Read more!

English | Telugu

సినిమా పేరు:నాగవల్లి
బ్యానర్:శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 16, 2010
ఇది కన్నడంలో ఇదే పి.వాసు దర్శకత్వంలో,విష్ణువర్థన్ నటించిన "ఆప్తరక్షక"చిత్రం.గతంలో రజనీ కాంత్ నటించిన "చంద్రముఖి"చిత్రానికిది కొనసాగింపు చిత్రం.ఇక కథలోకి వస్తే ఒక చిత్రకారుడు జట్కాబండిలో వెళ్తూ దారిలో పడి ఉన్న ఒక చిత్ర పటాన్ని చూసి,దాన్ని తన ఇంటికి తీసుకెళతాడు.అది చంద్రముఖి చిత్రపటం.ఆ చిత్ర పటం వందేళ్ళ క్రిందట గీయబడిందని,దాన్ని విదేశాల్లో అమ్మితే కోట్లు వస్తాయనీ,మన దేశంలో అయితే 20,30 లక్షల వరకూ వస్తాయనీ భార్యతో చెపుతాడు.దాన్ని మీరే వేసినట్టు మీ పేరు మీద అమ్మితే మన దరిద్రం తీరుతుందని సలహా ఇస్తుంది అతని భార్య. దానికతను ఒక చిత్రకారుడి బొమ్మని నాది అని చెప్పుకోవటం ఆత్మహత్యా సదృశం అని అంటాడు భార్యతో. అలాంటప్పుడు మీరు ఆత్మహత్య చేసుకోవటమే మంచిది అంటుందామె.తెల్లారే సరికి అతను చంద్రముఖి బొమ్మ ముందు చనిపోయి పడి ఉంటాడు.చిత్రకారుడి భార్య ఆ బొమ్మని ఎవరికైనా కానుకగా ఇచ్చేయమని అక్కడున్న వారితో చేపుతుంది.తర్వాత శరత్ బాబు ఇంట్లో కూతురి పెళ్ళి సందర్భంగా పెళ్ళి కొడుకు నాకీ పెళ్ళి వద్దని పారిపోతాడు.అదే సమయంలో పెళ్ళి కూతురు స్నేహితురాలు తానొక 30 అడుగుల పెను సర్పాన్ని చూశానని,ఆ తర్వాత స్పృహ తప్పాననీ చెపుతుంది.అందుకని పాములు పట్టే వ్యక్తిని పిలిపిస్తే అతను చనిపోతాడు.తమకు తెలిసిన రామచంద్ర సిద్ధాంతి వద్దకు వెళ్తే అతను వచ్చి గతంలో గంగ వల్ల బయటకు వచ్చిన చంద్రముఖి ఈ ఇంట్లో తిష్టవేసిందనీ,ఆ ఇంట్లో చంద్రముఖి బొమ్మ చూడగానే అనుకుంటాడు సిద్ధాంతి.ఆ బొమ్మ మీకెక్కడిదని సిద్ధాంతి అడగగానే మా అమ్మాయి(కమలినీ ముఖర్జీ ),అల్లుడు సాంప్రదాయ నృత్యపోటీల్లో గెలుపొందినందుకు ఆ బొమ్మ బహుమతిగా వచ్చిందనీ,కానీ వాళ్ళు వచ్చేటప్పుడు లారీ యాక్సిడెంట్ లో మరణించారని చెపుతాడు శరత్ బాబు.శరత్ బాబు నలుగురు కూతుర్లలో పెద్ద కూతురు చనిపోగా,రెండవ కూతురు గీత (శ్రద్ధాదాస్), మూడవ కూతురు (రీచా గంగోపాథ్యాయ),నాలుగవ కూతురు (పూనమ్ కౌర్) ఉంటారు.ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దగలవారు భారతదేశంలో ఇద్దరే ఉన్నారు.వారు ఈశ్వర్ (రజనీ కాంత్),అతని శిష్యుడు డాక్టర్ విజయ్ (వెంకటేష్).ఈశ్వర్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి విజయ్ ని అక్కడికి పిలిపిస్తాడు సిద్ధాంతి.విజయ్ అక్కడి పరిస్థితులను ఎలా చక్కబెట్టాడు...?చంద్రముఖి ఆత్మ ఏమౌంది...?అన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ చిత్రం మాతృక అయిన కన్నడ చిత్రం"ఆప్తరక్షక"దర్శకుడు కూడా పి.వాసు కావటం వల్ల,ఇది వెంకటేష్ నటజీవితంలో రజతోత్సవ సంవత్సరం కావటం వల్లా దానికన్నా దీన్ని కచ్చితంగా బాగుండేలా తీయటానికి దర్శకుడు వాసు ప్రయత్నించాడని చెప్పొచ్చు.కానీ గతంలో రజనీ కాంత్ ని ఇలాంటి పాత్రలో చూసిన జనం తప్పకుండా వెంకటేష్ ని అతనితో పోల్చి చూస్తారు.అది సహజం కూడా.అందుకు తగ్గట్టే వెంకటేష్ కూడా తన ప్రయత్నలోపం లేకుండా,తన శక్తిమేరకు ఈ పాత్రలో నటించాడని చెప్పాలి.ఈ సినిమాలో డాక్టర్ విజయ్ గా వెంకటేష్ తన సహజసిద్ధమైన నటనతో అలరించగా,నాగభైరవ రాజశేఖరుడిగా కాస్త నెగెటీవ్ టచ్ ఉన్నపాత్రలో కొత్తగా అద్భుతంగా నటించాడు.ఇక నాగభైరవ రాజశేఖరుడు అఘోరాగా మారాక,ఆ పాత్ర నిడివి తక్కువే అయినా,ఆ గెటప్ లో వెంకటేష్ కొత్తగా కనిపించటమే కాక నటన కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.