Read more!

English | Telugu

సినిమా పేరు:భ్రమయుగం
బ్యానర్:నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌, వైనాట్‌ స్టూడియోస్‌
Rating:2.50
విడుదలయిన తేది:Feb 23, 2024

నటీనటులు: మమ్ముట్టి, అర్జున్‌ అశోక్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, మణికందన్‌ ఆర్‌.ఆచారి, అమల్దా లిజ్‌
సంగీతం: క్రిస్టో జేవియర్‌
సినిమాటోగ్రఫీ: షహనాద్‌ జలాల్‌
ఎడిటింగ్‌: షఫీక్‌ మహమ్మద్‌ అలీ
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌
బ్యానర్స్‌: నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌, వైనాట్‌ స్టూడియోస్‌
రచన, దర్శకత్వం: రాహుల్‌ సదాశివన్‌
విడుదల తేదీ: 23-02-2024
సినిమా నిడివి: 139.42 నిమిషాలు

ప్రయోగాత్మక సినిమాలు చెయ్యడంలో, సహజత్వానికి అతి దగ్గరగా ఉండే కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో మలయాళీలదే పైచేయి. ఇది కొన్ని దశాబ్దాలుగా ప్రూవ్‌ అవుతున్న నిజం. దర్శకుల ఆలోచనలను గౌరవించే నటీనటులు అక్కడ ఉన్నారు. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చెయ్యడానికి అక్కడి టాప్‌ హీరోలు సైతం వెనుకాడరు. అలాంటి ఓ విభిన్నమైన, వినూత్నమైన కథాంశంతో రూపొందిన సినిమా మలయాళంలో ఇటీవల రిలీజ్‌ అయింది. దాన్నే ఇప్పుడు తెలుగులోకి అనువదించి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఆ సినిమా పేరు ‘భ్రమయుగం’. టైటిల్‌లోనే కొత్తదనాన్ని చూపించిన దర్శకుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం విభిన్నంగా ఉండాలని ఆలోచించాడు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూడని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సినిమాని రూపొందించాడు. అతి తక్కువ నటీనటులతో 2 గంటల 20 నిమిషాలు ప్రేక్షకుల్ని థియేటర్‌లో కూర్చోబెట్టే కంటెంట్‌తో ఈ సినిమాను చేశాడు. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. మరి తెలుగు వెర్షన్‌ ఇక్కడి ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంది? మమ్ముట్టి, దర్శకనిర్మాతలు చేసిన ఈ కొత్త ప్రయోగం ఏమేర సక్సెస్‌ అయ్యింది అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :-
17వ శతాబ్దంలో దక్షిణ మలబార్‌లో జరగిన కథగా సినిమా ఆరంభంలోనే మెన్షన్‌ చేశారు. తేవన్‌(అర్జున్‌ అశోక్‌), కొరాన్‌(మణికందన్‌ ఆర్‌.ఆచారి) పోర్చుగీస్‌ నుంచి తప్పించుకొని వచ్చిన బానిసలు. తూర్పువైపుకు తమ ప్రయాణం మొదలుపెడతారు. రాత్రి కావడంతో భరతపుళ నది ఒడ్డున వారిద్దరూ విడిది చేస్తారు, అదే సమయంలో యక్షి(అమల్దా లిజ్‌) అనే ఓ మాయాలేడీ వలలో పడి కొరాన్‌ చనిపోతాడు. అక్కడి నుంచి పారిపోయిన తేవన్‌ ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఆ నది దాటితే తన గమ్యం చేరుకోవచ్చు, తన తల్లిని కలుసుకోవచ్చు. కానీ, ఆ నదిని దాటడం సాధ్యమయ్యే పనికాదు. దాంతో అడవిలో మరో మార్గంలోకి వెళతాడు. అక్కడ ఒక పాడుబడిన భవనాన్ని గుర్తిస్తాడు. ఆకలితో ఉన్న తేవన్‌ అక్కడే ఉన్న కొబ్బరికాయను దొంగిలిస్తున్నప్పుడు ఆ ఇంటి వంటవాడు అతన్ని ప్రశ్నిస్తాడు. ఆ సమయంలోనే అతన్ని ఆ ఇంటి యజమాని కొడుమోన్‌ పొట్టి ముందు నిలబెడతాడు ఆ వంటవాడు. తను ఓ రాజ్యంలో గాయకుడినని, అక్కడ యుద్ధ వాతావరణం ఉండడంతో పారిపోయి వచ్చానని చెబుతాడు తేవన్‌. అప్పుడు కుడుమోన్‌ పొట్టి అతన్ని ఓ పాట పాడమంటాడు. పాట విన్న కొడుమోన్‌ ఎంతకాలమైనా ఇక్కడే ఉండొచ్చని చెబుతాడు. అయితే తను వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పడంతో తనతో పాచికలు ఆడి గెలిచి వెళ్ళమంటాడు కొడుమోన్‌.  పాచికల ఆటలో తేవన్‌ ఓడిపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. పాడుబటిన భవనం, చిత్ర విచిత్రంగా ఉండే వస్తువులు, సమయం, సందర్భం లేకుండా వినిపించే విచిత్రమైన ధ్వనులు తేవన్‌ను ఇబ్బంది పెడతాయి. తర్వాత కొన్ని రోజులకు అతను కొడుమోన్‌ పొట్టి కాదని, అతని వేషంలో ఉన్న చాతాన్‌ అనే రాక్షసుడని వంటవాడి ద్వారా తెలుసుకుంటాడు తేవన్‌. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్నీ విఫలమవుతాయి. చాతాన్‌ని దెబ్బ తీసేందుకు వంటవాడు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. చాతాన్‌ అనే రాక్షసుడు కొడుమోన్‌ పొట్టి వేషంలో ఎందుకున్నాడు? కొడుమోన్‌ పొట్టి ఏమయ్యాడు? వంటవాడు అవకాశం కోసం ఎందుకు ఎదురుచూస్తున్నాడు? తేవన్‌ చివరికి అక్కడి నుంచి తప్పించుకోగలిగాడా? అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

