Read more!

English | Telugu

సినిమా పేరు:రాజన్న
బ్యానర్:అన్నపూర్ణ తుదిఒస్
Rating:3.50
విడుదలయిన తేది:Dec 21, 2011

కథ - అదిలాబాద్ జిల్లాలోని నేలకొండపల్లి గ్రామంలో కథ ప్రారంభమవుతుంది. అక్కడ ప్రతి ఒక్కరూ ఒక తులసికోట వద్దకు వచ్చి దణ్ణాలు పెడుతూంటారు. దాన్ని ఆ ఊరి జనం రాజన్నగా భావిస్తుంటారు.ఆ ఊరిలో సాంబయ్య మనవరాలిగా పెరుగుతున్న మల్లమ్మ (ఎన్నీ) అనే చిన్న పిల్ల దొరసాని గడీలో పాట పాడటంతో దొరసాని ఆమెను కొరడాతో కొట్టి "నీ నోటి నుంచి మాట తప్ప పాట వస్తే తల నా గుమ్మానికి వెలాడదీస్తా"నని దాష్టీకం చేస్తుంది.

దాంతో దొరసాని కూతురుకి గడీలో సంగీతం నేర్పే మాస్టారు (నాజర్) మల్లమ్మకు పాటలు వినేందుకు ఒక ట్రాన్సిస్టర్ ఇస్తాడు. ఒకసారి మల్లమ్మ పాట పాడటానికి తయారవుతూందన్న విషయం తెలుసుకుని సాంబయ్యను చంపి, ఇంట్లో మల్లమ్మను పెట్టి ఇల్లు తగులబెడుతుంది దొరసాని. అప్పుడు సంగీతం మాస్టారు మల్లమ్మను కాపాడి "దేశానికి దాస్య విముక్తి కలిగినా, మనకు స్వరాజ్యం రాలేదనీ, అందుకు ప్రథాని జవహర్ లాల్ నెహ్రూ కల్పించుకోవాల"నీ మల్లమ్మతో అంటాడు.

దాంతో మల్లమ్మ ఎలా ఢిల్లీ వెళ్ళిందీ...? అక్కడ ఏం చేసిందీ...? అసలు రాజన్న ఎవరు...? ఏం చేశాడు...? రాజన్నకూ, మల్లమ్మకూ సంబంధం ఏమిటి...? అక్కడ ఏం జరిగిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - ఈ "రాజన్న" సినిమాలో రాజమౌళి మార్కు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, టేకింగ్ వంటి విషయాలను గమనిస్తే రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ ఒక్క యాక్షన్ సీన్లలోనే కాక సినిమా అంతా ఉందనటంలో నాకెలాంటి సందేహం లేదు.

ఈ సినిమాలో కనీసం నాలుగైదు చోట్ల కళ్ళమ్మట కన్నీరొస్తుంది. ఈ సినిమాలో సెంటిమెంటు అంతలా పండింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే "అమ్మా అవనీ నేలతల్లీ" అనే పాట మనసున్న ప్రతి మనిషినీ కదిలిస్తుంది. అంతే కాక బోనాల పండుగ సమయంలో పన్ను వేయటానికి వచ్చిన ఖాన్ దురాగతం ప్రేక్షకుల నెత్తురు మరిగేలా చేస్తుంది.

అలాగే రాజన్న దేశభక్తి, అతని స్నేహితులకు అతని మీద ఉన్న నమ్మకం, వాళ్ళ ఆశలు దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరినీ రోమాంచితులను చేస్తాయి. రాజన్న ప్రజలను బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడేలా పాడిన పాటలో చిత్రీకరించిన సన్ని వేశాలు కూడా మనసుకు హత్తుకుంటాయి. రాజన్న చనిపోయే సీన్ లో రాజన్న తన గుండె చప్పుడు గురించి ఖాన్ తో హిందీలో చెప్పే మాటలు కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

ఇలాంటి ఒక విభిన్నమైన సామాజిక ప్రయోజనం ఉన్న సినిమా నిర్మించిన నాగార్జున అభిరుచికి వెయ్యి దండాలు. ఈ "రాజన్న" సినిమాని ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా ఉన్నతమైన ప్రమాణాలతో నిర్మించినందుకు నాగార్జునను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ కృషిలో భాగంగా నాగార్జునకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ చిత్రం ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ సుప్రియను కూడా అభినందించటం సమంజసం. ఇది కచ్చితంగా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ విలువ నిలబెట్టే చిత్రం. అందులో ఎలాంటి అనుమానం లేదు.

నటన - ఈ సినిమాలో రాజన్న పాత్రధారి, హీరో నాగార్జున నటన విభిన్నంగా సాగి, మనకు కొత్త నాగార్జున కనపడతారు. "వెయ్ వెయ్" అనే పాటలో ఆయన నటన ఆకాశాన్నంటిందని చెప్పాలి. బ్రిటీష్ వారితో గొలుసులు కట్టిన నాగార్జున చెప్పే డైలాగులు చాలా బాగున్నాయి. ఆయన నటన కూడా చాలా బాగుంది.

