Read more!

English | Telugu

సినిమా పేరు:అన్నపూర్ణ ఫొటో స్టూడియో
బ్యానర్:బిగ్ బెన్ సినిమాస్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 21, 2023

సినిమా పేరు: అన్నపూర్ణ ఫొటో స్టూడియో
తారాగణం: చైతన్య రావు, లావణ్య సాహుకార, లలిత్ ఆదిత్య, వైవా రాఘవ, ఉత్తరా రెడ్డి, మిహిర గురుపాదప్ప, యష్ రంగినేని, వాసు ఇంటూరి, కృష్ణ మోహన్ 
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రాఫర్: పంకజ్
ఎడిటర్: వెంకట ప్రభు
రచన, దర్శకత్వం: చందు ముద్దు
నిర్మాత: యష్ రంగినేని
బ్యానర్: బిగ్ బెన్ సినిమాస్
విడుదల తేదీ: జూలై 21, 2023 

ఈమధ్య కాలంలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమాలలో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' ఒకటి. ఈ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న చైతన్య రావు ఇందులో హీరోగా నటించగా, 'ఓ పిట్ట కథ' ఫేమ్ చందు ముద్దు దర్శకత్వం వహించాడు. 'పెళ్ళి చూపులు' చిత్రంతో నిర్మాతగా మారిన యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, కీలక పాత్రలో నటించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలా ఉందా?...

కథ:
చంటి(చైతన్య రావు) ఊళ్ళో తన స్నేహితుడితో కలిసి ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. తన తోటి వాళ్లంతా పెళ్ళిళ్ళు చేసుకుని, వాళ్ల పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. కానీ చంటి మాత్రం 40 ఏళ్లు దాటినా తనకంటే చిన్న వాళ్ళతో స్నేహం చేస్తూ సరదాగా తిరుగుతుంటాడు. చంటి తండ్రి జాతకాలు చూడటంలో దిట్ట. ఆ జాతకాల కారణంగానే చంటి పెళ్లి ఆలస్యమవుతుంది. అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చి, తన చెల్లెలితో పాటు కాలేజ్ లో చదువుతున్న గౌతమి(లావణ్య సాహుకార)తో చంటి లేట్ వయసులో ప్రేమలో పడతాడు. తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన చంటి ప్రేమని గౌతమి అంగీకరించిందా? వీరి ప్రేమ కథకి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా చంటి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఫొటో స్టూడియో నడుపుకునే చంటి, ఫొటోలు చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంతో సౌమ్యుడైన చంటి ఏకంగా ఒకరిని హత్య చేయాలని నిర్ణయించుకోవడానికి దానితీసిన పరిస్థితులేంటి? అనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఇది గోదావరి ప్రాంతంలో 1980-90 సమయంలో జరిగే కథగా చూపించారు. గోదావరి అందాలు, హాస్యంతో పెద్ద వంశీ సినిమాలను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంది. అయితే హాస్యం మాత్రం ఆ స్థాయిలో పండలేదు. హీరో ఆత్మహత్యాయత్నంతో దర్శకుడు సినిమాని ఎంతో ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ కి కొత్త ఎస్ఐ రాగా, ఇక్కడ అప్పుడప్పుడు ఆత్మహత్య కేసులు తప్ప, అసలు ఎలాంటి క్రైమ్ లు జరగవని కానిస్టేబుల్స్ చెప్తారు. అలా చెప్పిన కాసేపటికే హీరో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా, సరిగ్గా వచ్చి పోలీస్ జీపు మీద పడి ఆసుపత్రిపాలవుతాడు. హీరో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ నోట్ ని చదివి అతని కథ తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు పోలీసులు. ఈ క్రమంలో చంటి(చైతన్య రావు) పరిచయ సన్నివేశాలు అలరిస్తాయి. ముఖ్యంగా అతని వయస్సు మీద, పెళ్లి మీద వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే మిగతా సన్నివేశాల్లో మాత్రం కామెడీ అంతగా పండలేదు. వైవా రాఘవ పోషించిన పండు పాత్రతో కొంతవరకు హాస్యం పండించే ప్రయత్నం చేసిన దర్శకుడు, మిగతా స్నేహితుల పాత్రలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు దర్శకుడే అందించాడు. పేపర్ మీద రాసుకున్నప్పుడు అతనికి అన్ని కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పించి ఉండవచ్చు. కానీ తెర మీదకు వచ్చేసరికి చాలావరకు తేలిపోయాయి.

