Read more!

English | Telugu

సినిమా పేరు:గుంటూరు కారం
బ్యానర్:హారిక & హాసిని క్రియేషన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jan 12, 2024

నటీనటులు: మహేష్‌, శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, ఈశ్వరీరావు, జయరామ్‌, రావు రమేష్‌, జగపతిబాబు, సునీల్‌, మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, రవిశంకర్‌, అజయ్‌ఘోష్‌ తదిరులు
సంగీతం: తమన్‌ ఎస్‌.
సినిమాటోగ్రపీ: మనోజ్‌ పరమహంస
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
బ్యానర్‌: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌
విడుదల తేదీ: 12 జనవరి, 2024
సినిమా నిడివి: 159 నిమిషాలు

ఇంతకుముందు త్రివిక్రమ్‌ సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది కుటుంబ సమేతంగా చూడదగ్గ కథ, అందంగా ఉంటూ అందర్నీ నవ్వించే మాటలు. ఒకప్పటి త్రివిక్రమ్‌ సినిమాలు చూస్తే ఇవే కనిపిస్తాయి. అవి రచయితగా చేసిన సినిమాలు కావచ్చు, డైరెక్టర్‌గా చేసిన సినిమాలు కావచ్చు. అతని సినిమాకి వెళితే పూర్తి స్థాయిలో ఎంజాయ్‌ చెయ్యొచ్చు అనే ముద్ర ప్రేక్షకుల్లో పడిపోయింది. అయితే కొంతకాలంగా తన సినిమాలను మళ్ళీ తనే తీస్తూ రిపీట్‌ ఆడియన్స్‌లాగా రిపీట్‌ కథలే అతన్నుంచి వస్తున్నాయి. అత్తారింటికి దారేది నుంచి మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రెగ్యులర్‌గా తన సినిమాలకు పెట్టే టైటిల్‌ కాకుండా కొత్తగా ‘గుంటూరు కారం’ అనే టైటిల్‌తో సినిమా చేశాడు. మహేష్‌ వంటి సూపర్‌స్టార్‌తో ఈ తరహా టైటిల్‌ అంటే ఇది పక్కా మాస్‌ సినిమా అయి వుంటుంది అనిపిస్తుంది. అయితే దానికి ఫ్యామిలీ సెంటిమెంట్‌ని కూడా జోడిరచాడని ట్రైలర్‌ చూసిన తర్వాత అర్థమవుతుంది. అత్తారింటికి దారేది మూడ్‌ నుంచి ఇంకా బయటికి రాని త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ చిత్రం కోసం ఎలాంటి సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకున్నాడు? ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఎలాంటి కొత్త పుంతలు తొక్కాడు? మహేష్‌ని మాస్‌ లుక్‌లో కొత్తగా చూపించడంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ మేర ఆకట్టుకుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఆమె పేరు వసుంధర(రమ్యకృష్ణ), ఆమె భర్త పేరు సత్యం(జయరాం). వాళ్లిద్దరికీ ఓ కొడుకు వెంకటరమణ(మహేష్‌). వ్యాపార పరమైన గొడవల్లో సత్యం ప్రత్యర్థి మార్క్స్‌(జగపతిబాబు) తమ్ముడు లెనిన్‌(సునీల్‌) హత్యకు గురవుతాడు. వాస్తవానికి ఈ హత్య సత్యం బావ(రఘుబాబు) చేసినప్పటికీ కోర్టులో మాత్రం తన భర్తే ఈ హత్య చేశాడని చెబుతుంది వసుంధర. దీంతో సత్యంకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కట్‌ చేస్తే.. భర్త సత్యం, కొడుకు రమణను వదిలేసి వెళ్లిపోతుంది వసుంధర. ఆ తర్వాత నారాయణ(రావు రమేష్‌)ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత రాజకీయంగా స్థిరపడి మంత్రి అవుతుంది వసుంధర. గుంటూరులో ఉన్న రమణ.. తల్లి ప్రేమ కోసం తపిస్తుంటాడు. వసుంధరకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆమె కొడుకు రమణతో సమస్య రాకూడదని భావించిన ఆమె తండ్రి వైరా వెంకటస్వామి(ప్రకాష్‌రాజ్‌) ఓ పథకం వేస్తాడు. ఇకపై వసుంధర కుటుంబంతో రమణకు ఎలాంటి సంబంధం లేదని ఓ పేపర్‌ రాయించి అతనితో సంతకం చేయించాలనుకుంటాడు. అందుకోసం రమణను హైదరాబాద్‌ పిలిపిస్తారు. మరి వెంకటస్వామి కోరుకున్నట్టు రమణ ఆ పేపర్ల మీద సంతకం పెట్టాడా? తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉన్న రమణ ఈ విషయం తెలుసుకొని ఎలా ఫీల్‌ అయ్యాడు? రమణతో సంతకం పెట్టించడానికి వెంకటస్వామి పడిన తిప్పలు ఎలాంటివి? తల్లికి దూరమైన రమణ మళ్ళీ ఆమె దగ్గరకు చేరుకున్నాడా? అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

