Read more!

English | Telugu

సినిమా పేరు:ఆదిపురుష్
బ్యానర్:టి సిరీస్, రెట్రోఫిల్స్, యువి క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 16, 2023

సినిమా పేరు: ఆదిపురుష్
తారాగణం: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ్‌దత్ నాగే, వత్సల్ సేఠ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడ్‌మల్
మాటలు: భీమ శ్రీనివాస్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: అజయ్-అతుల్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: ఆశిష్ మాత్రే, అపూర్వ మోతివాలే
ఆర్ట్: సాగర్ మాలి
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్
భానర్స్: టి సిరీస్, రెట్రోఫిల్స్, యువి క్రియేషన్స్
విడుదల తేదీ: 16 జూన్ 2023

రామాయణ గాథ ఆధారంగా తెలుగులోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో ఎన్నో సినిమాలు గతంలో వచ్చాయి. దూరదర్శన్‌లో వచ్చిన 'రామాయణం' ధారావాహిక భాషలకు అతీతంగా దేశంలోని ప్రజానీకాన్ని అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే కథతో శ్రీరాముని పాత్రలో ప్రభాస్‌ని చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడనీ, దాన్ని టి సిరీస్ నిర్మిస్తోందనీ తెలిసినప్పుడు దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆత్రుతగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఎన్నడో 2021లోనే షూటింగ్ జరిగినా ఇన్నాళ్లకు మనముందుకు వచ్చిన ఆ సినిమా ఎలా ఉందంటే... 

కథ

సీతారామ లక్ష్మణులు (కృతి సనన్, ప్రభాస్, సన్నీ సింగ్) వనవాసంలో ఉండగా, రాముని మోహించిన శూర్పణఖ అనే స్త్రీ, లక్ష్మణుని ద్వారా ముక్కు తెగ్గోయించుకొని పరాభవానికి గురై, తన అన్న లంకాధీశుడైన రావణుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకొని, అతిలోక సుందరి అయిన జానకిని లంకకు మహారాణిని చేస్తే చూడాలని ఉందంటుంది. రాముడు లేని సమయంలో సన్యాసి రూపంలో వెళ్లి జానకిని అపహరించుకొని లంకకు తీసుకువెళ్లిన రావణుడు.. ఆమెను అశోకవనంలో ఉంచుతాడు. జానకి కోసం రాఘవుడు వానర సైన్యం సాయంతో లంకకు వెళ్లి రావణుడిని హతమార్చి, జానకిని చేపట్టడం మిగతా కథ.


ఎనాలసిస్ :

మనం చదువుకున్న రామాయణం, తెరపై ఇంతదాకా మనం చూసిన రామాయణంతో పోలిస్తే.. ఓం రౌత్ 'ఆదిపురుష్' పేరుతో తీసిన రామాయణం చాలా తేడాగా ఉందని అర్థమవుతుంది. పాత్రల పేర్ల దగ్గర నుంచే ఆ తేడా మనకు కనిపిస్తుంది. మన తెలుగువాళ్లకు సీతారాములు అనే పేర్లతోటే ఎక్కువ అనుబంధం. రామునికి రాఘవుడు, సీతకు జానకి (జనకుని కుమార్తే కాబట్టి) అనే పేర్లు ఉన్నాయని మనకు తెలుసు కానీ ఆ పేర్లతోటే సినిమా అంతా సీతారాములను సంబోధిస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. దీనికంటే లక్ష్మణుడిని ఎక్కడా ఆ పేరుతో ఎవరూ సంబోధించరు. శేషు అనే పిలుస్తారు. ఇది మనకు చాలా కష్టంగా తోస్తుంది. రామభక్తుడైన హనుమంతుడిని ఆ పేరుతో కానీ, లేదా ఆంజనేయుడు అనే పేరుతో కానీ మనం పిలుస్తాం. ఈ సినిమాలో ఆయన మనకు భజరంగ్‌గా మాత్రమే దర్శనమిస్తాడు. రావణుడు, విభీషణుడు, ఇంద్రజిత్ (మేఘనాథుడు), సుగ్రీవుడు, అంగదుడు లాంటి వాళ్లు మాత్రం ఆ పేర్లతోటే కనిపిస్తారు.  

