English | Telugu
బ్యానర్:కార్తీక్ కల్ట్ క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 8, 2024
నటీనటులు: విశ్వక్‌సేన్, చాందిని చౌదరి, అభినయ, మయాంక్ పరాక్, మహ్మద్ సమద్, రజనీష్, హారిక పెద్ద తదితరులు
సంగీతం: స్వీకార్ అగస్తీ, నరేష్ కుమారన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: నరేష్ కుమారన్
సినిమాటోగ్రఫీ: సి.విశ్వనాథరెడ్డి
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
నిర్మాత: కార్తీక్ శబరీష్
బ్యానర్స్: కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్
రచన, దర్శకత్వం: విద్యాధర్ కాగిత
విడుదల తేదీ: 08.03.2024
సినిమా నిడివి: 146.46 నిమిషాలు
సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు, విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంది, డైరెక్టర్ టేకింగ్ అద్భుతంగా ఉంది, రేర్ లొకేషన్స్‌లో యూనిట్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశారు.. ఒక సినిమాకి ఇవి వుంటే సరిపోతాయా అంటే.. సరిపోవనే చెప్పాలి. వీటన్నింటినీ మించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథ, కథనాలు ఉండాలి. వాటిని ఆడియన్స్‌కి కనెక్ట్ చెయ్యగలగాలి. కథలో ప్రేక్షకులు ఇన్‌వాల్వ్ అయిపోవాలి. ఇవన్నీ కుదిరినపుడే ఆ సినిమాకి ఒక లుక్ వస్తుంది. సినిమాకి ప్లస్ అయ్యే అంశాలు ఎన్ని ఉన్నా.. అన్నింటితో ఆడియన్స్‌ని ఎంగేజ్ చెయ్యగలిగే టాలెంట్ డైరెక్టర్‌లో ఉండాలి. పైన చెప్పుకున్న టెక్నికల్ అంశాలు తప్ప విశేషంగా చెప్పుకోదగ్గది ఏదీ లేని సినిమా ‘గామి’. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య శుక్రవారం రిలీజ్ అయింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమాకి చాలా హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. దానికి తోడు రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్ కూడా ‘గామి’ టీమ్‌ని అప్రిషియేట్ చేశాడు. దాంతో యూనిట్ కోరుకున్న హైప్ రానే వచ్చింది. మరి థియేటర్లలో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సినిమాకి ఉన్న ప్లస్‌లు ఏమిటి, మైనస్‌లు ఏమిటి? ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ :-
ఓపెన్ చేస్తే అఘోరాలు ఉండే ఒక ప్రదేశం.. అక్కడ శంకర్(విశ్వక్ సేన్) అనే వ్యక్తిని అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే.. అతను ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాడు. అతనికి మరో మనిషి శరీరం తాకితే.. అతని శరీరంలో భయంకరమైన మార్పులు వస్తుంటాయి. అది భరించలేని మిగతా అఘోరాలు అతనిపై దాడి చేస్తారు. కొన్ని పరిణామాల తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు శంకర్. కేదార్ బాబా తనను రక్షిస్తాడన్న ఉద్దేశంతో ఆయన్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ, ఆయన చనిపోయాడని అతని శిష్యుడు చెబుతాడు. శంకర్ వస్తాడని ముందే ఊహించిన కేదార్‌బాబా అతనికి ఇవ్వవలసిందిగా ఒక వస్తువును ఇస్తాడు. శంకర్‌కి ఉన్న సమస్య ముందే తెలిసిన ఆ శిష్యుడు.. హిమాలయాల్లో ఉన్న మాలిపత్రాలను తాకడం వల్ల అతని సమస్య తీరుతుందని చెబుతాడు. అయితే అక్కడికి వెళ్లి వాటిని సాధించడం అంత సులువు కాదని కూడా చెబుతాడు. అయినా శంకర్ బయల్దేరతాడు. అతనికి తోడుగా జాహ్నవి(చాందిని చౌదరి) కూడా వెళుతుంది. కట్ చేస్తే.. ఒక మెడికల్ రీసెర్చ్ సెంటర్.. మనుషుల మెదడుపై అధ్యయనం చేసేందుకు ఎంతో మందిని అక్కడ బందీలుగా ఉంచుతారు. పరిశోధన పేరుతో వారిని రకరకాలుగా హింసిస్తుంటారు. అక్కడ ఓ కుర్రాడు అలాంటి బాధలు పడుతూ ఉంటాడు. అవకాశం దొరికితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే.. అది ఓ పల్లెటూరు. సంప్రదాయాలకు పుట్టిల్లులా ఉండే ఆ ఊరిలో దేవదాసి వ్యవస్థ కొనసాగుతోంది. దుర్గ(అభినయ) అనే అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను దేవదాసిగా మార్చేస్తారు. ఆమెకు ఓ వ్యాధి ఉంటుంది. దాని వల్ల ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెప్పేస్తారు. దీంతో ఆమెను దేవదాసిగా తొలగిస్తారు. ఆమె చిన్నతనంలోనే వదిలేసిన తన కూతురి దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఊరిలో దేవదాసి లేకపోవడంతో ఆ ఊరి సర్పంచ్ తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి మళ్ళీ దుర్గ ఉండే ఊరికి వస్తాడు. ఈసారి దుర్గ కూతురు ఉమ(హారిక పెద్ద)ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో దుర్గ ప్రాణాలు కోల్పోతుంది. ఉమ తప్పించుకుంటుంది. ఇవి.. మూడు విభిన్నమైన కథలు. ఈ కథలతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు, వీటితో ఆడియన్స్‌ని ఎలా కనెక్ట్ చేద్దామనుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎనాలసిస్ :
