English | Telugu

బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం?

ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే ధన్ ఖడ్ నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు. దన్ ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ మక్తసరి స్పందన, అలాగే రాజీనామా ఉపసంహరణకు ఎలాంటి బుజ్జగింపులు లేకుండా తక్షణ ఆమోదమే ఇందుకు తార్కాణగా చెబుతున్నారు. ఆయన ధిక్కార వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న బీజేపీ పెద్దలు ఆయనపై అభిశంసన పెట్టాలని కూడా ఒక దశలో ఆలోచన చేశారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆయనకు గౌరవ విడ్కోలు పలుకుదామన్న కాంగ్రెస్ ప్రతిపాదన ను కూడా ప్రభుత్వం తిరస్కరించడం కమలనాథులకు ఆయన పట్ల ఉన్న ఆగ్రహ స్థయిని తెలియజేస్తున్నదని చెప్పాల్సి ఉంటుంది.

ప్రొటోకాల్ విషయంలో ధన్ ఖడ్ కు కేంద్రానికి విభేదాలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పర్యటనలో ఈ విషయం ప్రస్ఫుటంగా బయటపడింది. జేడీవాన్స్ తనను కలవకపోవడం వెనుక కేంద్రం పాత్ర ఉందని ధన్ ఖడ్ ఆ సమయంలో బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాహనాల విషయంలో, మంత్రుల కార్యాలయాల్లో ఫోటోల విషయంలో కూడా ధన్ ఖడ్, కేంద్రం మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వి రైతుల గిట్టుబాటు ధర విషయంలో ధన్ ఖడ్ కేంద్రమంత్రిని నిలదీయడం వంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ వ్యవహారం కూడా ధన్ ఖడ్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది. ఇక చివరిగా రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు అధికారపక్ష నేత నడ్డా కంటే ఎక్కువ సమయాన్ని ధన్ ఖడ్ కేటాయించడం ఈ విభేదాలకు పరాకాష్టగా మారింది.

ఇక న్యాయమూర్తి వర్మ అభిశంసన వ్యవహారంలో న్యాయవ్యవస్థను కూడా బాధ్యత వహించేలా చేయాలంటూ కేంద్రం ఆశలపై ధన్ ఖడ్ నీళ్లు చల్లడంతో బీజేపీ పెద్దల ఆగ్రహం పీక్స్ కు చేరిందని పరిశీలకులు అంటున్నారు. ఎన్డీయే ఎంపీల సంతకాలు లేకుండా ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆమోదించవద్దని మూడు సార్లు ప్రభుత్వ పెద్దలు ధన్ ఖడ్ కు సూచించినా ఆయన పట్టించుకోలేదు. ఇలా కేంద్రంతో ఆయన కు పొసగలేదనీ, దీంతో అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. హమ్మయ్య అనుకుని కేంద్రం వెంటనే ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నదానిపై కసరత్తులలో మునిగిపోయింది.