English | Telugu
ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాలు కలిసి రావాలి : సీఎం రేవంత్ రెడ్డి
Updated : Aug 30, 2025
ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వామపక్షాలు కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మా పాలమూరు బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి కడదాకా పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాల నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎదిగారని అన్నారు. దాదాపు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడనే ఉన్నారని చెప్పారు. సామాజిక చైతన్యం ఉన్న నాయకుడు అని అన్నారు.
పేదల జీవితాల్లో మార్పు రావాలని నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా తాము కూడా ప్రయత్నం చేస్తామని.. త్వరలోనే క్యాబినేట్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు. వారి కంటే గొప్పగా ఆ పాత్రను ఇంకెవరూ పోషించలేరని అన్నారు. కొందరు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. బిహార్‌లో ఐదు లక్షల ఓట్లు మాయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది అని కోరారు.