ఆహార్యాలు కూడా కొత్తగా, వింతగా ఉంటాయి. రాముడు నీలమేఘశ్యాముడుగా మనకు తెలుసు. ఇందులో సాధారణ రంగుతోనే కనిపిస్తాడు. అలాగే నిండు మీసాలు, కొద్దిగా వెంట్రుకలు మొలిచిన గడ్డంతో, వంటి మీద మనం ఇప్పటిదాకా ఎరుగని దుస్తులతో ఉంటాడు. జానకి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో సినిమా అంతా కనిపిస్తుంది. ఇక రావణుడి ఆహార్యం మరీ వింతగా ఉంటుంది. మిలిటరీ కటింగ్, స్పైక్స్, ఫుల్ బియర్డ్‌తో, 'గేం ఆఫ్ థ్రోన్స్' సినిమాల్లోని యోధుల కాస్ట్యూమ్స్‌తో దర్శనమిస్తాడు. ఆయన కొడుకు ఇంద్రజిత్ వంటినిండా టాట్టూస్‌తో కనిపించి ఆశ్చర్యపరుస్తాడు. వానరుల్లో ఒక్క హనుమంతుడు మాత్రమే మనిషి రూపంలో కనిపించి, సుగ్రీవుడు, వాలి, అంగదుడు సహా మిగతా వానరులు కోతుల రూపాల్లో కనిపిస్తారు. జాంబవంతుడు ఎలుగుబంటి రూపంలోనే అగుపిస్తాడనుకోండి.

సంభాషణల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లంకమీద దండెత్తి వచ్చిన వానర సైన్య సమేత రామునితో "సూర్యోదయంలోపు తిరిగెళ్లిపోండి బిడ్డా" అని ఇంద్రజిత్ బెదిరించడం ఈ సినిమాలోనే చూస్తాం. లంక సైన్యాన్ని "ఉతికెయ్యండి" అని వానర సైన్యంతో రాముడు అనడం ఇందులోనే చూస్తాం. ఏం భాష ఇది? హిందీలో వాళ్లు రాసుకున్న డైలాగ్స్‌ని అలాగే యథాతథంగా దించెయ్యడం వల్ల వచ్చిన చిక్కా ఇది? సినిమాని తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించారు కదా, తెలుగువాళ్లను దృష్టిలో పెట్టుకొని కదా సంభాషణలు రాయాల్సింది? ఆ విషయం అలా ఉంచితే రామ రావణ యుద్ధంలో రాముడు, రావణుడు పరస్పరం ఒక్క మాట మాట్లాడుకోకుండానే యుద్ధం చేశారా?.. 'ఆదిపురుష్' చూశాక మనకు కలిగే సందేహం ఇది. ఈ తెలుగు 'ఆదిపురుష్‌'లో సంభాషణలన్నీ సహజంగా కాకుండా ఒక డబ్బింగ్ సినిమాకు రాసినదానికంటే నాసిరకంగా ఉన్నాయి.

సీతను రావణుడు ఎలా ఎత్తుకుపోయాడు? భిక్షం వెయ్యడానికి రక్షరేఖ దాటిన సీతను ఆమెను తాకలేనని గ్రహించిన రావణుడు ఆమె నిల్చున్న నేల సహా ఎత్తుకుపోతాడని మనం చదువుకున్నాం. ఈ సినిమాలో ఆమెను మాయాతాళ్లతో బంధించి, తన వాహనం రాకాసి గబ్బిలం మీద పెట్టుకొని తీసుకుపోతాడు రావణుడు. రావణుడు పరమశివభక్తుడు. నారాయణుడు కావాలని ఆయన ఎన్నడూ అనుకున్నట్లు మనకు తెలీదు. కానీ దశ కంఠాల్లో ఒక కంఠం అతడితో "లక్ష్మిని చేపట్టు, నారాయణుడివైపోతావ్" అంటుంది. వాలిని రాఘవుడు వధించే సన్నివేశం కూడా మనం ఇంతదాకా చూసిన, చదివిన దానికి భిన్నంగా ఉంది. మొదలే, రాఘవుని పరిచయ సన్నివేశంలో ఆయన మీదకు వేలాది మంది వింత జీవులు దాడి చేస్తారు. వారెవరో చెప్పడం దర్శకుడు మర్చిపొయ్యాడు. 

