English | Telugu

మరో కొత్త పథకానికి జగన్ రూపకల్పన... ఈసారి 25లక్షల మందికి లబ్ది...

ఉద్యోగ ఉపాధి కల్పన, సంక్షేమమే ప్రధాన అజెండాగా విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో వెల్ఫేర్‌ స్కీమ్‌కు రూపకల్పన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చి రికార్డు సృష్టించిన జగన్‌... అదే బాటలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇళ్లు లేనివారికి ముందుగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలందరికీ ఇంటి స్థలాలు, ఆ తర్వాత ఇల్లు కట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఉగాది రోజున 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే 24లక్షల 80వేల మంది లబ్దిదారులను గుర్తించిన జగన్ ప్రభుత్వం... వీళ్ల కోసం ఎంత భూమి కొనుగోలు చేయాలనేదానిపై సమగ్ర నివేదిక కోరింది. దాంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సిద్ధంచేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే వార్డుల వారీగా వివరాలు సేకరించిన గ్రామ వాలంటీర్లు... అర్హుల జాబితాను రెడీ చేశారు. అయితే, లబ్దిదారులకు సొంత గ్రామం, మండలం పరిధిలోనే ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోతే, ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. మొత్తం ప్రక్రియను నాలుగైదు నెలల్లో పూర్తిచేసి, రానున్న ఉగాదికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.