English | Telugu

ఇవ్వాలా వద్దా అన్న ధర్మసందేహంలో ఆలయ అధికారులు...

శారదా పీఠం వారు పంపిన ప్రతిపాదనకు కొందరు ఆలయ అధికారులు ఏమి చేయాలా అన్న అయోమయంలో పడిపోయారు. జనవరి 3 వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని స్వరూపానందేంద్ర నిర్ణయించారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సాయం చెయ్యాలి అంటూ గత నెల 11 న విశాఖ శారదా పీఠం నుంచి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు లేఖను పంపారు. మహాసభల నిర్వహణకు తగిన ఆర్థిక సహాయం అందించాలని శారదా పీఠం వారిని కోరింది. ఈ లేఖను పరిశీలించి పరిగణన లోకి తీసుకోవాలని మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ కు సిఫారసు చేశారు.కమిషనర్ ఇదే ప్రతిపాదనను శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాల ఈవోలుకు అందజేశారు.

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం కోరారు. హిందూ సనాతన ధర్మ ప్రచారం కోసం ఉద్దేశించిన కార్యక్రమానికి నిధులు ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉంటే, పరిగణనలోకి తీసుకోవటానికి తగిన ప్రతిపాదనలు పంపించండని దేవాదాయ శాఖ కమిషనర్ 5 ప్రధాన ఆలయాల ఈవోలకు లేఖ రాశారు. కమిషనర్ లేఖ అందుకున్నఆయా దేవస్థానాల అధికారులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే భక్తులిచ్చే కానుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అవసరాలకు వాడుకోవాలి, ఎలాంటి ధార్మిక కార్యక్రమాలనైనా దేవస్థానమే నిర్వహించాలి. కానీ తమ ఆలయానికి దేవాదాయ శాఖకు సంబంధం లేకుండా ఒక పీఠం నిర్వహించే సొంత కార్యక్రమానికి దేవుడు డబ్బులు ఇవ్వొచ్చా అనే సందేహం ఆ ఆలయ అధికారులల్లో మొదలైంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహాసభలు నిర్వహించడం మంచిదే, కానీ అందుకు ఇతర దేవస్థానాల సొమ్మును పంపాలి అనడం శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా లేదని దేవాదాయ శాఖ అధికారులల్లో ఒకరు అభిప్రాయపడ్డారు. స్వయంగా సర్కారు పెద్దలకు దగ్గరైన స్వామి కావడం పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలని దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాయడంతో ఆయా దేవస్థానాల అధికారులు దీని పై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.మరి ఆలయ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.