English | Telugu
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి
Updated : Aug 16, 2025
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 29.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులు దాటింది.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.