ప్రథమార్థంలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలను మాత్రం దర్శకుడు సహజంగా బాగానే రాసుకున్నాడు. ప్రథమార్థంలో హీరో పాత్ర ప్రవర్తన అక్కడక్కడా కాస్త గందరగోళంగా అనిపించినా, అది కథనంలో మెలిక అనే విషయాన్ని ద్వితీయార్థంలో రివీల్ చేశాడు దర్శకుడు. ఆ గందరగోళానికి కారణాన్ని చూపుతూ, కథనంలోని మెలికను రివీల్ చేసిన విధానం కాస్త కొత్తగా బాగుంది. అసలు హీరో ఆత్మహత్యాయత్నానికి కారణమేంటనే ఆసక్తిని కొనసాగిస్తూ ప్రథమార్ధాన్ని నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ ఎపిసోడ్ ని కూడా ఆసక్తికరంగానే రాసుకున్నాడు. ద్వితీయార్థంలో హీరో ఒకరిని కాపాడబోయి క్రైమ్ లో ఇరుక్కోవడం, దాని నుంచి బయటపడాలంటే మరో క్రైమ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కాస్త ఉత్కంఠగానే సాగింది. హీరో పెళ్లి ఆలస్యానికి అసలైన కారణం రివీల్ చేయడంతో పాటు, సినిమాని ముగించిన తీరు బాగుంది. 

దర్శకుడు రాసుకున్న కథాకథనాలు బాగానే ఉన్నప్పటికీ.. సన్నివేశాలు, సంభాషణల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది అనిపించింది. ప్రథమార్థంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆశించిన స్థాయిలో వినోదాన్ని పంచలేకపోయాయి. డైలాగ్ కామెడీ తేలిపోయింది. సంభాషణల్లో గోదావరి వెటకారం పూర్తిస్థాయిలో కనిపించలేదు. 1980-90 సమయంలో జరిగే కథ అయినప్పటికీ ఇంగ్లీష్ పదాలు దొర్లుతూ ఇప్పటి సంభాషణల్లాగే అనిపించాయి. హీరోయిన్ ని చూసిన ప్రతిసారి హీరో రంగమ్మ సాంగ్ వేసుకోవడం ఒకట్రెండు సార్లు బాగుంది అనిపించినప్పటికీ, పదే పదే రిపీట్ చేయడం విసిగించింది. అలాగే పోలీసులు హీరో కథని చదువుతున్నట్టుగా చూపించిన దర్శకుడు.. వారిని అవసరమైన దానికంటే ఎక్కువసార్లు చూపించి కాస్త విసిగించాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని, సంభాషణలు, హాస్యం మీద మరింత దృష్టి పెట్టుంటే.. సినిమా ఇంకా చాలా బెటర్ గా ఉండేది.

ప్రిన్స్ హెన్రీ సంగీతం ఆకట్టుకుంది. సినిమాకి అవసరమైన స్థాయిలో పాటలు, నేపథ్య సంగీతంతో తన వంతు న్యాయం చేశాడు. పంకజ్ సినిమాటోగ్రఫీ మెప్పించింది. లొకేషన్ల లోని అందాలను, నటీనటుల హావభావాలను తన కెమెరాలో చక్కగా బంధించి సినిమాకి అవసరమైన కలర్ ఫుల్ నెస్ ని తీసుకొచ్చాడు. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా ఎడిటర్ వెంకట ప్రభు సినిమాని నీట్ గా ప్రజెంట్ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

40 ఏళ్లు దాటిన పెళ్లికాని ప్రసాద్ లాంటి చంటి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. అతని హావభావాలు మెప్పించాయి. చంటి మనసు పారేసుకున్న కాలేజీ అమ్మాయి గౌతమి పాత్రలో లావణ్య సాహుకార చక్కగా రాణించింది. ఆహార్యంలోనే కాదు నటనలోనూ సహజత్వం ప్రదర్శించింది. చైతన్య రావు స్నేహితుల పాత్రల్లో లలిత్ ఆదిత్య, వైవా రాఘవ, చెల్లి పాత్రలో ఉత్తరా రెడ్డి, నెగటివ్ ఛాయలున్న పాత్రలో యష్ రంగినేని, పోలీసులుగా వాసు ఇంటూరి, కృష్ణ మోహన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

గోదావరి నేపథ్యంలో వంశీ సినిమాలను గుర్తు చేసేలా ఉన్న ఈ సినిమా కథాకథనాలు బాగానే ఉన్నప్పటికీ హాస్యం ఆశించిన స్థాయిలో పండలేదు. హాస్య ప్రధానంగా రాసుకున్న చాలా సన్నివేశాలు, సంభాషణలు తేలిపోయాయి. పల్లె వాతావరణంలో చిన్న మలుపులతో ఆహ్లాదకరంగా సాగే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రచార చిత్రాలను చూసి అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం కాస్త నిరాశ చెందే అవకాశముంది.

-గంగసాని