English | Telugu

మోడీ చైనా టూర్ మేట‌రేంటి?

ఆగ‌స్ట్ 29 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ మోడీ జ‌పాన్, చైనా ప‌ర్య‌టిస్తున్నారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఆర్ధికాంశాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ట్టు చెబుతున్నారు విదేశాంగ శాఖ అధికారులు. ప‌ది ట్రిలియ‌న్ జపాన్ ఎన్లు వ‌చ్చే ప‌దేళ్ల‌లో భార‌త్ లో పెట్టుబడుల వ‌ర్షం కురిసేలా తెలుస్తోంది.

అస‌లీ యాత్ర మొత్తంలో చైనా షాంఘై కోప‌రేటివ్ స‌మ్మిట్ లోనే అస‌లు మేట‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. పుతిన్ తో స‌హా మొత్తం ఇర‌వై మందికి పైగా ప్ర‌పంచ నాయ‌కులు ఈ వేదిక మీద ఎక్కి ఒకేసారి క‌నిపించ‌నున్నారు. గ‌తంలో ర‌ష్యాలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశాల త‌ర్వాత మోడీ.. పుతిన్, జిన్ పింగ్ ని క‌ల‌వ‌డం ఇదే.

ఇప్ప‌టికే మోడీ చైనా ప‌ర్య‌టించి ఏడేళ్లు పూర్తి కావ‌స్తోంది. ఇప్ప‌టికే ట్రంప్ మోడీ స‌ర్కార్ పై గ‌రం గ‌రంగా ఉండ‌టం తెలిసిందే. అమెరికా అప్పీళ్ల కోర్టు.. ఇలాంటి సుంకాల విధింపు అక్ర‌మం అని కోర్టు తీర్పునిచ్చినా ఆయ‌న సుప్రీం కెళ్లి త‌ద్వారా.. తాను అనుకున్న‌ది సాధించాల‌నుకుంటున్నారు. దీంతో మోడీ స‌ర్కార్ కూడా రూట్ మార్చింది. మ‌న వ‌స్త్ర ఉత్ప‌త్తులు దిగుమ‌తి పొందే 40 దేశాల్లో మేళాలు పెట్టి మార్కెటింగ్ పెంచి.. అమెరికా నుంచి ఎదురు కానున్న‌.. నష్టాన్ని పూడ్చే య‌త్నం చేస్తోంది.

ఇదంతా ఇలా ఉంటే మోడీ ప్ర‌స్తుతం ఇటు పుతిన్ తో పాటు అటు జిన్ పింగ్ ని సైతం క‌ల‌సి కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకునేలా తెలుస్తోంది. 2001లో ఆరు యురేషియా దేశాలతో మొద‌లైన ఎస్. సీ. ఓ.. ప్ర‌స్తుతం ఇర‌వైకి పైగా దేశాలతో పెద్ద కూట‌మిగా అవ‌త‌రించింది. ఇదిలా ఉంటే ఈ స‌మ్మిట్ ద్వారా గ్లోబ‌ల్ సౌత్ అనే కాన్సెప్ట్ ని కూడా తెర‌పైకి తెచ్చేలా తెలుస్తోంది. వీరంతా క‌ల‌సి వ‌చ్చే రోజుల్లో అమెరికా వ్య‌తిరేకంగా తీర్మానాలు తీస్కుంటే అదో గేమ్ ఛేంజ‌ర్ కానుంది.

ఇప్ప‌టికే యూరోలా బ్రిక్స్ దేశాలు సైతం ఒక క‌రెన్సీని ఎంపిక చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు మొద‌లు పెడితే డాల‌ర్ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గం ప‌డిపోతుంది. ఆపై ఈ బ్లాక్ మెయిల్ డ్రామాలకు ఇక కాలం చెల్లిపోతుంది. ఇలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యంగానీ ఈ స‌మ్మిట్ ద్వారా ఒక్క‌టి బ‌య‌ట‌కొచ్చినా చాలు ట్రంప్ ఖేల్ ఖ‌తం దుక‌ణం బందేనంటున్నారు.

ఇవే కాకుండా ఆర్ధిక- ర‌క్ష‌ణ- సైనిక ప‌ర‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కూడా ఈ దేశాలుగానీ చేసుకోవ‌డం మొద‌లైతే అమెరికా, దాని వెన‌కున్న యురోపియ‌న్ దేశాలు దాదాపు ఒంట‌రిగా మిగిలిపోతాయి. వీట‌న్నిటిలోకీ యూఎస్ పెద్ద‌న్న పాత్ర దారుణంగా ప‌డిపోయి బ‌ల‌హీన ప‌డుతుంది.

ఇలాంటిదేదో ప్లాన్ చేయ‌డానికే భార‌త్, 2020 నాటి స‌రిహ‌ద్దు గొడ‌వ‌ల‌ను మ‌ర‌చిపోయి చైనాతో చెలిమి చేయ‌డాన‌కి ముందుకొస్తోంది. దానికి తోడు ఇటు పాకిస్తాన్, అమెరికా పంచ‌న చేర‌డంతో చైనా కూడా భార‌త్ వైపే మొగ్గు చూపించేందుకు ముందుకొస్తోంది.

అందుకే ఆగ‌స్ట్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భార‌త్ ప‌ర్య‌టించి.. చైనా రావ‌ల్సిందిగా మోదీకి జింగ్ పింగ్ పంపిన ఆహ్వాన ప‌త్రం అందించారు. అందులో భాగంగా మోడీ ఇటు జ‌పాన్ తో ఆర్ధిక అటు చైనాతో దౌత్య ప‌ర‌మైన స‌ర్దుబాట్ల కోసం ఈ గ్రాండ్ టూర్ వేశార‌ని అంచ‌నా వేస్తున్నారు దౌత్య వ్య‌వ‌హారాల నిపుణులు.