సీతను రావణుడు ఎత్తుకు వెళ్లడం, తల్లడిల్లిన రాముడు వానర సైన్యాన్ని కూడదీసుకొని సముద్రంపై సేతువు నిర్మించి, దాని మీదుగా వెళ్లి లంకపై దండెత్తి రావణుడిని సంహరించి, సీతను తిరిగి చేపట్టడం.. అనేది ఒక ఉద్వేగభరిత కథ. ఆ భావోద్వేగాన్ని రేకెత్తించే సన్నివేశాల్ని కల్పించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యాడు. రావణుడి పాత్రను చిత్రించడంలో ఆయన హాలీవుడ్ సూపర్‌హీరో సినిమాల్లోని విలన్ రోల్స్‌ను మోడల్‌గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే 'ఆదిపురుష్'ను టెక్నికల్ జంజాటంలో ఓం రౌత్ తనదైన కోణం నుంచి తీసిన ఆధునిక రామాయణం అని భావించాలి.

అజయ్-అతుల్ సంగీతం పాటల వరకు బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్‌లో నేటి వాయిద్యాల హోరు ఎక్కువగా వినిపించి, చికాకు పెడుతుంది. కార్తీక్ పళని కెమెరా పనితనం చాలాచోట్ల కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ మినహాయిస్తే తనవంతు బాధ్యతను అతను చక్కగా నిర్వర్తించాడు. ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో ఫర్వాలేదనిపించేట్లు ఉన్నా, సెంకండఫ్‌లో తీసికట్టుగా ఉంది. పోరాట సన్నివేశాలు వీడియో గేమ్స్‌ను తలపించాయి. 

నటీనటుల పనితీరు

రాఘవునిగా ప్రభాస్ రూపం కొత్తగా ఉంది. శూర్పణఖను సమ్మోహితుడ్ని చేసేంత సమ్మోహనాకారునిగా మాత్రం ఆయన కనిపించలేదు. ఆయన కళ్లలోనూ మెరుపులు కనిపించలేదు. ఫ్ల్యాష్‌బ్యాక్ రూపంలో వచ్చే ఒక బ్లాక్ అండ్ వైట్ సీన్‌లో ఆయనను చూసిన ప్రేక్షకులు "హేయ్.. ప్రభాస్ అలా ఉన్నాడేంటి?" అనడం వినిపించింది. నటన వరకు ఓకే. జానకిగా కృతి సనన్ నటన ఫర్వాలేదు కానీ, ఆమె ఆ పాత్రకు నప్పలేదనిపించింది. రావణుడిగా సైఫ్ అలీఖాన్ విచిత్ర వేషధారణతో నవ్వు తెప్పించినా, విలనీని బాగా ప్రదర్శించాడు. భజరంగ్ (హనుమంతుడు)గా దేవ్‌దత్త నాగే సరిగ్గా సరిపోయాడు. శేషు (లక్ష్మణుడు)గా సన్నీ సింగ్, ఇంద్రజిత్‌గా వత్సల్ సేఠ్, మండోదరిగా సోనాల్ చౌహాన్ పాత్రల పరిధి మేరకు చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'ఆదిపురుష్' తెలుగువాళ్లకు తెలిసిన రామాయణం కాదు. మన దేశీయులకు అందునా ఒక మతం వారికి నిత్య పారాయణ గ్రంధమైన రామాయణాన్ని ఆధునిక తరానికి ఆధునిక టెక్నాలజీతో అందించాలనే తాపత్రయంతో ఓం రౌత్ అనే ఉత్తరాది దర్శకుడు వెండితెరపై తీసుకొచ్చిన ఒక విఫల యత్నం.  

- బుద్ధి యజ్ఞమూర్తి