అయితే గతంలో శివాజీ గణేశన్ (వీరపాండ్యకట్ట బ్రహ్మన), కృష్ణ (అల్లూరి సీతారామరాజు), యన్ టి ఆర్ (మేజర్ చంద్రకాంత్) సినిమాల్లో ఇలాంటి సీన్లలోనే నటించటంతో వారితో నాగార్జున నటన పోలికకు రావటం సహజం. ఆ పోలిక లేకుండా మీరు ఆ సీన్ చూడగలిగితే నాగార్జున నటన మీకు బాగుంటుంది. మిగిలిన సీన్లలో నాగార్జున నటన ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగార్జున " నా సినీ కెరీర్ ని నేను వెను తిరిగి చూసుకుంటే నాకంటూ చెప్పుకోటానికి నాలుగు మంచి సినిమాలుండేలా నటించాలని ఉంది" అని అన్నారు. అది ఈ సినిమాలో నాగార్జున చూపించారు. ఇక ఈ సినిమాలో నటించిన స్నేహ ఖాన్ ని చంపే దృశ్యంలో ముందు బేలగా ఆ తర్వాత దాదాపు ఆదిశక్తిలా కనిపించింది. ఆమెకు అనుభవం ఉన్న నటి గనుక నటించింది అనుకోవచ్చు.

కానీ మల్లమ్మ పాత్ర పోషించిన బాలనటి ఎన్నీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పాలి. నవరసాలు అవలీలగా అద్భుతంగా పోషించిందీ పాప. దయ్యాలుంటాయని తాత చెప్పిన సీన్లో మేకపిల్లలతో మాట్లాడే సీన్లో, తన సంచి లాక్కుని పారిపోతున్న వాణ్ణి వెంటాడే సీన్లో ఆమె హావభావాల్లో చూపించిన వేరియేషన్స్ అద్భుతం.

అలాగే క్లైమాక్స్ లో "అమ్మా అవనీ నేలతల్లీ" పాటలో కూడా ఆమె నటన మనసుకు హత్తుకుంటుంది. ఆమెకు 2011 సంవత్సరానికి గాను ఉత్తమ బాలనటిగా నంది అవార్డు కచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆమె నటన ఆ స్థాయిలో ఉంది. రాజన్న స్నేహితులుగా నటించిన ప్రదీప్ రావత్, సుప్రీత్, అజయ్, మరో యువనటుడి నటన కూడా చాలా బాగుంది. ఇక మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఈ చిత్రానికి సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి. ఈ సినిమాలోని ఏ పాట గురించి చెప్పి, ఏ పాట గురించి చెప్పకుండా ఉండగలం....? "గిజిగాడు, అమ్మా తల్లీ నేలతల్లీ, వెయ్ వెయ్" ఇలా అన్ని పాటలూ బాగున్నాయి. ఇక రీరికార్డింగ్ అద్భుతంగా ఉంది. చాలా కాలం తర్వాత కీరవాణి నుంచి చాలా చక్కని సంగీతం ఈ చిత్రంలో వినపడుతుంది.

సినిమాటోగ్రఫీ - ఈ సినిమాకి ముగ్గురు కేమెరామెన్లు పనిచేశారు. ముగ్గురూ కూడా ఈ సినిమాని కన్నుల పండుగ్గా తెరకెక్కించారనటంలో సందేహం అక్కర్లేదు. లైటింగ్ స్కీమ్ కూడా చాలా బాగుంది.

ఎడిటింగ్ - చాలా బాగుంది. ఒక్క వేస్ట్ షాట్ లేకుండా చాలా బాగుంది కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్.

ఆర్ట్ - రవీందర్ ఆర్ట్ పనితనం చాలా బాగుంది. ఇది కొత్తేంకాదు కాని, ఈ "రాజన్న" సినిమాలో రవీందర్ కొత్త అవతారమెత్తారు. ఈ చిత్రానికి ఆయనే మెకప్, కాస్టూమ్స్ డిజైనర్ గా కూడా పనిచేశారు. ఆ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించినందుకు రవీందర్ ను ప్రత్యేకంగా అభినందించాలి.

కొరియోగ్రఫీ - ఈ చిత్రంలో పాటలు డ్యాన్స్ కోసం కాక కథాగమనానికి, కథలోని ఉద్వేగాన్ని చెప్పటానికీ, కథ్యను చెప్పటానికీ మాత్రమే ఉన్నాయి. ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ అందుకు తగ్గట్టుగా, అందంగా, అర్థవంతంగా ఉంది ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ.

యాక్షన్ - నలుగురు ఫైట్ మాస్టర్లు ఈ చిత్రానికి పనిచేశారు. ఎవరు ఏ సీన్ తీశారో తెలియదు కానీ అన్ని యాక్షన్ సీన్లలోనూ మనకు కచ్చితంగా రాజమౌళి కనపడతాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రొటీన్ సినిమాల నుంచి తెలుగు సినిమాని బయటకు తెచ్చి ఒక విభిన్నమైన, చక్కని సినిమాను చూపించిన నాగార్జునను ఈ సినిమా చూట్టం ద్వారా అభినందించటం మినహా ప్రేక్షకులు చేయగలిగింది ఏం లేదు. అలాగే మీకు గనక దేశభక్తి ఉంటే ఈ "రాజన్న" సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ యేటి మేటి చిత్రం"రాజన్న" అనుమానం లేదు.