వంటి స్టార్ హీరోల పరిస్థితి ఫ్లాపులు లేకుండా మెరుగుపడుతుంది.    


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

టన -: ఒక హీరోగా, నటుడిగా యన్ టి ఆర్ ఏమిటనేది ఈరోజున కొత్తగా చెప్పాల్సిన పని లేదు. యమదొంగలో అతను మైథాలజీ డైలాగ్ చెప్పిన విధానం బహుశా ఈరోజు యువ హీరోలు ఎవరివల్లా ఆ డైలాగ్ అలా చెప్పటం చేతకాదంటే అతిశయోక్తి కాదు. ఇక నటన కానీ, డ్యాన్సులు కానీ, యాక్షన్ సీన్లు కానీ అతన్ని వాడుకునే వాడిదే అంటే ఆ యా చిత్రాల దర్శకులదే లోపం కానీ యన్ టి ఆర్ ది కాదనేది జగమెరిగిన సత్యం.

 

యన్ టి ఆర్ ఒక సముద్రం అయితే దర్శకుడు చెంచా తీసుకెళ్తే చంచాడు, బిందె తీసుకెళ్తే బిందెడు, ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకర్ నిండా నీళ్ళు తెచ్చుకోవచ్చు. రాజమౌళి మాత్రమే ఇప్పటి వరకూ యన్ టి ఆర్ ని ఒక యాభై శాతం మాత్రమే వాడుకున్నాడు. కానీ ఈ చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్ మాత్రం యన్ టి ఆర్ ని పది శాతం కూడా ఈ చిత్రంలో వాడుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ ఇలియానా కానీ మిగిలిన నటినటులు ఎవరైనా నటించటానికి నటింపజేసుకునే వాడికి దమ్ము లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సంగీతం -: మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటల్లో "తాలియా తాలియా", "ప్రేమ దేశం యువరాణి" పాటలు వినటానికి చాలా బాగున్నాయి. రీ-రికార్డింగ్ పెద్ద గొప్పగా ఏం లేదు. పైగా ఒక్కోచోట సౌండ్ పొల్యూషన్ లా ఉంది.

సినిమాటోగ్రఫీ -: చోటా.కె.నాయుడు "బృందావనం"లో పాటలు తీసిన స్టైల్ కీ ఈ చిత్రంలో సమీర్ రెడ్డి తీసిన స్టైల్‍ కీ చాలా తేడా ఉంది. లొకేషన్ బ్యూటీని చాలా బాగా చిత్రీకరించి పాటల్లో గజిబిజి షాట్లు పెట్టి మన కళ్ళు పాడుచేశారు. ఇందులో ఎడిటర్ కి కూడా భాగం ఉందనుకోండి. ఎందుకనో సమీర్ రెడ్డి కెమెరా కన్ను ఈ చిత్రంలో మెల్లనయ్యింది.

మాటలు -: ఎక్కువమంది వంట చేస్తే వాడేశాడని వీడు వీడేశాడనుకుని వాడు ఉప్పేయటం మర్చిపోయారట. లేదా వాడేయలేదోనని వీడు వీడేయలేదేమోనని వాడు ఉప్పేసి వంటని సర్వనాశనం చేశారట. ఈ చిత్రంలోని మాటలకు పైన చెప్పిన ఉదాహరణ చాలా బాగా సరిపోతుంది. ఈ చిత్రంలోని మాటలు ఏ మాత్రం బాగాలేవంటే అతిశయోక్తి కాదు.

ఎడిటింగ్ -: యావరేజ్ స్థాయిలో ఉంది. ఆర్ట్ - ఇది ఒక్కటే చాలా బాగుంది. మహాశక్తి పీఠం సెట్ సహజంగా ఉండి బాగుంది.

 

కొరియోగ్రఫీ -: "తాలియా", "ప్రేమ దేశం యువరాణి" పాటల్లో తప్ప మిగిలిన పాటల్లో సగటు స్థాయిలోనే ఉంది.

యాక్షన్ -: స్టన్‍ శివ యాక్షన్ కంపోజింగ్ గొప్పగా ఏం లేదు. పైగా కొంచెమ కన్ ఫ్యూజింగ్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా కత్తి యుద్ధం సీన్లలో.

 

యువ హీరో యన్ టి ఆర్ మీద ఉన్న గౌరవంతో మేము ఈ "శక్తి" చిత్రానికి రేటింగ్ ఇవ్వటం లేదు. ఈ "శక్తి" చిత్రానికి రేటింగ్ ఇచ్చి మేము అభిమానించే హీరో యన్ టి ఆర్ ని అవమానించలేము. యన్ టి ఆర్ భవిష్యత్తులో ముఖవాటాలకు పోకుండా, భజన పరుల మెరమెచ్చుమాటలకు లొంగకుండా, తను నటించబోయే సినిమాల విషయంలోనిర్మొహమాటంగా వ్యవహరిస్తూ, తన చిత్రాలకు కాస్త కామన్ సెన్సున్న రాజమౌళి వంటి దర్శకులను ఎన్నుకొని తనను అభిమానించే అభిమానులను నిరాశపరచరని ఆశిస్తున్నాం.