నిజానికి వెంకటేష్ నటనను రజనీకాంత్ నటనతో పోల్చకుండా ఈ చిత్రం చూస్తే వెంకటేష్‍ నటన మనకు నచ్చుతుంది.నిజానికి అతనెంత కష్టపడి మూడు వేరియేషన్లను తన నటనలో చూపించాడో మనకర్థమవుతుంది.ఈ చిత్రంలో ఇక అనుష్క నాగవల్లిగా నటన పరంగా బాగా నటించినప్పటికీ,నాగవల్లిగా ఆమె చేసిన నాట్యంలో గ్రేస్ లేకపోవటంతో అంతగా ఆకట్టుకోదు.ఆమెకి క్లాసికల్ డ్యాన్స్ రాదని ఆమె మూవ్ మెంట్స్ చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.ఇక పిచ్చిపట్టిన అమ్మాయిలా కమలినీ ముఖర్జీ నటన కృతకంగా కనపడుతుంది.సిద్ధాంతిగా అవినాష్ "చంద్రముఖి" సినిమాలోలానే నటించాడు.చంద్రముఖి ఆవహించిన అమ్మాయిలా రీచా గంగోపాథ్యాయ నటనలో బ్యాలెన్సింగ్ కొరవడింది.ఒక్కోసారి అద్భుతంగా కనిపించిన ఆమె నటన అంతలోనే డ్రాపవటం,మళ్ళీ బాగుందనిపించటం కాస్త మైనస్.అయినా ఆమె బాగానే నటించిందని చెప్పాలి.శ్రద్ధా దాస్ ని చూస్తుంటే అప్పుడే మీసం తీసిన అమ్మాయిలా కనిపిస్తుంది.కానీ నటిగా ఆమె నటన కూడా బాగుంది.ఇక పూనం కౌర్ కి నటించటానికి పెద్దగా ఏం లేదు.శరత్ బాబు,ప్రభ గతంలో ఇలాంటి పాత్రలు కొన్ని వందలు చేసుంటారు.ఇక బ్రహ్మానందం కామెడీ అక్కడక్కడ బాగుంది.దానితో పోలిస్తే ధర్మవరపు కామెడీ కాస్త బాగుందని చెప్పాలి. సంగీతం - ఈ చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి.ఇక రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణం.ఈ చిత్ర సంగీతంలో పాశ్చాత్యపోకడలు ఎక్కడా మనకు కనిపించవు.ఒక సాంప్రదాయబద్దమైన సంగీతాన్ని ఈ చిత్రంలో మనం వినవచ్చు.ఇందుకు ముఖ్యంగా గురుకిరణ్ ని అభినందించాలి.ముఖ్యంగా "ఘిరన ఘిరి ఘిరన"పాటలో బాలు పాడిన విధానం,దానికి నాగభైరవ రాజశేఖరుడిగా వెంకటేష్ నటన చాలా బాగుంటే...అనుష్క డ్యాన్స్ మైనస్సయ్యింది.మొదటి పాట "ఓంకారం","అభిమాని లేనిదే","ఖేల్ ఖేల్"అనే పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ - శ్యాం.కె.నాయుడి ఫొటోగ్రఫీ చాలా బాగుంది.కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఒక స్థాయిలోనే ఉన్నాయని చెప్పొచ్చు.అఘోరా వెంకటేష్ తో డాక్టర్ విజయ్ వెంకటేష్ ఫైటింగ్ చేసే సీన్ బాగా తీశారు.పాటల్లో కూడా ఫొటోగ్రఫీ బాగుంది. మాటలు - పరుచూరి బ్రదర్స్ మాటలు ఇంకా క్లుప్తంగా ఉంటే బాగుండేవి.అయినా మూడువందల సినిమాలకు మాటలు వ్రాసినా కూడా అలుపెరుగని యోధుల్లా ఆ అన్నదమ్ములు ఇంకా నేటి తరం రచయితలతో పోటీపడటం వారి స్టామినాని తెలియజేస్తుంది. పాటలు - బాగున్నాయి.ఉన్నంతలో చంద్రబోస్ శక్తివంచన లేకుండా పాటలన్నీ బాగానే వ్రాశాడు.సాహిత్యపరంగా అంతకంటే గొప్పగా రాయటానికి అతనేమన్నా పింగళీ నాగేంద్రమో,వేటూరో కాదుకదా... ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.ఎక్కడా ల్యాగ్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఆర్ట్ - ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని అభినందించాలి.నాగవల్లి ఇంటి సెట్ కానీ,అఘోరా డెన్ సెట్ కానీ సహజంగా ఉండేలా చాలా బాగా వేశాడు చిన్నా. కొరియోగ్రఫీ - "అభిమాని లేనిదే"పాటలో బాగుంది.మిగిలిన పాటల్లో యావరేజ్‍ గా ఉంది. యాక్షన్ - బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ చిత్రాన్ని రజనీకాంత్"చంద్రముఖి"చిత్రంతో పోల్చకుండా చూస్తే బాగుందనిపించవచ్చు.కానీ ఆ చిత్రాన్నీ, ఆ చిత్రంలో రజనీ నటననీ ఈ చిత్రంతో పోల్చారంటే ఈ చిత్రాన్ని మీరు అంతగా ఎంజాయ్ చేయలేరు.కానీ హీరో విక్టరీ వెంకటేష్ కోసం అతని విభిన్నమైన నటన కోసం,ఈ చిత్రంలో ఉన్న అయిదుగురు హీరోయిన్ల కోసం,కొంచెం థ్రిల్ కావాలనుకుంటే ఈ చిత్రాన్ని ఒకసారి హ్యాపీగా చూడవచ్చు.