Read more!

English | Telugu

సినిమా పేరు:జై బోలో తెలంగాణా
బ్యానర్:మహాలక్ష్మి ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 4, 2011
తాత ముత్తాతల నుంచీ తన తండ్రి వరకూ తెలంగాణా ఉద్యమంలో అమరులైన వారి వారసుడు, జయమ్మ కొడుకు వర్షిత్ ఉద్యమం అంటే దూరంగా ఉంటాడు.అతను తన క్లాస్ మేట్‍ విజయవాడ అమ్మాయి సహజని ప్రేమిస్తాడు.ఆమె శలవులకు తెలంగాణాలోని వర్షిత్ ఊరికి వచ్చి వీరి సంకృతీ సంప్రదాయాలని ఇష్టపడి అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది.ఈ లోగా తెలంగాణాలో కష్టాలతో ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే, అతని భార్య పెద్ద మనసుతో సంపాదన లేని విద్యార్థి చారి అనే కుర్రాడి అక్క, బావలకు బట్టలనివ్వటం,ఒకమ్మాయి ఇల్లు గడవక పడుపువృత్తి చేయలేక కడుపున పుట్టిన బిడ్డను అమ్ముకోవటం వంటివాటిని చూసిన వర్షిత్ చలించిపోయి, తన తండ్రి ఈ ఉద్యమం కోసం ఎలా చనిపోయాడో గుర్తుకొచ్చి తెలంగాణా ఉద్యమంలో చేరతాడు.అలాగే సీమాంధ్రులతో కలసిన తెలంగాణా నాయకులు కొందరు చేసే అన్యాయాలను చూసి భరించలేక వారితోనే లీగల్ ఎడ్వయిజర్ గా ఉన్న ఒక న్యాయవాది కూడా తెలంగాణా ఉద్యమంలో చేరతాడు.ఈ ఉద్యమం ధ్యాసలో పడి తన ప్రియురాలిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు వర్షిత్. ముందు అపార్థం చేసుకున్నా తర్వాత అతని భావావేశాన్ని అర్థం చేసుకున్న సహజ కూడా ఈ ఉద్యమంలో చేరుతుంది.కానీ అతని అన్న సమైక్యవాది కావటంతో అక్కడ సమైక్యవాద ఉద్యమం చేస్తున్న ఒక యువ నాయకుడితో సహజ పెళ్ళి నిశ్చయం చేస్తాడు.తెలంగాణా ప్రజల కష్టాలను చూసి తట్టుకోలేక ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చారి పెట్రోలు పోసుకుని ఆత్మబలిదానం చేస్తాడు.ఇవన్నీ చూసిన జయమ్మ తాను నిరాహార దీక్షను చేపడుతుంది.ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
సినిమాని సినిమాలా తీయకుండా, సమస్య ఏమిటి...? దానికి పరిష్కారం ఏమిటనేదాన్ని పక్కన బెట్టి, ఈ చిత్రం పూర్తిగా ఏక పక్షంగా వేర్పాటు ధోరణితో తెలంగాణా ఉద్యమానికి ఊతమిచ్చేలా నిర్మించిన చిత్రం.దీని కోసం సీమాంధ్ర వారిని అత్యంత స్వార్థపరులుగా, కుట్రదారులుగా, దుర్మార్గులుగా,హింసా వాదులుగా, ఆడి తప్పే వారిగా చూపించారు.కానీ సీమాంధ్ర వాసులు ఏ విధంగా తెలంగాణాని దోచుకుంటున్నారో అన్న దాని మీద కన్నా, దొచుకోబట్టే తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరిగిందనే దాన్నే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కనపడిందీ చిత్రంలో. దాన్ని బలపరచుకోటానికి సహజ తండ్రి జయమ్మతో భోరున ఏడుస్తూ తన కూతుర్ని కాపాడమని అడగించటం, పోలీసులు పాశవికంగా విద్యార్థుల మీద దౌర్జన్యాలు చేయటం వంటి వాటికి ఎక్కువ ప్రాథాన్యతనిచ్చారు.దాంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం స్వార్థపూరితమైనదనీ,దానికి నైతికత లేదనీ చూపించారు.తెలంగాణా వస్తేనే వారి కష్టాలు తీరతాయనీ, వారికి ఉద్యోగాలు వస్తాయనీ,తమ నీళ్ళు, తమ గనులు, తమ భూములూ,తమ పాలన తమకే కావాలనే భావనతో ఈ చిత్రాన్ని నిర్మించారు. టూకీగా ఈ చిత్రం చెప్పే సందేశం ఇది.ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఓవరాల్ గా బాగుంది.