ఈ సినిమా గురించి ఒక కథగా చెప్పుకోవాలంటే సాధారణమైన కథే. అయితే దాన్ని అల్లుకున్న విధానంలో వైవిధ్యం చూపించాడు దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌. ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్‌, ఒక మామూలు కథని తీసుకొని దాన్ని అందంగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఈ తరహా సినిమాలు కొన్ని మన మదిలో మెదులుతాయి. ఒక సాధారణమైన కథను తీసుకొని దానికి చక్కని ఫోటోగ్రఫీ, మంచి ఎడిటింగ్‌, కథను, కథలోని పాత్రలను చాలా హైలైట్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, దానికి తగ్గట్టుగానే ఉన్న సౌండ్‌ డిజైన్‌.. అన్నింటినీ మించి ఆర్ట్‌ డైరెక్షన్‌. ఈ సినిమా కోసం 100కు 200 శాతం ఆర్ట్‌ డైరెక్టర్‌ పెట్టిన ఎఫర్ట్‌ ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుంది. దర్శకుడు టెక్నికల్‌ విషయాలపై పూర్తి శ్రద్ద పెట్టాడు. కథ, కథనం కంటే మిగతా టెక్నికల్‌ యాస్పెక్ట్సే సినిమాని ముందుకు నడిపించాయి. సినిమాలో ఎక్కువ భాగం కనిపించే ముగ్గురు నటులతో సినిమా చెయ్యడం, ఈరోజుల్లో ఎవ్వరూ సాహసం చేయని విధంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించడం అనేది మామూలు విషయం కాదు. 

నటీనటులు : -

కొడుమోన్‌ పొట్టిగా నటించిన మమ్ముట్టి పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ క్యారెక్టర్‌నైనా పండిరచగల సత్తా మమ్ముట్టికి వుంది. ఇందులో మమ్ముట్టి చేసిన క్యారెక్టర్‌ చాలా డీగ్లామర్‌గా ఉంటుంది. అయినా వెనుకాడకుండా 100 పర్సెంట్‌ పెర్‌ఫార్మ్‌ చేసేందుకు కృషి చేసి సక్సెస్‌ అయ్యాడు. ఇక తేవన్‌గా అర్జున్‌ అశోక్‌, వంటవాడిగా సిదార్థ్‌ భరతన్‌ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. 

సాంకేతిక నిపుణులు : -

ఈ సినిమా కథ, కథనాల కంటే టెక్నికల్‌గా చాలా హైలైట్‌ అవుతుంది. షహనాద్‌ జలాల్‌ అందించిన ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అయినా ఆ ఫీల్‌ అనేది ఆడియన్స్‌కి రాకుండా ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు. దానికి తగ్గట్టుగానే షఫీక్‌ మహమ్మద్‌ అలీ ఎడిటింగ్‌ కూడా బాగా చేశాడు. అయితే ఫస్ట్‌హాఫ్‌ కంటే సెకండాఫ్‌ కాస్త స్లో అనిపించింది. కథనానికి ఉపయోగపడని కొన్ని సీన్స్‌ వల్ల సినిమా స్లోగా అనిపిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్‌ డైరెక్షన్‌ గురించి 17వ శతాబ్దపు వాతావరణం, అప్పటి వస్తువులు, అడవి మధ్యలో ఒక పాడుబడిన భవనం.. ఇలా వీటన్నింటినీ సెట్‌ చేయడం మామూలు విషయం కాదు. సినిమాలో కనిపించే ప్రతి చిన్న వస్తువుని కూడా ఎంతో జాగ్రత్తగా రూపొందించారు ఆర్ట్‌ డైరెక్టర్‌ జోతిష్‌ శంకర్‌. ఇక మ్యూజిక్‌ డైరెక్టర్‌ క్రిస్టో జేవియర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాకి అంతటి ఎలివేషన్‌ వచ్చింది అంటే అది కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్లే. ప్రతి సీన్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తన ప్రతిభను చూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రాణం పోసింది. అలాగే సౌండ్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకి ఉన్న మరో పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఆడియన్స్‌కి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది సౌండ్‌ ఎఫెక్ట్స్‌. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సినిమా బాగా తీశారు, మమ్ముట్టి పెర్‌ఫార్మెన్స్‌ అదిరిపోయింది. టెక్నికల్‌గా కూడా సినిమాకి మంచి అప్రిషియేషన్‌ ఉంది. అయినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం లేదు. ఇది కేవలం ఒక అవార్డు సినిమాలా ఉంది తప్ప సాధారణ ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఈ సినిమాలో లేవు. ఈ సినిమాను థియేటర్లలో కంటే ఓటీటీలో చూసేందుకు ఇష్టపడతారు. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకి అనేక విభాగాల్లో అవార్డులు వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్‌గా ఎంత వస్తుంది అనేది ఆలోచించకుండా  రాహుల్‌ సదాశివన్‌ చేసిన ప్రయత్నానికి మద్దతు పలికి ఓ విభిన్నమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలను అభినందించకుండా ఉండలేం.

- జి.హరా