హీరోలు మారినా, బ్యాక్‌డ్రాప్‌ మారినా, కథనం మారినా, కథ మాత్రం అదే ఉంటుంది. ఈమధ్యకాలంలో త్రివిక్రమ్‌ సినిమాల్లో కనిపిస్తున్నది ఇదే. అత్తారింటికి దారేది సినిమా అతని మనసులో బలంగా నాటుకుపోయి ఉంటుంది. ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ, మరెన్నో అవరోధాల్ని తొలగించుకుంటూ సినిమా ఎండిరగ్‌లో హీరో అత్త ఇంటికో, అమ్మ ఇంటికో చేరుకుంటాడు. గుంటూరు కారం కాన్సెప్ట్‌ కూడా అదే. ఈ పాయింట్‌తో రెండున్నర గంటల సినిమా చెయ్యాలంటే కథతో సంబంధం ఉన్నా లేకపోయినా మరెన్నో సీన్స్‌ను కలిపి బాగా వండాలి. అలా వండిన సినిమాయే ఇది. మన సినిమాల్లో భార్యాభర్తలు విడిపోయి పాతిక సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. కొడుకుతో తెగతెంపులు చేసుకునేందుకు పాతికేళ్ళ తర్వాతే ముహూర్తం బాగున్నట్టు హీరో పెద్దవాడైన తర్వాతే అసలు కథ మొదలు పెడతారు. సినిమా ప్రథమార్థం మొత్తం రమణతో సంతకం చేయించడానికి వెంకటస్వామి పడే తిప్పలతోనే గడిచిపోతుంది. సెకండాఫ్‌లో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఇక చివరి అరగంట అసలు కొడుకు రమణను తల్లి వసుంధర వదిలి వెళ్లిపోయింది అనేది అంచెలంచెలుగా రివీల్‌ చేసుకుంటూ వస్తారు. సినిమా చూస్తున్నంత సేపూ ఫలానా సీన్‌ మనం ఇంతకుముందు సినిమాలో చూశాం కదా అని ఆడియన్స్‌కి అనిపిస్తుంంటుది. ఒక దశలో మనం చూసిన సినిమానే మళ్లీ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ కూడా కలుగుతుంది. త్రివిక్రమ్‌ మాటల గురించి ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాకి పెద్ద ప్లస్‌ అని చెప్పుకోదగ్గ అంశాలు ఏవైనా వున్నాయి అంటే అది మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌, శ్రీలీల డాన్స్‌, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్‌.. ఇవి తప్ప ఇది త్రివిక్రమ్‌ అని చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. 

నటీనటులు :

మహేష్‌ గెటప్‌, లుక్‌, పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగున్నాయి. డాన్సులు, ఫైట్స్‌లో అద్భుతంగా రాణించాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో కొత్తగా కనిపించాడు. సినిమాలోని ఎక్కువ భాగం మహేషే కనిపించడం ఈ సినిమాలో విశేషం. ఇక హీరోయిన్‌ శ్రీలీల గురించి చెప్పాలంటే.. క్యారెక్టర్‌ పరంగా ఆమె గురించి చెప్పుకోవడానికి విశేషాలేవీ లేనప్పటికీ డాన్సుల్లో మాత్రం ఇరగదీసేసింది. రమ్యకృష్ణ తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది, ఎంతో హుందాగా కనిపించింది. ప్రకాష్‌రాజ్‌ చేసిన వెంకటస్వామి క్యారెక్టర్‌ రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్‌, రఘుబాబు, మీనాక్షి చౌదరి వంటి నటీనటులకు ఏమాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్స్‌ ఇచ్చాడు త్రివిక్రమ్‌.

సాంకేతిక నిపుణులు: 

ఈ సినిమాకి సాంకేతిక పరంగా ప్లస్‌ అయిన అంశాలు మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ప్రొడక్షన్‌ వేల్యూస్‌, నవీన్‌ నూలి ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఇక త్రివిక్రమ్‌ గురించి చెప్పాలంటే అతని గత సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో పదునైన డైలాగులు, కామెడీ పంచ్‌లు ఈ సినిమాలో కనిపించవు. అలాగే కథ, కథనాల విషయంలో త్రివిక్రమ్‌ జాగ్రత్తలు తీసుకోలేదని, కేవలం హీరోపైనే సినిమా భారాన్ని మోపాడని అర్థమవుతుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ పెద్ద మైనస్‌ అని చెప్పాలి. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

‘గుంటూరు కారం’ అనే చిత్రాన్ని కేవలం మహేష్‌ కోసం చూడొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక ప్లస్‌ మహేష్‌ కాబట్టి. ఇప్పటివరకు మహేష్‌ చేయని ఒక మాస్‌ క్యారెక్టర్‌ ఇది. తన పెర్‌ఫార్మెన్స్‌తో అభిమానుల్ని ఖుషీ చేస్తాడు. అలాగే శ్రీలీల కూడా తన డాన్సుతో ప్రేక్షకులకు హుషారు పుట్టించింది. సినిమా కథ, కథనాల విషయానికి వస్తే అందులో విషయం లేదు, బిల్డప్‌ ఎక్కువ అని సినిమా చూస్తున్నంత సేపు ఫీల్‌ అయ్యే అంశమే. ఒక పాత కథతోనే మళ్ళీ సినిమా తీసి హిట్‌ కొట్టాలనుకున్న త్రివిక్రమ్‌ పాచిక ఈసారి పారలేదనే చెప్పాలి.                                                                                        

- జి.హరా