కానీ చారి పాత్ర అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణా గురించి ఉద్యోగాలు వస్తాయా అనీ,తమ నీళ్ళు తమకే దక్కుతాయా అనీ, తమ గనులు, తమ భూములూ,తమ పాలన తమకే వస్తే తెలంగాణా బాగుపడుతుందాని సలహా అడిగి ఆయన అవును అని చెప్పిన సమాధానానికి పెట్రోలుపోసుకుని తనను తాను ఆత్మబలిదానం చేసుకోవటం,దానికి అంబేడ్కర్ ని సాక్షిగా చూపించే ప్రయత్నం చేయటం అంత సమంజసంగా లేదు.ఒక విధంగా ఆ సీన్ మరికొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పేలా చిత్రీకరించటాన్ని సెన్సారు వారు ఎలా అంగీకరించారో అర్థం కాదు.ఇక సహజం పెళ్ళిచేసుకోబోయే చంటి పాత్ర, అతని మామయ్య పాత్ర, ఎ.వి.యస్., జనార్థన మహర్షి పాత్రలు కుడా సీమాంధ్ర వారిని పరమ నీచులుగా చూపించేలా చిత్రీకరించారు.ఇది సీమాంధ్రప్రజలకు రాంగ్ మెస్సేజ్ పంపేలా ఉంది.అలాగే ఉద్యమంలో ఏ ఆడపిల్లకయినా కాల్లో బుల్లెట్ దిగితే, దానికి ఆమె తండ్రి సంతోషపడతాడని నేనయితే అనుకోను.అంతే కాకుండా శివారెడ్డి నటించిన తమిళ పోలీస్ పాత్ర ద్వారా విద్యార్థులను విడిపించి, జై తెలంగాణా అనిపించి చెప్పించటం వంటివి ఈ ఉద్యమ ప్రచారానికి తయారుచేసే క్యాసెట్లలా ఉన్నాయే కానీ ఒక సినిమాలో సీన్లలా లేవు.ఈ చిత్రపు నిర్మాణపు విలువలు నటీనటులను ఎన్నికచేయటంలోనే అర్థమవుతుంది. నటన - ఈ సినిమాలో ఎవరూ అద్భుతంగా నటించారనటానికి లేదు కానీ, కొత్త పాత నటీనటుల కలయికల్లో వచ్చిన ఈ చిత్రంలోని నటీనటుల నటన ఫరవాలేదనిపిస్తుంది. సంగీతం - "జై బోలో తెలంగాణా "పాట,గద్దర్ పాడిన "పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా"పాటలు బాగున్నాయి.కె.సి.ఆర్ రాసిన "గారడి చేస్తుండ్రు...గడబిడ చేస్తుండ్రు"అంటూ సీమాంధ్ర రాజకీయ నాయకులను విమర్శిస్తూ సాగే పాట అర్థం ఎలాగున్నా పాట వినటానికి కూడా బాగుంది.బహుశా ఈ పాటను సీమాంధ్రల్లో తీసేయమని జనం గొడవ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కెమెరా - సగటు స్థాయిలోనే ఉంది. చెప్పుకోతగిన స్థాయిలో లేదు. మాటలు - మాటలు కొన్ని చోట్ల బాగున్నాయి.మాటల రచయితలో మంచి స్పార్క్ ఉంది కానీ ఇలాంటి సినిమాలకు రాస్తే అతనికి భవిష్యత్తులో పెద్ద హీరోల కమర్షియల్ సినిమాలు వచ్చే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. పాటలు - అన్ని పాటలూ బాగున్నాయి. ఎడిటింగ్ - బాగుంది. ఆర్ట్ - ఒ.కె. కొరియోగ్రఫీ - ఫరవాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ చిత్రం కచ్చితంగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది.ఇది దేశ స్వమైక్యతను కోరే భారతీయుడు ఎవరూ హర్షించరు.మన దేశ సమగ్రతకు, సమైక్యతకూ భంగం కలిగించే ఇలాంటి వేర్పాటువాదాలను ప్రోత్సహించటం ఒక విధంగా దేశద్రోహమే అవుతుంది.ఈ ఇలాంటి ప్రత్యేకవాదానికి ఒక చలన చిత్ర రూపం ఇచ్చేటప్పుడు పూర్తిగా తెలంగాణా వాదులతోనే తీసుంటే ఇంకా బాగుండేది.అలా కాకుండా ప్రథాన పాత్రకు కోస్తాంధ్రకు చెందిన జగపతిబాబు వంటి వారిని నటింపజేయటం చూస్తే ఈ వారికీ సినిమా పట్ల వారికున్న కమిట్ మెంటు ఎంతటిదో తెలియజేస్తుంది.ఈ చిత్రాన్నితెలంగాణా ప్రజలు చూడటానికి ఎగబడొచ్చేమో కానీ సీమాంధ్రల్లో ఈ చిత్రాన్ని ఆదరిస్తారో వేచి చూడాలి. note- ఇదొక సున్నితమైన సమస్యతో నిర్మించిన చిత్రం కాబట్టి ఈ చిత్రానికి ఇద్దరు రిపోర్టర్ లు చూసి తమ భావాలను మాత్రమే తెలియబరిచారు.