మొదట చెప్పుకున్నట్టు ఒక విజువల్ వండర్‌కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. లేనిదల్లా ప్రేక్షకుల్ని కట్టి పడేసే కథ, కథనాలు. మూడు కథలను మొదటి నుంచి చివరి వరకు ఒక డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో రన్ చెయ్యాలని చూశాడు డైరెక్టర్. అది అప్రిషియేట్ చెయ్యాల్సిన అంశమే. అయితే ఈ మూడు కథల్లో ఎంచుకున్న టాపిక్ ఏమిటి అనేది కూడా ఇంపార్టెంటే. ఒక మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో కొన్ని దారుణాలు జరుగుతుంటాయి. దానికి సంబంధించిన విజువల్స్‌గానీ, వాళ్ళు చెప్పే డైలాగ్స్‌గానీ సాధారణ ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ అర్థం కావు. అలాంటప్పుడు ఆ ఎపిసోడ్ వల్ల ఏమిటి ఉపయోగం. దేవదాసి కథ వరకు ఓకే. అది అందరికీ అర్థమయ్యేదే. ఆడియన్స్ కూడా ఆ కథకి కనెక్ట్ అవుతారు. ఇక శంకర్ అఘోరాగా స్టార్ట్ అయిన ఎపిసోడ్‌కి సంబంధించిన సన్నివేశాలు మధ్యమధ్యలో వస్తుంటాయి. అయితే ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు. ఈ ఎపిసోడ్ సినిమా మొదటి నుంచి చివరి వరకు అలాగే కొనసాగుతుంది. ఏ మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యని ఎపిసోడ్ ఇది. ఇవన్నీ పక్కన పెడితే దర్శకుడితోపాటు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, మేకర్స్ అందరూ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎఫర్ట్స్ పెట్టారు. అందులో ఎలాంటి వంకా పెట్టడానికి లేదు. అంత చేసినా అది ఆడియన్స్‌కి కరెక్ట్‌గా రీచ్ అవ్వనప్పుడు వారి శ్రమ వృధానే అవుతుంది తప్ప ఎవరికీ ప్రయోజనం లేదు.
నటీనటులు :-
ఈ సినిమాలో ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత లేదు. ప్రతి క్యారెక్టర్ చాలా సెటిల్డ్‌గానే ఉంటుంది తప్ప ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చెయ్యాల్సిన అవసరం ఏ క్యారెక్టర్‌కీ లేదు. దేవదాసి దుర్గగా నటించిన అభినయ, ఆమె కుమార్తె ఉమగా నటించిన హారికలకు మాత్రమే కాస్తో కూస్తో పెర్‌ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక హీరోగా నటించిన విశ్వక్‌సేన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతనికి పెర్‌ఫార్మ్ చేసే అవకాశమే లేదు. అంతే కాదు పట్టుమని నాలుగు డైలాగులు కూడా అతనికి లేవు. అయినా అతని ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ ఎక్కడా మనల్ని ఇంప్రెస్ చెయ్యవు. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్‌ని ఒక నోటెడ్ హీరో కాదు, ఎవరు చేసినా అలాగే ఉంటుంది. ఇక చాందిని చౌదరి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఆమె క్యారెక్టర్‌కి ఒక పర్పస్ అంటూ ఉండదు. హీరో పక్కన ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అని పెట్టినట్టు ఉంటుంది తప్ప ఏమాత్రం గుర్తింపు లేని క్యారెక్టర్ ఆమెది.
సాంకేతిక నిపుణులు :-
ఈ సినిమా ప్రధాన బలం సాంకేతిక నిపుణులే. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది సి.విశ్వనాథరెడ్డి సినిమాటోగ్రఫీ గురించి. చాలా అద్భుతమైన విజువల్స్‌ని క్యాప్చర్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా ట్రాక్ తప్పకుండా ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అలాంటి విజువల్స్‌కి ప్రాణం పోసింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. నరేష్ కుమారన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో గ్రాండ్‌గా, మరెంతో ఎఫెక్టివ్‌గా ఉంది. ఒకవిధంగా రెండున్నర గంటల సినిమాని తన మ్యూజిక్‌తో ముందుకు నడిపించాడని చెప్పాలి. ఇక రాఘవేంద్ర చేసిన ఎడిటింగ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఎక్కువ సేపు ఉండడం, రిపీటెడ్ సీన్స్‌లా కొన్ని కనిపించడం వంటివి సినిమా ల్యాగ్ అయిందనే ఫీలింగ్‌ని కలిగించాయి. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. కథ, కథనాలు, బ్యాక్‌డ్రాప్, ఎలిమెంట్స్.. ఇలా అన్నీ తన మనసుకు నచ్చిన విధంగా చేసుకున్నాడు తప్ప ఇవి ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి? ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఎంతవరకు అర్థం చేసుకోగలరు? అనే విషయాలను విస్మరించాడు. డైరెక్టర్ గురించి ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఇక మేకర్స్ విషయానికి వస్తే.. డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్‌ని టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఎంతో గ్రాండ్‌గా సినిమాను నిర్మించారు. హిమాలయాల్లోని రేర్ లొకేషన్స్‌లో చేసిన కొన్ని సీన్స్ చూస్తే యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడి పనిచేశారో అర్థమవుతుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
‘గామి’ ఒక విజువల్ ట్రీట్.. అంతే. అంతకుమించి ఏమీ ఆశించకుండా ఈ సినిమా చూడొచ్చు. చక్కని విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, థ్రిల్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అబ్బుర పరిచే లొకేషన్స్ చూడాలంటే ‘గామి’ చిత్రాన్ని ప్రిఫర్ చెయ్యొచ్చు. కథ గురించి, లాజిక్‌ల గురించి ఆలోచించకుండా రెండున్నర గంటల సేపు విజువల్‌గా సినిమాని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు.